మురమళ్ల, కోనసీమ జిల్లా (ప్రజా అమరావతి);
*మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఇచ్చిన ప్రతి హామీని బాధ్యతగా నెరవేరుస్తూ... వరుసగా నాలుగో ఏడాది మత్స్యకార భరోసా.*
*రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15 జూన్ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు చొప్పున దాదాపు రూ.109 కోట్ల ఆర్ధిక సాయం.*
*దీంతో పాటు ఓఎన్‌జీసీ సంస్ధ పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్ల ఆర్ధిక సాయంతో కలిపి మొత్తం రూ.217 కోట్లు కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
దేవుడి దయతో ఈ రోజు దాదాపు 1.09 లక్షల మందికి మత్స్యకార భరోసా కింద వారి కుటుంబాలకు తోడుగా ఉండే కార్యక్రమం చేయగలుగుతున్నాం.
ఇక్కడకు వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మత్స్యకార సోదరులకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వా తాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
*180 ఏళ్ల క్రితం ఇక్కడ పుట్టిన మహానుభావుడు...*
దాదాపుగా 180 ఏళ్ల క్రితం ఈప్రాంతంలోనే ఒక మహానుభావుడు పుట్టారు. మనందరికీ పరిచయం ఉన్న పేరు... మల్లాడి సత్యలింగం నాయకర్. ఆయన కూడా ఒక మత్స్యకారుడు. ఆ రోజుల్లో తాను చదువుకోలేకపోయాడు. సముద్రమంత కష్టాల్లో తన జీవితం ప్రారంభించి, సముద్రాన్నే నమ్ముకుని, ఆ సముద్రాన్ని దాటి బర్మాకు చేరుకుని అక్కడ ఒక కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి... రంగూన్‌లో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఎదిగారు సత్యలింగం నాయకర్ గారు. అంత ఎత్తుకు ఎదిగి కూడా తన సొంత గడ్డమీద మమకారంతో తను సంపాదించినదంతా అమ్మేసి.. ఈ ప్రాంతంలో భూములు కొని ఈ ప్రాంతం వాళ్లకు మంచి జరగాలని ఒక ట్రస్టు పెట్టి దాదాపుగా 110 సంవత్సరాలుగా ఎన్నో వేలమంది పేదలకు మంచి చేస్తూ.. వారిని చదివిస్తూ ధానధర్మాలు చేసిన ఘనత ఆ మహానుభావుడిది. ఎందుకు ఈ విషయాలన్నీ ఇక్కడ చెబుతున్నానంటే.. ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే ఎందరికో మేలు జరుగుతుంది. మంచి బీజం పడిందంటే..అది చెట్టై... కొన్ని వేలమందికి మంచి చేసే పరిస్థితి వస్తుంది.
*ఆ గొప్ప వ్యక్తుల స్ఫూర్తిగా...*
అటువంటి గొప్ప వ్యక్తులను, వారు చేసిన మంచిని స్ఫూర్తిగా తీసుకోవడంతో పాటు దాన్నించి మనం ఇంకా ఎంత మంచి చేయగలుగుతామనే ఆలోచన చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ప్రతి మత్స్యకారుడే కాకుండా.. ప్రతి పేదవాడు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో పేదలు సైతం పేదరికం వల్ల ఇబ్బందులు పడకూడదు. పేదవాడికి మనం తోడుగా ఉన్నామన్న భరోసా ఇచ్చినరోజు... ప్రభుత్వం మంచి చేసిందని చెప్పుకుంటారు. అలా లేనప్పుడు మంచి చేసిందని చెప్పుకునే అర్హత ఆ ప్రభుత్వానికి ఉండదు.
*ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా....*
ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నాను. అటువంటి పేదరికంలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, పేదరికంలో ఉన్న అగ్రవర్ణాలను సైతం నా వాళ్లగా భావించాను. పేదరికంలో ఉన్న అక్కచెల్లెమ్మలను నా సొంత అక్కచెల్లెమ్మలుగా భావించి వాళ్లు గొప్పగా ఎదగాలని వాళ్ల కోసం దాదాపుగా 32 పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మనది.
*నేను విన్నాను.. నేను ఉన్నాను అనే భరోసా ఇస్తూనే...*
మత్స్యకార కుటుంబాలు ఎదుర్కుంటున్న సమస్యలు నా కళ్లారా చూశాను. 3648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి అఢుగులోనూ మీరు చెప్తున్న ప్రతి మాటనూ నేను విన్నాను. ఈ రోజు నేను ఉన్నాను అని భరోసా ఇస్తూనే అడుగులు ముందుకు వేశాను.
*వరుసగా నాలుగో సంవత్సరం మత్స్యకార భరోసా...*
అందులో భాగంగానే చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు అడుగులు వేసుకుంటూ వచ్చిన ప్రభుత్వం వరుసగా నాలుగో ఏడాది కూడా వైయస్సార్ మత్స్యకార భరోసా అమలు చేస్తోంది. అందులోభాగంగా 1,08,755 మందికి ఒక్కొక్క కుటుంబానికి రూ.10వేలు చొప్పున మొత్తంగా రూ. 109 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం.
*ఇప్పటివరకు రూ.419 కోట్లు..*
ఈ ఏడాది ఇవాళ మనం మత్స్యకారభరోసా కింద ఇస్తున్న రూ.109 కోట్లు కలిపితే... ఈ ఒక్క పథకానికి సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.419 కోట్లు నేరుగా మత్స్యకార కుటుంబాలకు ఇవ్వగలిగాం.
రాష్ట్ర చరిత్రలో మరే ప్రభుత్వం కూడా ఇంతగా సహాయం అందించిన చరిత్ర గతంలో ఎక్కడా లేదు. రాష్ట్ర చరిత్రను కాస్తా పక్కనపెడితే.. దేశంలో ఎక్కడా కూడా ఇలా సహాయం చేసిన చరిత్ర లేదు.
*ఓఎన్‌జీసీ వల్ల ఉపాధి కోల్పోయిన వారికీ....*
దేవుడు దయతో ఇక్కడ మత్స్యకార భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుడుతూనే.. మరోవైపు ఇక్కడే ఓఎన్‌జీసీ పైప్‌లైన్ కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లోని 69 గ్రామాల్లో 6078 బోట్లకు పనిలేకుండా పోయింది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఈ డ్రిల్లింగ్ చేస్తున్న సమయంలో 69 గ్రామాలకు చెందిన జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు మొదట విడత కింద వాళ్లు చేసిన 4 నెలల పనికి మనందరి ప్రభుత్వమే చొరవ తీసుకుని ఒక్కొక్క కుటుంబానికి నెలకు రూ.11,500 చొప్పున, 4 నెలలకు గాను రూ.46 వేలు ఇవాళ బటన్ నొక్కి వారి ఖాతాల్లో కూడా జమ చేస్తున్నాం.
ఇలా ఇప్పిస్తున్న సొమ్ము రూ.108 కోట్లు. మత్స్యకార భరోసాగా ఇస్తున్న సొమ్ము మరో రూ.109 కోట్లు. మొత్తంగా ఇవాళ రూ.217 కోట్లు ఈ కార్యక్రమంలో బటన్ నొక్కి మత్స్యకార అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు నేరుగా ఇస్తున్నాం. ఇంతమంచి కార్యక్రమం నాతో చేయిస్తున్నందుకు దేవుడికి సదా రుణపడి ఉండాను.
*గత ప్రభుత్వం ఇవ్వని వాటిని కూడా...*
గతంలో కూడా జీఎస్‌పీసీ వాళ్లు డ్రిల్లింగ్ కార్యక్రమం చేయడం వల్ల అప్పట్లో జీవనోపాధి కోల్పోయిన 14,824 బాధిత మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 7 నెలల కాలానికి రూ.47,250 చొప్పున మొత్తం రూ.70 కోట్లు గత ప్రభుత్వం ఇవ్వలేదు. గతంలో (2014–19) బాబు గారి పాలన మీకు గుర్తుండే ఉంటుంది. కనీసం డబ్బులు ఇప్పించాలని తపన చూపించలేదు. ఒకవేళ కంపెనీ వాళ్లు ఇవ్వకపోతేనేం మనం డబ్బులిచ్చి.. తర్వాత వాళ్ల దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకోవచ్చన్న ఆలోచన చేసిన పరిస్థితులు కూడా వారి పాలనలో లేవు.
*వారి కుటుంబాల్లో వెలుగులు నింపాం....*
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులను పక్కనపెట్టి... మత్స్యకార కుటుంబాలకు మంచి చేస్తూ.. ఆ రూ.70 కోట్లు మనం విడుదల చేసిన వారి కుటుంబాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేశాం. గత ప్రభుత్వ పాలనకు, మన ప్రభుత్వ పాలనకు ఉన్న తేడా గమనించమని మిమ్నల్ని కోరుతున్నాను.
*మేనిఫెస్టో ఖురాన్, భగవద్గీత, బైబిల్‌గా....*
నా పాదయాత్ర తీరప్రాంతాల మీదుగా సాగినప్పుడు మత్స్యకారులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశాను. ఎన్నికల ప్రణాళికలో మేనిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించాం. ఎన్నికల ప్రణాళికలో ప్రతిఒక్కరికీ ఏ మేలైతే చేస్తామని చెప్పామో... ఆ హామీలు అమలు చేస్తున్నాం. చేపల వేట నిషేధ సమయంలో అందించే సహాయం అప్పట్లో ఎన్నికల సమయంలో రూ.4వేలు ఉంటే దాన్ని రూ.10 వేలకు పెంచుకూ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు దిశగా అఢుగులు ముందుకు వేశాం. గతంలో కొంతమందికి మాత్రమే ఈ సహాయం ఇచ్చే పరిస్థితి నుంచి ఇవాళ ఎంతమందికి ఇస్తున్నామన్న విషయాన్ని గమనించమని కోరుతున్నాను.
*చంద్రబాబు పాలనలో 5 యేళ్లలో రూ.104 కోట్లు మాత్రమే...*
గతంలో చంద్రబాబు పాలనలో 2014–15 కాలంలో కేవలం 12,128 కుటుంబాలకు మాత్రమే మత్స్యకార భృతి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. అదే ఎన్నికలు దగ్గరపడేసరికి వెన్నులో వణుకు పుట్టి 2018–19 కాలానికి ఆ 12వేలు కాస్తా... 80 వేల మందికి పోయింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. ఎన్నికలు లేనప్పుడు చంద్రబాబు హయాంలో మత్స్యకారులకు ఇచ్చే భృతి కేవలం రూ.2వేలు.
ఎన్నికలు దగ్గపడేసరికి అది రూ.4వేలకు చేరింది. మరో విషయమేమిటంటే.. ఇదే పెద్దమనిషి చంద్రబాబు తాము అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం 2014–15లో మత్య్సకారభృతికి సంబంధించిన ఇచ్చిన మొత్తం కేవలం రూ.2.50 కోట్లు. ఎన్నికల నాటికి చివరి సంవత్సరం 2018–19లో మత్స్యకారులకు ఇచ్చిన భృతి కేవలం రూ.32 కోట్లు. చంద్రబాబు పరిపాలన చేసిన 5 సంవత్సరాల కాలంలో ఇచ్చిన భృతి కేవలం రూ.104 కోట్లు.
మరి ఈరోజు మీ బిడ్డగా సంవత్సరానికి రూ.109 కోట్లు బటన్ నొక్కి ఇస్తున్నాను. ఆ పెద్దమనిషి చంద్రబాబు ఐదేళ్లలో ఇచ్చింది రూ.104 కోట్లు అయితే ఈ రోజు మీ బిడ్డ బటన్ నొక్కి ఏడాదికి రూ.109 కోట్లు ఇస్తున్నాడు. ఈ రూ.109 కోట్లతో కలుపుకుంటే ఇంతవరకు మీ ప్రభుత్వం రూ.419 కోట్లు మీ చేతుల్లో పెట్టింది.
గతంలో డీజిల్ మీద సబ్సిడీ పేరుతో రూ.6 ఇచ్చేవారు. అది కూడా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. కానీ ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ 50 శాతం పెంచాం. రూ.6 సబ్సిడీని రూ.9 చేయడమే కాకుండా.. నేరుగా డీజిల్ పట్టేటప్పుడే రూ.9 మినహాయించి... సబ్సిడీ వర్తింపజేసి అక్కడికక్కడే డీజిల్ పోస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వంలో జరుగుతున్న దానికి తేడాను గమనించమని కోరుతున్నాను.
*3 యేళ్లుగా 17,770 బోట్లకు డీజిల్ సబ్సిడీ...*
మత్స్యశాఖకు చెందిన 6 డీజిల్ బంకులతో పాటు 93 ప్రైవేటు బంకుల్లో కూడా డీజిల్ పట్టుకునేటప్పుడే... మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్ అందేలా వారందరికీ కూడా స్మార్ట్ కార్డ్స్ జారీ చేశాం. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3 వేల లీటర్ల చొప్పున, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్లు చొప్పున సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మొత్తం 17,770 బోట్లకు 3 యేళ్లుగా సబ్సిడీ పై డీజిల్ ఇస్తున్నాం.
*పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచాం....*
గతంలో సముద్రంలో వేటకు వెళ్లి ఏదైనా మత్స్యకార సోదరుడు ఎవరైనా చనిపోతే... పట్టించుకోవాలన్న ఆలోచన ఎప్పుడూ కనిపించేదు కాదు. పేరుకు మాత్రం రూ.5 లక్షలు ఇస్తామనే వారు.. అది కూడా ఎప్పుడొస్తుందో ? అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితుల్లో అప్పటి పాలకులు ప్రభుత్వాన్ని నడిపారు.
ఈ రోజు మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మత్స్యకారులు వేటకు వెళ్లినప్పుడు పొరపాటున ఏదైనా జరిగితే.. ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయి అని ఆలోచన చేసే మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే... పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచడమే కాకుండా.... చనిపోయిన ప్రతి కుటుంబానికి వర్తింపజేస్తూ.... 116 కుటుంబాలకు మేలు చేయగలిగాం.
*వలసలు నివారించాలని....*
మత్స్యకారులు ఎలా బ్రతకాలి? వాళ్ల జీవన ప్రమాణాలు ఎలా పెరగాలి ? వారు ఎందుకు గుజరాత్‌కు పోవాల్సి వస్తుంది ?వేరే రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్లాల్సి వస్తుంది ? మన దగ్గర ఏమిటి తక్కువ ? అని గతంలో ఆలోచన చేసిన పరిస్థితులు లేవు.
ఈరోజు అలాంటి పరిస్థితులన్నింటినీ మారుస్తూ.. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల అభివృద్ది మీద ప్రత్యేక దృష్టి పెట్టాం.
*9 ఫిషింగ్ హార్భర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం...*
ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 4 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల నిర్మాణం చేపడుతున్నాం. ఇవికాక విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ పనులన్నీ జరుగుతున్నాయి.
9 ఫిషింగ్ హార్బర్లలో ఇప్పటికే మచిలీపట్నం, ఉప్పాడ, జువ్వలదిన్నెలో శరవేగంగాపనులు జరుగుతున్నాయి. మిగిలినవి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు చేపట్టడానికి సంసిద్ధంగా ఉన్నాయి. నిజాంపట్నంలో అటవీభూమికి సంబంధించిన చిన్న అంశాన్ని పరిష్కరించి.. అక్కడ కూడా పనులు మొదలుపెడతాం.
బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, కొత్తపట్నంతో పాటు ఓడరేవులో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్లకు టెండర్ల ప్రక్రియ పూర్తైంది. పనులు మొదలు కానున్నాయి.
