నెల్లూరు, మే 11 (ప్రజా అమరావతి) :--. ఆసని తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో మరో రెండు రోజుల వరకు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల
ని, ఆస్తులు ప్రాణ నష్టం జరక్కుండా ఎప్పటికప్పుడు అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ కే వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి క్యాంప్ కార్యాలయం నుండి తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై జిల్లా అధికారులు, క్షేత్రాధికారులతో టెలికాన్ఫరెన్స్, రాష్ట్ర ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ వి సి హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, గ్రామాల్లో సంబంధిత తహసిల్దార్లు ఎంపీడీవోలు అవసరాన్ని బట్టి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లోనూ వేట కోసం సముద్రం లోకి వెళ్ళకుండా వారిని అప్రమత్తం చేయాలని సూచించారు. గ్రామస్థాయిలో ఆయా గ్రామాల విఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు అందరూ అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. జలవనరుల శాఖ అధికారులు సిబ్బంది సాగునీటి పథకాలు, చెరువుల్లోకి వస్తున్న నీటి ప్రవాహం, సముద్రంలోకి విడుదల చేసిన నీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. జిల్లా కలెక్టరెట్లో 1077 టోల్ ఫ్రీ నెంబర్ తో నిరంతరం పనిచేసే కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని, అలాగే అన్ని రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయాల్లో, తాసిల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ విభాగాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్యం, త్రాగు నీరు, విద్యుత్తు వంటి అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలుగకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎక్కడైనా అవసరమైతే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. తుఫాను ప్రభావిత మండలాలు ఎన్ని మండలాలు పెన్నా నదీ తీరం కలిగిన మండలాలలో మరింత అప్రమత్తంగా (హై అలర్ట్) ఉండాలన్నారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా పౌరసరఫరాల అధికారి అవసరమైనంత బియ్యము పప్పు నూనెల నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డి సి హెచ్ ఎస్ తో సమన్వయం చేసుకొని వైద్యానికి సంబంధించిన మందులు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని అవసరమైన చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. రహదారులు భవనాల శాఖ అధికారులు జాతీయ రహదారుల శాఖ బృందాలతో సమన్వయం చేసుకుని విద్యుత్ రంపాలు, జేసిబిలు అందుబాటులో ఉంచుకుని రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. విద్యుత్ సరఫరాకు ఏలాంటి అంతరాయం కలగకుండా ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఇ పర్యవేక్షిస్తూ విద్యుత్ స్తంభాలు, జనరేటర్ లు కావల్సినన్ని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీరు సరఫరా చేయడంతోపాటు అప్పుడప్పుడు క్లోరినేషన్ కూడా చేయాలన్నారు
జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపల్ కమిషనర్లు వారి పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. చిన్న మధ్య తరహా చెరువులకు ఎలాంటి గండి పడకుండా సానిక తహశీల్దార్ల సహకారంతో జలవనరుల శాఖ ఎస్ ఇ తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. పంటలు దెబ్బతినకుండా, మత్స్య, పశు సంపదలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యలు తెలియజేయాలన్నారు. ఆర్ డి వో లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు వారి ప్రధాన కార్యస్థానం లో ప్రజలకు అందుబాటులో ఉండి ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ కాన్ఫరెన్స్ లో సంయుక్త కలెక్టర్ శ్రీహరెందిర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కుమారి జాహ్నవి, డి ఆర్ ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, అదనపు ఎస్పీ శ్రీమతి వెంకటరత్నం, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, జలవనరుల శాఖ ఎస్.ఇ.లు శ్రీ సుబ్రహ్మణ్యం శ్రీ రామాంజనేయులు,శ్రీ కృష్ణ మోహన్, సోమశిల ఎస్ ఇ శ్రీ రమణారెడ్డి, డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి, డి.ఎస్.ఒ శ్రీ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, సి పి ఓ శ్రీ రాజు ,అగ్నిమాపక అధికారి శ్రీ శ్రీకాంత్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ జెడి శ్రీ మహేశ్వరుడు, మత్స్య శాఖ ఏడి శ్రీ ప్రసాదు తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment