నెల్లూరు, ఏప్రిల్ 30 (ప్రజా అమరావతి):-రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా పక్షపాతి
అని, మహిళా సాధికారత కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
శనివారం ఉదయం వెంకటాచలం మండలం చెముడుగుంట గ్రామంలోని ఎస్ ఆర్ ఐ డి ఎస్ ఫంక్షన్ హాల్ లో సర్వేపల్లి నియోజకవర్గం లోని ఐదు మండలాల "వైయస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత పంపిణీ, వాలంటీర్లకు వందనం కార్యక్రమాలు " ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులకు వేద పండితులు పూర్ణకుంభంతో, పొదుపు మహిళలు దీపాలతో ఘనంగా స్వాగతం పలికారు.
తొలుత మంత్రివర్యులు జ్యోతి ప్రజ్వలన గావించి ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు చేదోడువాదోడుగా ఉంటూ మహిళల సాధికారత కోసం వైయస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, అమ్మ ఒడి,తోడు వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కుటుంబంలో ఆర్థిక క్రమశిక్షణ మహిళలకే సాధ్యమని గుర్తించి ప్రతి పథకం వారి పేరిటనే ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. గత ప్రభుత్వం మహిళల రుణ మాఫీ చేస్తామని చెప్పి కూడా చేయలేదన్నారు. 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి ఉన్న రుణ బకాయిలు నాలుగు విడతలుగా తిరిగి చెల్లిస్తామని చెప్పిన ప్రకారం ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆసరా పథకం కింద మహిళల బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమ చేస్తున్నామన్నారు. అలాగే వైయస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద ఎవరైతే మహిళలు క్రమశిక్షణగా సకాలంలో మూడు లక్షల రూపాయలు లోపు అప్పు తీసుకుని తిరిగి చెల్లించిన వారందరికీ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ మూడు సంవత్సరాల కాలంలో 26,98,822 స్వయం సహాయక సంఘాల లోని 2,79,09,521 మంది సభ్యులకు 3616 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కింద అందించడం జరిగిందన్నారు. జిల్లాలో 1,23,441 సంఘాలకు చెందిన 12,68,355 మంది మహిళలకు 196 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు ఆ ప్రకారంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 2019- 20 సంవత్సరంలో 4369 గ్రూపులకు చెందిన 45 వేల మంది మహిళలకు 8 కోట్ల 35 లక్షల రూపాయలు, 2020-21 సంవత్సరానికి 5068 గ్రూపులకు చెందిన 52,200 మంది మహిళలకు 7.55 కోట్ల రూపాయలు, 2021-22 వ సంవత్సరానికి 5402 గ్రూపులకు చెందిన 55,863 మంది మహిళలకు 7.94 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. పొదుపు మహిళలు తీసుకునే రుణాలకు ఎక్కడా లేని విధంగా 80 పైసలకు వడ్డీ ని వసూలు చేయడం జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్క మహిళ ప్రభుత్వం మంజూరు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతేకాకుండా చదువుకున్న మహిళలు ఔ త్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా శిక్షణ ఇవ్వడంతోపాటు కావాల్సిన మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్ వసతులు కల్పిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు మహిళలు ఆలోచించి ముందుకు రావాలన్నారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలు ఏర్పడడంతో సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి జిల్లాకు పోయి ఉంటే చాలా ఇబ్బందులు పడేవారమని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ప్రజల ఆశలు,ఆకాంక్షల మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోని కొనసాగించి నందులకు వారికి ఈ సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. నూతన మంత్రివర్గంలో తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఆ స్థాయికి ఎదగడానికి తోడ్పడిన జిల్లా ప్రజలు నియోజకవర్గ ప్రజలందరికీ తాను ఎప్పుడూ కృతజ్ఞత గానే ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యే అయినా ఇప్పుడు మంత్రి నయినా తన నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో బిడ్డగా తోబుట్టువుగా భావించి వారి సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతగానో పాటుపడుతున్నారన్నారు ఈ వ్యవస్థల ద్వారా ఎప్పటికప్పుడు గ్రామ ప్రజలకు అక్కడికక్కడే మేలు జరిగే విధంగా చేయడంతో దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఈ వ్యవస్థలు ఆదర్శంగా నిలిచాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అమలవుతున్న తీరుతెన్నులను పరిశీలించి చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ ఉంది కాబట్టి అక్కడ కేవలం 1200 కోట్ల రూపాయలతోనే అమలు చేయడం జరుగుతుందని, అదే వారి రాష్ట్రంలో 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అమలు చేయలేమని, వాలంటరీ వ్యవస్థ ఉంటే తప్ప ఈ కార్యక్రమం అమలు చేయలేమని అధ్యయనం చేసిన వారు చెప్పడం జరిగిందన్నారు. వాలంటీర్ల వ్యవస్థకు సమాజంలో మంచి గుర్తింపు లభించిందన్నారు. ప్రతి నెలా టంచనుగా ఒకటో తేదీనే పింఛన్దారుల ఇంటి వద్దకే పోయి పింఛను పంపిణీ చేస్తున్నారన్నారు. వారు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడూ ఉంటుందన్నారు. కేవలం ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం తో స్వచ్ఛందంగా సేవలందిస్తు పింఛను సకాలంలో పంపిణీ చేస్తున్న వాలంటీర్లను గుర్తించి సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర పేరుతో సన్మానించడం జరుగుతోందన్నారు. వారికి 30వేలు, 20వేలు, 10 వేల చొప్పున వరుసగా నగదు పురస్కారాన్ని కూడా అందజేయడం జరుగుతోందన్నారు. సర్వే పల్లి నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోసిమెంట్ రోడ్లు, డ్రైన్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నామన్నారు, మట్టి రోడ్డు లేని నియోజవర్గం ఏదైనా ఉందంటే అది సర్వేపల్లి నియోజకవర్గ మేనని స్పష్టం చేశారు. అర్హతగల వారికి అందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు విడుదల చేసేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా రహదారి మార్గాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా పొదుపు సంఘాల మహిళలకు 7.9 3 కోట్ల రూపాయల వైఎస్సార్ సున్నా వడ్డీ మెగా నమూనా బ్యాంకు చెక్కు మంత్రి పంపిణీ చేశారు. ఐదు మండలాల వాలంటీర్లకు శాలువాలు మెడల్స్, ధ్రువీకరణ పత్రాలతో మంత్రి ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా చల్లా యానాదులకు, వారి పిల్లలకు మంత్రిగారు నూతన వస్త్రాలు, దుస్తులు ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రి గారి తో పాటు డి ఆర్ డి ఎ పిడి శ్రీ సాంబశివారెడ్డి, వెంకటాచలం జడ్పిటిసి శ్రీ సుబ్రమణ్యం, ఎంపీపీ శ్రీమతి కవితమ్మ, ఎంపీడీవో శ్రీమతి సరళ తహసిల్దార్ శ్రీ ప్రసాద్, సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, మనుబోలు, ముత్తుకూరు, పొదలకూరు, టి.పి. గూడూరు మండలాల జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు తదితర ప్రజా ప్రతినిధులు, ఎంపీడీవోలు తహసీల్దార్లు పొదుపు సంఘాల మహిళలు వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment