వాలంటీర్లు వ్యవస్థలో మార్పు తెచ్చారని, ఇంకా మంచి సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అన్నారు.

 


భీమవరం: ఏప్రిల్ 7,(ప్రజా అమరావతి);


వాలంటీర్లు వ్యవస్థలో మార్పు తెచ్చారని, ఇంకా మంచి సేవలు అందించి  ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి అన్నారు.




గురువారం భీమవరం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో  గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా  జరిగింది.  కార్యక్రమాన్ని ముందుగా జిల్లా కలెక్టర్ శ్రీమతి పి. ప్రశాంతి, జడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ లు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్   శ్రీమతి ప్రశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కి దగ్గరగా ఉన్న వ్యవస్థ సెక్రటేరియట్ వ్యవస్థఅని దానిలో భాగంగా పనిచేస్తున్న వాలంటీర్లను సత్కరించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సెక్రటేరియట్,  వాలంటీర్ వ్యవస్థలు ప్రజలకు సేవ చేయడంలో ముందున్నాయి అన్నారు. పారదర్శకంగా సేవలందిస్తు ఈ వ్యవస్థలు ఏ లక్ష్యంతో ఏర్పాటు చేసారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చేలా కృషి చేయాలన్నారు ప్రజలకు అన్ని పథకాలు తెలిసేలా అవగాహన కల్పించాలన్నారు.   లబ్ధిదారులకు చేకూరే లబ్ధిని ముందుగానే గ్రహించి వారికి తెలియచేయాలన్నారు. 50 కుటుంబాలకు కేటాయించిన ఒక వాలంటీర్ ఆ కుటుంబంలో ఒక సభ్యుడు మెలుగుతున్నారని, వాలంటీర్ ఫోన్ నెంబరు కచ్చితంగా ఆ ఇంట్లో ఉంటుందన్నారు. ఏదైనా ఒక రోజు వాలంటీర్ కనిపించకపోతే వాళ్ళకి జరిగే లబ్ది ఎక్కడ కోల్పోతామనే భయం కూడా వారిలో నెలకొంటుందని అన్నారు నాలుగు వేల కుటుంబాలకు ఒక సచివాలయాన్ని 11 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి వారి ద్వారానే సంక్షేమ పథకాలను వివిధ సేవలను వారి ఇంటికి చేరువలోనే అందజేయడం జరుగుతుందన్నారు. భీమవరం జిల్లాలోని 19 మండలాలు, 5 పట్టణ  ప్రాంతాలలో  8 వేల  ఐదు వందల 97 మంది గ్రామ, వార్డు  వాలంటీర్లు పనిచేస్తున్నారని, వీరిలో 125 మంది సేవ వజ్ర, 375 మంది సేవా రత్న, 8 వేల  97 మంది వాలంటీర్లు సేవ మిత్ర పురస్కారాలకు ఎంపికయ్యారన్నారు.  వీరికి  ప్రశంసా పత్రం, శాలువా, నగదు పురస్కారంతో పాటు మెడల్, బ్యాడ్జీలతో సత్కరించి అందజేయడం జరుగుతుందన్నారు.  సేవా వజ్ర పురస్కారం పొంది వాలంటీర్లకు 30 వేల రూపాయలు, సేవా రత్న పురస్కారం పొందిన వాలంటీర్లకు 20 వేల రూపాయలు, సేవా మిత్ర పురస్కారం పొందిన వాలంటీర్లకు 10 వేల  రూపాయలు చొప్పున నగదు బహుమతిని అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.


జిల్లా పరిషత్ చైర్మన్  కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతా అంశమైనా నవరత్నాల కార్యక్రమంలో   ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల ముంగిటకు అందించడంతోపాటు  వారితో మమేకమై, వారి కుటుంబ సభ్యులుగా కలిసిపోయి వాలంటీర్లు  సేవలందించడం అభినందించదగిన విషయమన్నారు. గతంలో అవ్వ, తాత లు పంచాయతీ, పోస్ట్ ఆఫీసులు చుట్టూ తిరిగి పింఛన్ పొందాల్సి ఉండేదని ఇప్పుడు మొదటి తేదీనే వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి అందజేయడంతో వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు అన్నారు. ఇకముందు కూడా వాలంటీర్లు సేవా భావంతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పేద కుటుంబానికి అందేలా కృషి చేయాలన్నారు.


             భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి అంటే అందరి గృహాలలో అభివృద్ధి జరగడం అనేది ఇది ముఖ్య మంత్రి ఆలోచన అన్నారు.  వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మదిలో మెదిలిన అద్భుతమైన ఆలోచన అని అన్నారు.  గతంలో  పేదలకు  పెన్షన్, ఇళ్ల స్థలాలూ, రుణాలు  మంజూరు వంటి సేవలతో పాటు కుల,నివాస, ఆదాయ ధ్రువీకరణ పాత్రల వంటి చిన్న సేవలకు సైతం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగవలసి వచ్చేదన్నారు. గ్రామ సచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్థతో ఎటువంటి సేవలైన పేదల ముంగిటకు చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికె దక్కుతుందన్నారు.  ప్రతీ నెల మొదటి తారీఖు తెల్లవారుఝామునే టంచనుగా పెన్షన్ అందించి పేద ప్రజల స్వంత మనుషులుగా వాలంటీర్లు సేవలందిస్తున్నారన్నారు.  కోవిడ్  సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు చేసిన సేవలను ప్రపంచం మొత్తం గుర్తించిందన్నారు.

             అనంతరం నరసరావుపేట జిల్లా నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ఉత్తమ గ్రామ వాలంటీర్లకు సేవ మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అధికారులు, ప్రజా ప్రతినిధులు,  వాలంటీర్లు వీక్షించారు.


అనంతరం ఉత్తమ సేవలందించిన గ్రామ,వార్డు వాలంటీర్లకు సేవ మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు.

         కార్యక్రమంలో భీమవరం ఆర్డిఓ దాసి రాజు, ఎంపిపి  నరసింహ రాజు,  జెడ్పిటిసి నరసింహారావు, ఎఏంసి చైర్మన్ తిరుమాని ఏడుకొండలు, ఎండిఓ జి. పద్మ, వివిధ శాఖల అధికారులు, వాలంటీరులు,  తదితరులు పాల్గొన్నారు.



Comments