మంచినీళ్లపేట, చింతపల్లి, భీమిలి, రాజయ్యపేట
ఈ 4 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లతో పాటు విశాఖలో ఫిషింగ్ హార్బర్ మోడరనైజేషన్... దాదాపు రూ.250 కోట్లతో ఈ పనులన్నింటినీ కూడా త్వరలోనే ప్రారంభిస్తాం.
ఇంతగా మీ మంచి కోసం ఆలోచన చేసే మన ప్రభుత్వానికి.. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుకు వచ్చే గతంలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి తేడా ఎంతుందో గమనించమని వినయపూర్వకంగా కోరుకుంటున్నాను.
*ఫిష్ ఆంధ్రా – నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులు...*
ప్రతి మత్స్యకారుడికి మంచి జరగాలి.. వారు తీసుకొచ్చిన ఉత్పత్తి కూడా మంచి రేటు రావాలని ఆలోచన చేసి.. ఫిష్‌ఆంధ్రా పేరిట నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను సరసమైన ధరలకే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. మత్స్య ఉత్పత్తులకు ఇంకా మెరుగైన ధర వచ్చేటట్టు చేయడానికి... దేశీయ వినియోగం పెంచేందుకు రూ.333 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వాహబ్‌లు, వాటికి అనుసంధానంగా సుమారు 14వేల రిటైల్ దుకాణాల ఏర్పాటు దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. వీటివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మందికి ఉపాధి లభించనుంది.
*కేవలం డీబీటీ ద్వారానే రూ.1.40 లక్షల కోట్లు...*
ఇలా మత్స్యకారులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, ఓసీల్లోని నిరుపేదలకు ఇలా ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా.. ప్రతి ఒక్కరికీ, ప్రతీ ఇంటికీ మన ఈ 35 నెలల పరిపాలనలో.. కేవలం డీబీటీ ద్వారా నేరుగా వారి చేతుల్లోకి పెట్టిన సొమ్మ.. వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, జగనన్న అమ్మఒడి, చేయూత, సున్నావడ్డీ, రైతు భరోసా, విద్యాకానుక, వసతి దీవెన ఇలా వివిధ కార్యక్రమాల కింద బటన్ నొక్కి లేదా నేరుగా అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టిన సొమ్ము రూ.1.40 లక్షల కోట్లు.
*లంచాలు, వివక్ష లేకుండా...*
ఎక్కడా లంచాలు లేవు. వివక్షకు స్ధానం లేదు. పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరిపేర్లు గ్రామ, వార్డు సచివాలయాలలో డిస్‌ప్లే చేస్తూ.. అక్కడే జాబితా కూడా పెడుతున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ చొప్పున నియమించిన ఆ వ్యవస్ధ ద్వారా చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ సేవలు అందిస్తున్నారు.
*మారుతున్న గ్రామాల స్వరూపం...*
మరోవైపు మనగ్రామాల స్వరూపాలన్నీ మారుతున్నాయి. ప్రతి ఊరులోనూ... మన కళ్లెదుటనే ఇంగ్లిషు మీడియం స్కూల్ నాడు–నేడుతో ముస్తాబై కనిపిస్తుంది. అదే గ్రామంలో ఓ నాలుగు అడుగులు ముందుకు వేస్తే... వ్యవసాయం రూపురేఖలు మార్చే రైతుభరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. ఇంకో నాలుగు అడుగులు దూరంలో... ఇరవైనాలుగు గంటలుపాటు సేవలందించే విలేజ్ క్లినిక్ అందుబాటులోకి వచ్చే విధంగా పనులు జరుగుతున్నాయి. ఆ పక్కనే మన పిల్లలందరూ చిక్కటి చిరునవ్వుతో మీ అందరికి లంచాలు లేని, వివక్ష లేని సేవలందిస్తూ గ్రామసచివాలయాలు కనిపిస్తున్నాయి. అదే గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా 50 ఇళ్లకు ఒకరు చొప్పున నేరుగా మీ ఇంటికి వచ్చి నా వాలంటీర్ చెల్లెమ్మలు, అన్నదమ్ములు ఇంటికి వచ్చి మీకు గుడ్‌మార్నింగ్ చెప్పి... చిరునవ్వుతో మీ అందరికీ సహాయసహకారాలు అందిస్తున్నారు.
*గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి...*
ఇంతటి మంచి, అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. ఇంతటి మంచి చేశాం కాబట్టే.. మనలా మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకి లేదు. ఇంతటి మంచి మా చంద్రబాబు చేశాడని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికీ లేదు. ఆ ఈనాడుకు లేదు, ఆంధ్రజ్యోతికి లేదు, టీవీ 5 లేదు, ఎల్లో మీడియాకు లేదు. ఇంతటి మంచి ఇంటింటికీ చేశామని చెప్పే ధైర్యం వీళ్లెవ్వరికీ లేదు.
*95 శాతం మేనిఫెస్టో అమలు చేశాం....*
ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో, వాగ్దానాలలో 95 శాతం పూర్తి చేశామని చెప్పి.. ఇంటింటికీ వెళ్లి చెప్పే నైతికత కేవలం మనకు మాత్రమే ఉంది. కాబట్టే గడప గడపకూ మన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి మీరంతా గెలిపించిన మన ఎమ్మల్యేలు, ఎంపీలు మీ ఇంటికి, మీ గడప గడపకూ బయలుదేరారు. మీ ఇంటికి ఏయే పథకాలు మనం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఈ 34 నెలల కాలంలో అందాయో ప్రతి కుటుంబానికి ఆ కుటుంబంలో ఉన్న అక్కచెల్లెమ్మల పేరుతో లేఖలు రాసి ఏమేం మేలు జరిగాయి అని చెప్పి.. ఆ అక్కచెల్లెమ్మలకు నేను స్వయంగా రాసిన లేఖలు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకునే గొప్ప కార్యక్రమానికి మన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు బయలుదేరారు.
మనందరి పార్టీ 2019 ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలకు సంబంధించి... ఇదిగో మేం వాగ్ధానాలు చేసిన మేనిఫెస్టో.. ఇందులో 95 శాతం అమలుచేశాం. మీరే చూడండి. మీరే టిక్కులు పెట్టండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా మీరే చూడండి అని మీ చేతుల్లోనే మేనిఫెస్టో పెట్టి మీ చల్లని దీవెనలు తీసుకునేందుకు మన ఎంపీలు, ఎమ్మెల్యేలు మీ దగ్గరకు బయలుదేరారు.
*మన మంచిని ఒప్పుకోలేని దుష్ట చతుష్టయం...*
ఇంత నిజాయితీ, నిబద్ధతతో ప్రజల ముందుకు వస్తున్నాం కాబట్టే... తాము చేసిన మంచి చెప్పుకోలేక, మనం చేసిన మంచిని ఒప్పుకోలేకపోతున్నారు ఈ దుష్ట చతుష్టయం.
దుష్ట చతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఈ నలుగురూ. వీరి దత్తపుత్రుడు.
*వీరి కడుపు మంటకు దేవుడు మాత్రమే వైద్యం చేస్తాడు*
మంచి చేస్తున్న మన ప్రభుత్వాన్ని వీళ్లెవరూ జీర్ణించుకోలేరు. వీరికి కడుపులోనుంచి మంట, ఈర్ష్య పుట్టుకొస్తుంది. వీళ్లందరికీ ఒకటే చెప్తున్నా.. ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయిస్తాను కానీ...ఈర్ష్యకు, కడపు మంటకు వైద్యం దేవుడు మాత్రమే చేస్తాడు అని కచ్చితంగా చెప్తున్నాను.
*ప్రతిపక్షం గురించి క్లుప్తంగా...*
1.
పరీక్ష పేపర్లు వీళ్లే లీక్ చేయిస్తారు. పరీక్ష పేపర్లు లీక్ చేసే వాడిని సమర్ధించే ప్రతిపక్షం కానీ, సమర్ధించే ఎల్లో మీడియా కానీ, దుష్టచతుష్టయాన్ని కానీ మీరెక్కడైనా చూశారా ?
