రైతు శ్రేయస్సే లక్ష్యంగా మరో ముందడుగు
ఖరీఫ్‌లో వరికి బదులు 25వేల ఎకరాల్లో ఆరుతడి పంటలు
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి వినూత్న ప్రయత్నం
ఇక్రిశాట్ సైంటిస్టులతో ఆన్లైన్లో భేటీ
త్వరలో జిల్లాకు శాస్తవ్రేత్తల బృందం
విజయనగరం, ఏప్రెల్ 20 (ప్రజా అమరావతి) ః
రైతుల శ్రేయస్సే ధ్యేయంగా, పంటలకు తగిన గిట్టుబాటు ధరను కల్పించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. సంప్రదాయ పంటలకు బదులు, వ్యవసాయాన్ని లాభసాటి చేసే పంటల విధానానికి శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా వచ్చే ఖరీఫ్‌లో సుమారు 25వేల ఎకరాల్లో వరికి బదులు ఆరుతడి పంటలను సాగు చేయాలని నిర్ణయించారు. దీనికోసం హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్టపంటల పరిశోధనా సంస్థ (ఇక్రశాట్) డైరెక్టర్, సీనియర్ శాస్త్రవేత్తలతో, బుధవారం ఆన్లైన్లో భేటీ అయ్యారు. జిల్లా భౌగోళిక పరిస్థితులను, పంటలు, రైతుల స్థితిగతులను, నేల స్వభావాన్ని వివరించి, అవసరమైన సహాకారాన్ని అందించాలని కోరారు.
ఈ ఆన్లైన్ సమావేశంలో కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, జిల్లాలో సుమారుగా 4లక్షలా 22వేల మంది రైతులు ఉన్నారని చెప్పారు. వీరిలో 95శాతం మంది చిన్న, సన్నకార రైతులేనని, సగటున ఎకరా లోపు భూమి ఉన్న రైతులే ఎక్కువని తెలిపారు. జిల్లాలోని నేల స్వభావాన్ని బట్టి 63శాతం భూముల్లో నత్రజని తక్కువగా ఉందని, 46శాతం భూముల్లో భాస్వరం ఎక్కువగా ఉందని, 54శాతం భూముల్లో పొటాష్ మధ్యస్థంగా ఉందని వివరించారు. జిల్లాలో ఖరీఫ్‌లో సుమారు 2,27,532 ఎకరాల్లో వరి సాధారణ సాగు జరుగుతోందన్నారు. దీనిలో దాదాపు 66,050 ఎకరాలు వర్షాధారమని, భూ సారం కూడా తక్కువని, ఈ భూముల్లో తగినంతగా వరి దిగుబడి, నాణ్యత కూడా లేకపోవడం వల్ల, రైతులు ప్రతీఏటా నష్టపోతున్నారని చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆయా భూముల పరిస్థితిని బట్టి ఆరుతడి పంటలను సాగు చేయించి, రైతులకు వారి శ్రమకు తగిన గిట్టుబాటు ధరను కల్పించేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలన్నారు. ఈభూములను పరిశీలించి, వచ్చే ఖరీఫ్‌లో ప్రయోగాత్మకంగా కనీసం 25వేల ఎకరాల్లో అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగుకు తగిన సాంకేతిక సహకారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించాలని కోరారు.
దీనిపై ఇక్రిశాట్ రీసెర్ఛ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాధ్ దీక్షిత్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.రాజేష్ స్పందిస్తూ, పంటల గురించి, సాగు గురించి తమతో ఒక కలెక్టర్ మాట్లాడం ఇదే మొదటిసారిగా పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సుపై శ్రద్దపెట్టి, ప్రత్యేక భేటీ ద్వారా, సహకారాన్ని కోరడం పట్ల, జిల్లా కలెక్టర్ సూర్యకుమారిని వారు ముందుగా అభినందించారు. త్వరలో జిల్లాకు శాస్త్రవేత్తలను పంపించి, ఆ భూములను పరిశీలిస్తామని చెప్పారు. నేల స్వభావాన్ని బట్టి తగిన పంటలను సూచించడం జరుగుతుందన్నారు. అలాగే చెరువులు, నీటి వనరుల పునరుద్దరుణ, భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు తగిన ప్రణాళికలను రూపొందించి అందజేస్తామని తెలిపారు. దీంతో పాటుగా కోత అనంతర యాజమాన్య పద్దతులుపైనా, పంటలను నిల్వచేసే విధానాలపైనా సలహాలను అందజేస్తామని చెప్పారు. పంటలకు తగిన గిట్టుబాటు ధరను కల్పించడం ద్వారా రైతులకు మేలు చేయడం కోసం మూడేళ్లపాటు అమలు చేసేందుకు తగిన పైలట్ ప్రాజెక్టును రూపొందించి ఇస్తామని డైరెక్టర్ దీక్షిత్ హామీ ఇచ్చారు. ఈ ఆన్లైన్ కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు వి.తారకరామారావు పాల్గొన్నారు.
addComments
Post a Comment