మూడురకాల నిధులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి
• గురుకులాలు, హాస్టళ్లలో సమస్యల పరిష్కారానికి కార్యాచరణ
• అధికారుల సమన్వయంతో పనులపై పెరగనున్న పర్యవేక్షణ
• సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున
అమరావతి, మే 19 (ప్రజా అమరావతి): మూడు రకాలైన నిధులను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో మౌలిక వసతులను మెరుగుపరచడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. తమ శాఖకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న కార్పొరేషన్ల అధికారులు, సాంఘిక సంక్షేమ అధికారులతో సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు.
అంబేద్కర్ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను మంత్రి నాగార్జున రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, అంబేద్కర్ గురుకులాలు, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నాడు-నేడు నిధులతో పాటుగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను కూడా వినియోగిస్తామని తెలిపారు. అన్ని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా మెరుగుపర్చడం ద్వారా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించాలన్న కృతనిశ్చయంతో కృషి చేస్తున్నామని చెప్పారు. సొంత భవనాలు లేని చోట వాటిని నిర్మించడానికి, గురుకులాలు హాస్టళ్లలో తాగునీటి సమస్యలను పరిష్కరించే పనులకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. సాంఘిక సంక్షేమశాఖకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను ప్రస్తుతం ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్ (ఎపీ ఇడబ్ల్యుఐడీసీ), పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ల ద్వారా చేపట్టడం జరుగుతోందని గుర్తు చేసారు. ఈ సందర్భంగానే ఎపీ ఇడబ్ల్యుఐడీసీ ద్వారా చేపట్టిన కార్యక్రమాల ప్రగతిని సమీక్షించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇడబ్ల్యుఐడీసీ లో సాంఘిక సంక్షేమశాఖకు చెందిన పనులు ఎక్కువగా ఉన్న కారణంగా తమ శాఖకు చెందిన పనులను పర్యవేక్షించడానికి, తమ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవడానికి ఎఇ, డిఇ ల నుంచి మొదలుకొని ఎస్ఇల దాకా కొందరు అధికారులను ప్రత్యేకించాలని ఈ సందర్భంగా నాగార్జున ఇడబ్ల్యుఐడీసీ చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు. దీంతో పాటుగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన పనులను గురించి సమీక్షించి వాటి ప్రగతి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు. పోలీస్ హౌసింగ్ ద్వారా చేపడుతున్న పనులపై పర్యవేక్షణ మరింతగా పెరగాలని, పనుల నాణ్యత విషయంలోనూ దృష్టిని కేంద్రీకరించాలని అభిప్రాయపడ్డారు. ఇడబ్ల్యుఐడీసీ, పోలీస్ హౌసింగ్ ల అధికారులు తమ కార్పొరేషన్ల ద్వారా చేపడుతున్న పనులను గురించి జిల్లాల స్థాయిలో ఉండే సోషియల్ వెల్ఫేర్ డీడీలు, గురుకులాల డీసీఓలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని, వారితో సమన్వయం చేసుకొని పని చేయాలని నాగార్జున ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, డైరెక్టర్ హర్షవర్ధన్, ఇడబ్ల్యుఐడీసీ చీఫ్ ఇంజనీర్ నాగరాజు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎస్ఇ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment