రేపల్లె అత్యాచార బాధితురాలిని పరామర్శించిన 'వాసిరెడ్డి పద్మ'
- మంత్రుల సమక్షంలో ప్రభుత్వ సాయం అందజేత
- రైల్వేస్టేషన్లలో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి
- రైల్వేశాఖ ఉన్నతాధికారులకు లేఖ
అమరావతి (ప్రజా అమరావతి):
రేపల్లె రైల్వేస్టేషన్ అత్యాచార బాధితురాలిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సోమవారం పరామర్శించారు. రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, పట్టణ, పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్ తో పాటు వాసిరెడ్డి పద్మ ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో బాధిత కుటుంబాన్ని కలిశారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు, ఒంగోలు కలెక్టరు దినేష్ కుమార్, ఎస్పీ మల్లికా గార్గ్ సమక్షంలో ప్రభుత్వ సాయం చెక్కును బాధితురాలి భర్తకు వాసిరెడ్డి పద్మ అందించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాత్రిళ్లు జనసంచారం తక్కువ ఉండే ప్రాంతాలను అడ్డాలుగా చేసుకుని అరాచకాలకు పాల్పడుతున్న నేరగాళ్ల భరతం పట్టేందుకు పోలీసు శాఖ చురుగ్గా పనిచేస్తుందన్నారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. గుంతకల్లు రైల్వే ఎస్పీతో ఇప్పటికే తాను మాట్లాడానని.. చిన్న రైల్వేస్టేషన్ లలో సైతం పోలీసు గస్తీని పెంచాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా రైల్వేశాఖ ఆవరణల్లో మహిళల భద్రత, రక్షణ ఏర్పాట్లకు సంబంధించి ఆ శాఖ ఉన్నతాధికారులను వివరణ కోరుతూ మహిళా కమిషన్ లేఖ పంపుతున్నట్లు చెప్పారు. ఇటీవల గురజాల రైల్వే హాల్ట్ వద్ద చోటుచేసుకున్న ఘటనలో ఇప్పటికే పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారని.. రేపల్లె ఘటనలోనూ గంటల వ్యవధిలోనే నేరస్తులను పట్టుకోవడంపై ఆమె పోలీసులను అభినందించారు. బాధితులకు న్యాయం జరిగేంతవరకు మహిళా కమిషన్ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని వాసిరెడ్డి పద్మ హామీనిచ్చారు.
addComments
Post a Comment