*సంకోచాలు విడనాడి.. సంతోషంగా జీవించాలి*
*ఆరోగ్య రక్షణపై, పరిశుభ్రతపై అవగాహన సదస్సులో కలెక్టర్ సూర్యకుమారి
*ప్రతి ఆడపిల్లా నెలసరి ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచన
విజయనగరం, మే 28 (ప్రజా అమరావతి) ః మహిళల జీవన విధానంలో భాగమైన నెలసరి ప్రక్రియపై సంకోచాలను విడనాడి.. అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సంతోషంగా జీవించాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి హితవు పలికారు. కౌమార దశ నుంచి మోనోపోజ్ దశ వరకు జరిగే అన్ని సంక్లిష్ట ప్రక్రియలలో నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య తలెత్తినట్లయితే కుటుంబంలోని పెద్దలను లేదా వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. మంచి ఆహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. కౌమార దశలోకి అడుగుపెట్టిన దశలో ఎన్నో సందేహాలు కలుగుతాయని వాటిని కుటుంబ పెద్దలను లేదా వైద్యులను సంప్రదించటం ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రపంచ మహిళా నెలసరి పరిశుభ్రతా అవగాహన దినోత్సవ కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సభకు విచ్చేసిన విద్యార్థినులను, ఆశా కార్యకర్తలను, అంగన్ వాడీ వర్కర్లను, సహాయకులను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రతి ఆడపిల్లా తన దైనందిన జీవితంలో జరిగే పరిణామాలపై, నెలసరి ప్రక్రియపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. రుతుక్రమం అనేది సిగ్గు పడాల్సిన విషయం కాదని దానికి సంబంధించిన సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. బాలికల ఆరోగ్య రక్షణను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పాఠశాలల్లో న్యాప్‌కిన్స్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. సంప్రదాయ పద్దతులను విడనాడి... ఆధునిక పద్దతులను అవలంబించి పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మూఢనమ్మకాలకు స్వస్తి పలికాలని, నిర్భయంగా బ్రతకాలని పేర్కొన్నారు. ప్రయివేటు భాగాలను ఎప్పటికప్పుడు శుభ్ర పరచుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డీఎం & హెచ్ వో ఎస్.వి. రమణ కుమారి మాట్లాడుతూ సున్నితమైన భాగాలకు సంబంధించిన వ్యాధులు, రుగ్మతలకు సంబంధించి సొంత వైద్యం సరికాదని, వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్లను, గోడపత్రికలను కలెక్టర్, ఇతర అధికారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
*ప్రత్యేక వైద్య బృందం సలహాలు*
అనంతరం వివిధ ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్యులు బాలికలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. సమస్యలపై వారితో ప్రత్యేకంగా మాట్లాడారు. అవసరమైన సలహాలు అందించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. దీనిలో భాగంగా డా. లావణ్య పీపీటీ ద్వారా పలు అంశాలపై క్షున్నంగా వివరించారు.
*పరిశుభ్రతపై అవగాహనా ర్యాలీ*
ప్రపంచ మహిళా నెలసరి పరిశుభ్రతా దినోత్సవం సందర్భంగా స్థానిక మహారాజ ఆసుపత్రి నుంచి జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ముందుగా కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వివిధ విభాగాల అధికారులు, వైద్యులు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ సహాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థినులు ప్లకార్డులు చేతబట్టి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని కొనసాగించారు.
కార్యక్రమాల్లో డీఎం & హెచ్‌వో ఎస్.వి. రమణ కుమారి, ఐసీడీఎస్ పీడీ శాంత కుమారి, డీసీహెచ్ఎస్ లక్ష్మణరావు, మెప్మా పీడీ సుధాకర్, జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ సహాయకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment