అధికారులు సుదీర్ఘకాలంపాటు పనిచేయాల్సి ఉంటుందినెల్లూరు, ఏప్రిల్ 18 (ప్రజా అమరావతి): జిల్లాలోని అధికారులపై ప్రజా ప్రతినిధులందరికీ అపారమైన గౌరవం, అభిమానం ఉందని, మనమంతా ఎలాంటి అభిప్రాయ బేధాలకు తావులేకుండా  సమన్వయంతో పనిచేసి జిల్లా సమగ్రాభివృద్ధికి  కృషి చేద్దామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాని గోవర్ధన రెడ్డి పిలుపునిచ్చారు.

 మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో  జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులు కేవలం ఐదేళ్ళు మాత్రమే అధికారంలో ఉంటారని, అధికారులు సుదీర్ఘకాలంపాటు పనిచేయాల్సి ఉంటుందని,మనమంతా ప్రభుత్వంలో భాగస్వామ్యమేనని, జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడం మన కనీస బాధ్యత గా గుర్తించాలని సూచించారు. 

 ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించి పరిష్కరించేందుకు ప్రయత్నించాలని, తమ స్థాయిలో పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా స్థాయిలో కూడా సమస్యలు పరిష్కారం కాకపోతే మంత్రిగా తాను బాధ్యత తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రతి వారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 

 ముందుగా మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఇరిగేషన్, వ్యవసాయం, సివిల్ సప్లైస్, పంచాయతీ రాజ్, డ్వామా, హౌసింగ్, డి ఆర్ డి ఎ, ఉద్యానవన, మైక్రో ఇరిగేషన్ శాఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాల పురోగతి, చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికపై జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ హరేంధిర ప్రసాద్ తో కలిసి ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ప్రధానంగా జిల్లాలో రెండో పంట కు సంబంధించి సాగునీటి విడుదలపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో వచ్చే వారంలో చర్చించి సాగునీటి సలహా సంఘ సమావేశం నిర్వహించేందుకు ఒక తేదీని ఖరారు చేస్తామన్నారు.

 ముందుగా మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి విఆర్సి కూడలిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

 ఈ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ, ఎమ్మెల్సీ ఈ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వెంకటగిరి, ఉదయగిరి, కావలి ఎమ్మెల్యేలు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎస్పి శ్రీ విజయరావు, ట్రైనీ కలెక్టర్ శ్రీ పర్హాన్ అహ్మద్ ఖాన్, డిఎఫ్ఎఫ్ శ్రీ షణ్ముఖ కుమార్, నెల్లూరు, కందుకూరు, ఆత్మకూరు, కావలి ఆర్ డి వో లు పి కొండయ్య, ఉమాదేవి, శ్రీ కిరణ్ కుమార్, శ్రీ శీనా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీ హరి నారాయణ, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, విద్యుత్ శాఖల ఎస్ఈలు శ్రీ కృష్ణ మోహన్, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ విజయ కుమార్ రెడ్డి, హౌసింగ్,డ్వామా, డిఆర్డిఎ పీడీలు శ్రీ నరసింహ, శ్రీ తిరుపతయ్య, సాంబశివారెడ్డి, సివిల్ సప్లైస్ డిఎం శ్రీమతి పద్మ, తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. Comments