వ్యవసాయ,మార్కెటింగ్ శాఖల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: మంత్రి గోవర్థన్ రెడ్డి

 వ్యవసాయ,మార్కెటింగ్ శాఖల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: మంత్రి గోవర్థన్ రెడ్డి



అమరావతి,మే 4 (ప్రజా అమరావతి): రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్ శాఖల్లో గల వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు రాష్ట్ర వ్యవసాయ,సహకార మరియు మార్కెటింగ్ అండ్ ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని

 గోవర్ధన్ రెడ్డి అన్నారు.

బుధవారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకు లోని సమావేశ మందిరంలో  వ్యవసాయ,సహకార, మార్కెటింగ్ మరియు ఆహారశుద్ధి అంశాలపై మంత్రి ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన వివిధ పథకాలు వాటి అమలు తీరు తెన్నులు, సమస్యలు గురించి వ్యవసాయ,మార్కెటింగ్ శాఖ  కమీషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.


ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానంగా మార్కెటింగ్ శాఖకు సంబంధించిన సమస్యలను త్వరిత గతిన పరిష్కరించి రైతాంగానికి అన్ని విధాలా మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.


 అదే విధంగా రైతుల నుండి ధాన్యం కొనుగోలు అంశంతో పాటు సుబాబుల్ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు.రైతులు, కొనుగోలుదారులు మరింత ప్రయోజనం పొందేందుకు వీలుగా రైతు బజార్లకు  సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ను మంత్రి గోవర్థన్ రెడ్డి  ఆవిష్కరించారు.


అనంతరం మార్క్ ఫెడ్ ద్వారా ప్యాకెట్ల రూపంలో అమ్మ బోయే వివిధ పప్పు దినుసులు, బియ్యం,మసాలా దినుసులు, మిర్చి వంటివి వివిధ వస్తువులను మార్కెటింగ్ శాఖ  విసి మరియు ఎండి ప్రద్యుమ్న మంత్రి వర్యులకు చూపించి వాటి గురించి వివరించారు.


ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మదుసూధన రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు నాగి రెడ్డి,రైతు బజారుల సిఇఒ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.



Comments