తాడేపల్లి (ప్రజా అమరావతి); సామాజిక తనిఖీ అంటే నిజ నిర్దారణే
(ఫ్యాక్ట్ ఫైండింగ్) కాని తప్పుల నిర్దారణ (ఫాల్ట్ ఫైండింగ్) కాదు అని గుర్తెరిగి సిబ్బంది జాగ్రత్తగా పనిచేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. శుక్రవారం అంటే 29-4-2022న తాడేపల్లిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన 26 జిల్లాల సామాజిక తనిఖీ సిబ్బంది శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిక్షణ కార్యక్రమం రెండురోజుల పాటు జరుగనుంది.
వివిధ రాష్ట్రాలను పరిశీలించి, వాటితో పోల్చినప్పుడు మన రాష్ట్రంలో సామాజిక తనిఖీ అత్యంత పకడ్బందిగా జరుగుతోందని, అయితే ప్రక్రియ విధానంలో కొన్ని అంతరాలు ఉన్నట్టు తన దృష్టికి వచ్చిందని కమిషనర్ కోన శశిధర్ ఈ సందర్భంగా అన్నారు. క్షేత్ర స్థాయి సందర్శన సమయంలో పని జరిగిందా లేదా, నాణ్యతా ప్రమాణాలు పాటించారా లేదా అన్న విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలని, ముందస్తు సమాచారం ఇచ్చిన తరువాతే గ్రామస్థాయి ప్రజా వేదిక పటిష్టంగా నిర్వహించాలని, అక్కడే బాధ్యులను గుర్తించాలని ఆ తరువాతే మండలస్థాయి ప్రజా వేదికను నిర్వహించాలని ఆయన సూచించారు. గ్రామ సభ నిర్వహణ సక్రమ౦గా లేదు అనే ఫిర్యాదులు వచ్చినట్లయితే, బృంద నాయకుడైన ఎస్.ఆర్.పిని ప్రధమ బాధ్యులుగా చేసి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ కోన శశిధర్ హెచ్చరించారు.
సామాజిక తనిఖీ సిబ్బందిపై వచ్చే ఫిర్యాదులను విచారించి చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రశక్తే లేదని, సామాజిక తనిఖీ అమలు ప్రక్రియలో అంతరాలు ఉండొద్దని, ప్రాజెక్ట్ డైరెక్టర్ కు సమాచారం ఇవ్వకుండా, త్రిసభ్య కమిటీ లేకుండా విచారణలు నిర్వహించవద్దని అంటూ బదిలీ చేస్తే ఎక్కడికైనా వెళ్లి సిబ్బంది పనిచేయాలని కమిషనర్ అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉన్నతాధికారులు చెప్పే విషయాలను శ్రద్ధగా ఆలకించి, అవగాహన పర్చుకుని విధాన పరమైన లేదా ఆర్ధికపరమైన అవకతవకలు జరిగాయా అన్న విషయాన్ని అర్ధం చేసుకుని ఖచ్చితమైన నిజ నిర్ధారణ చేయాలని అలాగే రాష్ట్ర స్థాయి పర్యవేక్షకులు, జిల్లా స్థాయి సిబ్బందికి విషయ అవగాహన కల్పించి వారికి మార్గనిర్దేశ౦ చేయాలని, ఈ కార్యక్రమం ద్వారా సందేహాలు నివృత్తి చేసుకుని, సిబ్బంది అంతా నూతనోత్సాహంతో పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇజిఎస్ సంచాలకులు పి చిన తాతయ్య మాట్లాడుతూ మే 5 వ తారీఖు నుంచి పూర్తిస్థాయిలో క్షేత్ర పర్యటనలు చేసి ప్రతి గ్రామపంచాయతీలో సామాజిక తనిఖీలు నిర్వహించాలని, గ్రామీణాభివృద్ధి శాఖ పథకాలు అమలులో సామాజిక తనిఖీ సిబ్బందిది కీలక పాత్ర అని అయన తెలిపారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో చీఫ్ క్వాలీటీ కంట్రోల్ అధికారి సుబ్బారెడ్డి, సామాజిక తనిఖీ డైరెక్టర్ జగదీశ్ కుమార్, విజిలెన్స్ డిప్యూటీ కమిషనర్ మల్లికార్జునరావు, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment