అమలాపురం 10, మే (ప్రజా అమరావతి);
భారత వాతావరణ శాఖ జారీ చేసిన తుఫాను హెచ్చరిక నేపథ్యంలో కోనసీమ జిల్లా కలెక్టరేట్లో విపత్తు అప్రమత్తత, సహాయక చర్యల కొరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ఈ కంట్రోల్ రూమ్
జిల్లా కలెక్టర్ కోనసీమ అమలాపురం కార్యాలయం 08856 293104
ఫోన్ నెంబర్ 24 గంటలు, తుఫాను ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకూ సహాయక చర్యలు అందించే నిమిత్తం పని చేస్తుందని మంత్రి తెలిపారు. క్షేత్ర స్థాయి నుండి ఎటువంటి తుఫాను సహాయక, రక్షణ చర్యలకు సంబంధించి కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులపై కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయక బృందాలు స్పందించి తక్షణ సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.
తుపాను హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితులను నిరంతరాయంగా గమనిస్తూ, అవసరమైన సహాయ చర్యలు చేపట్టేందుకు సముద్ర తీర మండలాల ప్రధాన కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరిక నేపధ్యంలో గాలితో కూడిన వర్షం పడుతున్నందున కోనసీమ జిల్లా యంత్రాంగo సహాయ చర్యలు కొరకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అప్రమత్తం అయిందన్నారు. అసని పేరుతో పిలుస్తున్న ఈ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో బలమైన గాలులు వీచి, ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదు అవుతోందన్నారు. అలాగే సముద్రం ఎగసిపడే కెరటాలతో అల్లకల్లోలంగా ఉందన్నారు.
తుఫాను హెచ్చరిక దృష్ట్యా జిల్లాలోని మత్స్యకారులెవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని మంత్రి మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెంటనే తీరానికి తిరిగి వచ్చేలా మత్స్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
విపత్తు నిర్వహణ సమన్వయ శాఖల అధికారులందరూ వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిజేస్తూ అప్రమత్తo చేయాలన్నారు. మండల స్పెషల్ ఆఫీసర్లు, తహసిల్దార్లు, యండిఓలు తుఫాను పరిస్థితులను గమనిస్తూ విలేజ్ ఫంక్షనరీల సహకారంతో అవసరమైన తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. అకాల వర్ష సూచన దృష్ట్యా పోలాల్లోను, కుప్పలలోను ఉన్న ధాన్యం పాడవకుండా రైతులు జాగ్రత్తలు పాటించేలా సూచనలు అందించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
పెనుగాలుల వల్ల చెట్లు కూలి రహదారి రవాణాకు, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఎదురైతే వెంటనే పునరుద్ధరించేందుకు సిద్దంగా ఉండాలని, రోడ్లు భవనాలు, ట్రాన్స్కో అధికారులకు మంత్రి సూచించారు.
తుఫాను ప్రభావo ప్రస్తుతం జిల్లాలో కొద్ది మేర ఉందని ఎటువంటి పరిస్థితి ఎదురైనా సమర్ధవంతంగా నియంత్రించేందుకు అధికారులు అందరూ సన్నద్ధం కావాలని మంత్రివర్యులు సూచించారు.
addComments
Post a Comment