2.
ఈఎస్‌ఐకు సంబంధించి కార్మిక మంత్రిగా ఉంటూ.. ఉద్యోగులకు మంచి చేయాల్సిందిపోయి ఆ ఈఎస్‌ఐలో పొడర్లు, స్నో, టూత్‌పేస్టులు, మందులు పేరిట డబ్బులు కొట్టేసిన నాయకుడ్ని విచారించడానికి వీల్లేదంటున్న ప్రతిపక్షాన్ని కానీ, ఎల్లోమీడియాను కానీ ఇటువంటి దుష్టచతుష్టయాన్ని కానీ మీరెక్కడైనా చూశారా ?
3.
మన పిల్లలకు మనం అబద్దాలు చెప్పొద్దని, మోసం చేయవద్దని నేర్పుతాం. కానీ కొడుక్కు పచ్చి అబద్దాలు, మోసాల్లో ట్రైనింగ్ ఇస్తున్న చంద్రబాబులాంటి తండ్రిని మీరెక్కడైనా చూశారా ?
4.
మంత్రిగా పనిచేసి, మంగళిగిరిలో ఓడిన సొంత పుత్రుడు ఒకరు, రెండుచోట్లా పోటీ చేసి ఎక్కడా గెలవని దత్తపుత్రుడు ఇంకొకరు. ప్రజలను కాక ఇలాంటి వాళ్లను నమ్ముకుంటున్న.. 40 ఏళ్ల ఇండస్ట్రీ, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకుంటున్న చంద్రబాబులాంటి రాజకీయ నాయకుడ్ని ఎక్కడైనా చూశారా ?
5.
రాజకీయ నాయకులెవరైనా ప్రజలను నమ్ముకుంటారు. కానీ ప్రజలను కాకుండా... దత్తపుత్రుడను, కొడుకును నమ్ముకుంటున్న ఇలాంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడ్ని ఎక్కడైనా చూశారా ?
6.
పేదలకు ఇళ్ల స్ధలాలు వాళ్లు ఇవ్వకపోగా.. మనం ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్న ప్రతిపక్షాన్ని ఎక్కడైనా మీరు చూశారా ?
7.
నా ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలు వీళ్లకెవరికైనా ఇళ్లు లేకపోతే... తపించేది నా మనసు. ఇటుంటి వారికి ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని, ఇళ్లు కట్టించి ఇవ్వాలని వీరు చెప్పుకుంటున్న అమరావతి అనే రాజధాని నగరంలో ఇళ్ల స్ధలాలు వీరికిస్తే... ఏకంగా కోర్టులకు వెళ్లి అడ్డుకుంటారు. కోర్టులలో వీళ్లేం పిటిషన్ వేస్తారో తెలుసా ? వీళ్లకి ఇళ్ల స్ధలాలు ఇస్తే... జనాభా సమతుల్యం దెబ్బతింటుంటుని.. (డెమోగ్రాఫిక్ ఇంబేలన్స్ వస్తుందని) ఏకంగా పిటిషన్లు వేయడమేమిటి.. దానిమీద వీళ్లు వాదించడమేమిటి ? ఇటువంటి ప్రతిపక్షం ఎక్కడైనా ఉంటుందా ?
8.
ప్రభుత్వ స్కూళ్లల్లో పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియం పెడితే... అడ్డుకున్న ఇలాంటి ప్రతిపక్షాన్ని మీరు ఎక్కడైనా చూశారా ? మన పిల్లలు బాగా చదవాలని ఆరాటపడాలి. రాజకీయ నాయకుడైతే ఇంకా గొప్పగా పిల్లలకు చదువులు చెప్పించాలని తపన పడాలి. కానీ ఆ పిల్లలు ఎక్కడ ఇంగ్లిషు మీడియంలో చదువుతారో ? ఎక్కడ గొప్పవాళ్లవుతారో ? వాళ్లు గొప్పవాళ్లయితే ఇలాంటి చంద్రబాబులాంటి వాళ్లను ఎక్కడ ప్రశ్నిస్తారో అని చెప్పి భయపడే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశామా ?
