నగరంలో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఆకస్మిక తనిఖీలు
14వ నెంబరు వార్డు సచివాలయంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటుకు హామీ
సచివాలయంకు గైర్హాజరు అవుతున్న ఇద్దరు వలంటీర్ల తొలగింపు
విధులకు హాజరుకాని మహిళా పోలీస్‌కు మెమో
కస్పా హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ
విజయనగరం, ఏప్రిల్ 28 (ప్రజా అమరావతి):
నగరంలోని 14వ వార్డు సచివాలయంలో తగిన వసతులు వున్న దృష్ట్యా ఇక్కడ ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేయిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి చెప్పారు. దీనివల్ల నగరంలో ప్రజలకు ఆధార్ నమోదు మరింత సులువవుతుందని పేర్కొన్నారు. అంబటిసత్రం సమీపంలో 13వ వార్డు పరిధిలో వున్న సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10-05 గంటలకే సచివాలయంకు చేరుకున్న జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. వి.ఆర్.ఓ. పోస్టు ఖాళీగా వుందని, మహిళా పోలీసు ఇంకా హాజరు కావలసి వుందని మిగిలిన సిబ్బంది కలెక్టర్‌కు వివరించారు. 10.45 వరకు సచివాలయంలోనే జిల్లా కలెక్టర్ వున్నప్పటికీ మహిళా పోలీస్ హాజరుకాకపోవడంతో మెమో జారీ చేయాలని ఆదేశించారు. అదే సమయంలో వార్డు సచివాలయ సిబ్బందిలో కొందరు యూనిఫాం ధరించకపోవడంపై కలెక్టర్ ప్రశ్నించారు. వలంటీర్ల హాజరును తనిఖీ చేసిన కలెక్టర్ 10, 2 క్లస్టర్ వలంటీర్ల హాజరు చాలా తక్కువగా వుండటాన్ని గమనించి వారిద్దరినీ తొలగించాలని ఆదేశించారు. గర్భిణీలకు వైద్య తనిఖీలకు సంబంధించి ఏంటి నటల్ రిజిష్టర్‌ను తనిఖీ చేశారు. అయితే ఆరోగ్య సహాయకురాలు వార్డులోని ప్రసూతి మహిళలు, వారి వైద్య తనిఖీలపై స్పష్టంగా చెప్పలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వార్డులో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ ఆరా తీశారు. అర్హులందరికీ పథకాలు అందుతున్నదీ లేనిదీ తెలుసుకున్నారు. సచివాలయ సేవలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే అంశంపై ఆరా తీశారు. వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, తడి పొడి చెత్త సేకరణ ఏవిధంగా జరుగుతున్నదీ శానిటేషన్ కార్యదర్శిని ప్రశ్నించారు. వార్డు పరిధిలో వాననీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వార్డు సచివాలయాల సమన్వయకర్త హరీష్ కూడా తనిఖీకి హాజరయ్యారు.
కస్పా హైస్కూల్ సందర్శన
నగరంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించే నిమిత్తం జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి కస్పా మునిసిపల్ హైస్కూల్‌ను సందర్శించారు. పరీక్ష కేంద్రంలోని పలు గదుల్లో పరీక్షల నిర్వహణను పరిశీలించారు. పాఠశాల హెచ్.ఎం. ఆర్.శంకర్రావు, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ వి.చిన్నంనాయుడు స్కూలులో ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయని, పరీక్ష రాసే విద్యార్ధులకు ఇబ్బందిలేకుండా అన్ని వసతులు కల్పించామని వివరించారు. పాఠశాల వాతావరణం బాగుందని కలెక్టర్ పేర్కొంటూ విద్యార్ధుల సంఖ్యపై ఆరా తీశారు. 1890 మంది విద్యార్ధులు ఈ స్కూలులో విద్యాభ్యాసం చేస్తున్నారని, 223 మంది పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నట్టు హెచ్.ఎం. వివరించారు.
addComments
Post a Comment