గుంటూరు జిజిహెచ్ ఘటనపై స్పెషలిస్టు డాక్టర్ల కమిటీ నియామకం

*గుంటూరు జిజిహెచ్ ఘటనపై స్పెషలిస్టు డాక్టర్ల కమిటీ నియామకం*


*వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి కృష్ణబాబు వెల్లడి*


అమరావతి (ప్రజా అమరావతి): 

గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జిజిహెచ్)లో  ఐదేళ్ల చిన్నారి ఆరాధ్య తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై తక్షణ విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన స్పెషలిస్టు డాక్టర్ల కమిటీని నియమించామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి . కృష్ణబాబు మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని డిఎంఇ డాక్టర్ రాఘవేంద్రరావును ఆదేశించారు. చిన్నారి కను రెప్పపై ఏర్పడిన కణితిని తొలగించేందుకు శస్త్రచికిత్స కోసం సోమవారం నాడు జిజిహెచ్లో చేర్చగా ఆపరేషన్ చేయాలంటూ ఐసియులోకి తీసుకెళ్లిన వైద్యులు  జీపచ్ఛవంలా తమకు అప్పగించారంటూ ఆరాధ్య తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో  కృష్ణబాబు ఈ మేరకు చర్యలకు ఉపక్రమించారు.  గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్  సి .పద్మాపతి ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీ లో విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ .కె సుందరాచారి, డాక్టర్ ఎ విష్ణువర్ధన్ లను సభ్యులుగా నియమించారు. ఈ ఘటనపై కమిటీ మూడు రోజుల్లో గా విచారణ పూర్తి చేసి  ప్రభుత్వానికి నివేదికను  అందజేస్తుందని కృష్ణబాబు  తెలిపారు.