సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత



నెల్లూరు, మే 8 (ప్రజా అమరావతి): దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా మహిళల ఆర్థికాభివృద్ధికి వేల కోట్ల రూపాయలతో అనేక సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలుచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 ఆదివారం ఉదయం ఉదయగిరి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైయస్ఆర్ సున్నా వడ్డీ మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ  మహిళలు కుటుంబ క్రమశిక్షణ కలిగి ఉంటారని, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో వారిని భాగస్వామ్యం చేస్తే మరింత ఉన్నతంగా జీవిస్తారని ఆకాంక్షించి, అనేక సంక్షేమ పథకాల్లో మహిళలకు ప్రాధాన్యత



నిస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు.  అమ్మ ఒడి, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్ఆర్ సున్నా వడ్డీ ఇలా అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని నేరుగా ఎటువంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా మహిళల ఖాతాల్లోకి జమ చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా మూడు విడతల్లో సుమారు రూ. 3615 కోట్లను, జిల్లాలో రూ. 196.18 కోట్లను, ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి రూ. 28.10 కోట్లను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విధాలుగా మోసం చేశారని, రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రుణ విముక్తి పత్రాలు మాత్రమే అందించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ మహిళలకు అండగా నిలుస్తున్నారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేసేవారని, ప్రస్తుతం ఏ పథకం కావాలన్నా ఎవరి ప్రమేయం లేకుండా ముఖ్యమంత్రి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల గడప వద్దకే వాలంటీర్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తాను రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రి అయితే, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉదయగిరి నియోజకవర్గానికి వ్యవసాయ శాఖ మంత్రి అని, ఉదయగిరికి ఏం కావాలో ఆయనకే బాగా తెలుసునని, ఉదయగిరి అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న వ్యక్తి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అని కొనియాడారు. 


 తొలుత ఉదయగిరి శాసన సభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తున్నానని, దివంగత ముఖ్యమంత్రి శ్రీ  వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నేను, మా అన్నగారైన శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. రాజశేఖర్ రెడ్డి ఉదయగిరి మెట్ట ప్రాంత అభివృద్ధికి అడిగినవి, అడగనివి కూడా చేశారని, తండ్రి కంటే మిన్నగా మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గొప్ప పరిపాలన ప్రజలకు అందిస్తున్నారని కొనియాడారు. సీఎం విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యేందుకు వాలంటీర్లు ముఖ్యమంత్రికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి తోడుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. 


 ముందుగా మంత్రి హోదాలో తొలిసారిగా ఉదయగిరి విచ్చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా నేతలు, కార్యకర్తలు ఉదయగిరి కూడలిలో అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రిని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు మేళతాళాలు, కోలాట నృత్య ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు, పూల జల్లులతో భారీ ర్యాలీగా సభాస్థలికి తీసుకొచ్చి ఘన స్వాగతం పలికారు. 

 ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ సాంబశివారెడ్డి, ఆత్మకూరు, కావలి ఆర్టీవోలు శ్రీ కిరణ్ కుమార్, శ్రీ శీనానాయక్, ఉదయగిరి నియోజకవర్గ వైసిపి ప్రచార కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, 8 మండలాల పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. 


Comments