*సచివాలయ సేవలు, మనబడి నాడు-నేడు పనులు సంతృప్తికరం*
* *ఆకాంక్ష జిల్లాల కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్*
* *ఒంటిమిట్ట గ్రామ సచివాలయాన్ని, వెంకటేశ్వరపురం ఎంపీయూపీ పాఠశాలను పరిశీలన*
కడప, మే 1 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చాలా బాగున్నాయ్. వైఎస్ఆర్ జిల్లాలో సచివాలయ సేవలు, మనబడి నాడు-నేడు పనులు ఆదర్శవంతంగా ఉన్నాయని.. ఆకాంక్ష జిల్లాల కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన.. ఆదివారం రెండో రోజున జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జేసీ సాయికాంత్ వర్మతో కలిసి ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఒంటిమిట్ట గ్రామ సచివాలయ భవన సముదాయాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను కలెక్టర్, జేసిలు ఆయనకు వివరించారు. అనంతరం అన్ని రకాల సిబ్బంది విధులను, డ్యూటీ రికార్డుల నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, వాటిలో ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారనే వివరాలను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సచివాలయ భవనంలో ప్రదర్శించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితా, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 2021 - 22 సంక్షేమ క్యాలెండర్ లను పరిశీలించారు. అనంతరం.. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందించే సేవలను ఆయన పరిశీలించారు. ఇన్పుట్ మెటీరియల్ రూమ్, కియోస్క్ మిషన్, డెమో ఎక్యుప్మెంట్ రూమ్, లైబ్రరీ రూము లను పరిశీలించారు. ఈ సందర్భంగా.. గ్రామ సచివాలయాల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్, జిల్లా వ్యవసాయ బోర్డు సలహా మండలి సభ్యులు వేణుగోపాల్ రెడ్డి, స్థానిక తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి, జెడ్పి సీఈవో సుధాకర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖాధికారి నాగేశ్వరరావు, కడప తహశీల్దార్ శివరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది, స్థానిక మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
* *వెంకటేశ్వరపురం ఎంపీయూపీ పాఠశాలను పరిశీలించిన పీయూష్ కుమార్*
ఇటీవల మనబడి నాడు-నేడు కార్యక్రమంలో అభివృద్ధి చేసిన మాధవరం-1 పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురం ఎంపీయూపీ ఇంగ్లీషు మీడియం పాఠశాలను జిల్లా కలెక్టర్, జేసి లతో కలిసి ఆకాంక్ష జిల్లాల కేంద్ర ప్రాబరీ అధికారి పీయూష్ కుమార్ పరిశీలించారు. పాఠశాల భవనాలను కార్పోరేట్ స్థాయిలో ఆధునీకరించిన తీరును పరిశీలించి అభినందించారు. నాడు-నేడు క్రింద చేపట్టిన 10 రకాలైన అభివృద్ధి పనులను ఆయన గమనించారు. తరగతి గదుల్లో ఫర్నిచర్ అమరిక, టాయిలెట్లలో వసతులు, పాఠశాల ఆవరణలో సదుపాయాలు, మంచినీటి వసతి తదితర అన్ని అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, కొర్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయని అభినందించారు. పిల్లల పాఠ్య పుస్తకాలను, పథనాశక్తిని ఆయన గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్, జేసిలు, సంబందిత అధికారుల సేవలు ప్రశంసనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష అభియాన్ పివో డా. ప్రభాకర్ రెడ్డి, పీఆర్ ఎస్.ఈ. శ్రీనివాసులురెడ్డి, స్థానిక సర్పంచ్ జానకిరామయ్య, ఎంఇఓ వెంకట్రామిరెడ్డి, హెడ్ మాస్టర్ సుధాకర్, పేరెంట్ కమిటీ చైర్మన్ సుబ్బారాయుడు, రెవెన్యూ సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment