సచివాలయ సిబ్బందికి శతశాతం హాజరు ఉండాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
గంట్యాడ, (విజయనగరం), ఏప్రెల్ 13 (praja amaravati) ః
సచివాలయ సిబ్బంది, వలంటీర్లకు శతశాతం హాజరు ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. సకాలంలో విధులకు హాజరై, సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. గంట్యాడ మండలం లక్కిడాం గ్రామ సచివాలయాన్ని, కలెక్టర్ సూర్యకుమారి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సచివాలయ సిబ్బంది, వలంటీర్ల హాజరును పరిశీలించారు. కొంతమందికి తక్కువ ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాజరుశాతం మెరుపడాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ వారాంతానికి జగనన్న కాలనీలో అన్ని ఇళ్లను గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. లేదంటే ఇచ్చిన పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణం, పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ది పనులు, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనుల వివరాలను తెలుసుకున్నారు. సిమ్మెంటు కోసం ఎదురు చూడకుండా, మంజూరైన గ్రావెల్ రోడ్లను, ఇతర పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వచ్చే ఖరీఫ్‌కు సమగ్రమైన వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని, దీనికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలులో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి, జిల్లాలో రైస్‌మిల్లుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రైస్ మిల్లుల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి ప్రభుత్వపరంగా సహాకారాన్ని అందించడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. అనంతరం కాలనీలో నిర్మాణంలో ఉన్న జగనన్న ఇళ్లను పరిశీలించారు. కాలనీ ఇళ్లమీదుగా వెళ్తున్న విద్యుత్ తీగలను గమనించి, వాటిని ప్రక్కకు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో గంట్యాడ ఇన్‌ఛార్జ్ తాశీల్దార్ స్వర్ణకుమార్, ఎంపిడిఓ నిర్మలాదేవి, ఎంఇఓ విజయలక్ష్మి, వ్యవసాయాధికారి హర్షలత, హౌసింగ్ ఏఈ జగన్‌మోహన్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ సునీల్‌కుమార్, సర్పంచ్ పవన్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment