రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు


నెల్లూరు, మే 15 (ప్రజా అమరావతి): దేశంలో ఎక్కడా లేని విధంగా  మన రాష్ట్రంలో సీఎం శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మకంగా ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు


నకు ఎంపిక కావడం మనకు ఎంతో గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 ఆదివారం మధ్యాహ్నం పొదలకూరు మండలం ప్రభగిరిపట్టణంలోని కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమలో వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ  యూనిట్ ను  జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబుతో కలిసి మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ఈ కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికంగా ఎంతో మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగాయని, రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు తక్కువ ధరకు లభించి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. త్వరలోనే రెండో యూనిట్ కూడా ఏర్పాటు చేసి కిసాన్ క్రాఫ్ట్ ను మరింతగా విస్తరించి నిరుద్యోగులకు, రైతులకు ఉపయోగపడేలా మెరుగైన సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని, ఈ క్రమంలో  నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అవసరమైన అన్ని సేవలు సకాలంలో అందిస్తున్నాయని, ఈ కేంద్రాల పనితీరును పరిశీలించిన ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు కూడా తమ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి ప్రకటించే అవార్డుకు మన దేశం నుంచి మన రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలను ప్రతిపాదించడం శుభపరిణామమన్నారు. త్వరలోనే 3500 వరకు ట్రాక్టర్లను రైతన్నలకు సీఎం చేతుల మీదుగా ఒకేసారి అందిస్తామని, ట్రాక్టర్ లకు సంబంధించి సబ్సిడీ నగదును నేరుగా రైతుల ఖాతాల్లోనే 15 రోజుల్లో జమ చేస్తామన్నారు. అసని తుఫానుతో నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా రైతు భరోసా నగదును అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. 

 జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ జిల్లాలోని పోర్టు ఆధారిత ప్రాంతమైన నెల్లూరు జిల్లా ను సమీకృతం గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలవకుండా  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి  నెల్లూరు జిల్లాలోనే ఉండేలా కృషి చేసిన ఘనత మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డికే దక్కిందన్నారు. దీంతో రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా గా నెల్లూరు అవతరించిందన్నారు. కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమ వల్ల రైతులకు, యువతకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. 

 అనంతరం మంత్రి, కలెక్టర్ ను కిసాన్ క్రాఫ్ట్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. 

 ఈ కార్యక్రమంలో కిసాన్ క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవీంద్ర అగర్వాల్, సీఈఓ అంకిత జైన్, సి ఎఫ్ ఓ శ్రీ అజయ్ కుమార్ చలసాని, జిఎం కెఎన్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, ఎంపీడీవో సుజాత, తాసిల్దార్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. 


Comments