9.
ఇలాంటి రాబందులకు ప్రజలకు ఏం మంచి జరిగినా... అందులోనూ అది జగన్ ప్రభుత్వంలో ఏదైనా మంచి జరిగితే మాత్రం అస్సలు నచ్చదు వీళ్లకు ?ఇళ్ల పట్టాలిచ్చినా, పేదలకు ఇంగ్లిషు మీడియంఅన్నా అడ్డుకుంటారు.
పేదవాళ్లకు మంచి చేయడానికి రాష్ట్రానికి డబ్బులు రావడాన్ని కూడా వీళ్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా బాధే, బ్యాంకులు అప్పులు ఇచ్చినా వీళ్లకి బాధే. ఢిల్లీ నుంచి కోర్టుల్లో కేసులు వేసే దాకా అన్నిచోట్లా కూడా అబద్దాలుతో కూడిన పిటిషన్స్ వేస్తూ.. నిరంతరం అడ్డుకుంటున్న పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నాం. రాష్ట్రానికి ఏ మంచి జరిగినా కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తున్న ఇలాంటి రాబందులను ఏమనాలి ?
ఇలాంటి వారిని ద్రోహులు అందామా ? లేక దేశ ద్రోహులు అందామా ?
కళ్లు ఉండి మంచిని చూడలేని ఇలాంటి కబోధుల్ని... ఏమనాలి.
చంద్రబాబునాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు. ఆయన పర్యటిస్తున్న పరిస్థితులను చూసి ఆశ్చర్యం అనిపించింది. ఈ మూడేళ్ల కాలంలో దేవుడి దయతో మనందరిప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబం దగ్గరకు వెళ్లి... దేవుడి దయతో మీకు ఈ మంచి చేయగలిగాం, ఆశీర్వదించండి అని అక్కచెల్లెమ్మలకు లేఖ ఇచ్చి, అందులో వారికి జరిగిన మంచిని తెలియజేస్తూ.. గడప, గడప బాట పడుతున్న మన పార్టీ తరపు ప్రజా ప్రతినిధులను చూసి ఓర్వలేక మళ్లీ అబద్దాలు గుమ్మరిస్తున్నారు.
*జగన్ మూడేళ్ల పాలన చూసి కుప్పంలో...*
ఈ పెద్దమనిషి 27 ఏళ్లు కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజు కూడా కుప్పంలో ఇళ్లు కట్టుకోవాలన్న ఆలోచన రాలేదు. 27 ఏళ్లుగా ఆ నియోజకవర్గంలో సొంత ఇళ్లు కట్టుకోవాలని ఏనాడు ఆలోచన చేయలేదు. ఈ రోజు మీ జగన్ పరిపాలన మూడేళ్లు చూశాడో లేదో కుప్పానికి పరిగెట్టి...ఇళ్లు కట్టుకునే కార్యక్రమం చేస్తున్నాడు.
*చివరిగా ఒక్క మాట చెప్పదల్చుకున్నా..*
ప్రజలకు మనం చేయగలిగిన మంచిని చరిత్రలో ఎవరూ చేయని విధంగా చేశాం. చేస్తున్నాం. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవనెనలతో ప్రతి ఒక్క కుటుంబానికి ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు, ప్రజలు ఇవ్వాలని, ఇలాంటి వక్రబుద్ది ఉన్న రాజకీయ నాయకుల నుంచి, వక్రబుద్ధి ఉన్న దుష్ట›చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ప్రార్ధిస్తూ... సెలవు తీసుకుంటున్నాను అంటూ సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
కాసేపటి క్రితం ఎమ్మెల్యే సతీష్ మాట్లాడుతూ.. పీవీ రావు ఘాట్, ప్లడ్ బ్యాంకు, ఐ.పోలవరానికి సంబంధించి రోడ్ అండ్ బండ్ డవలప్‌మెంట్, మరమ్మతులుకు సంబంధించి అడిగారు. ఇవి కూడా మంజూరు చేస్తున్నాను. ఇంతకుముందు మనం చెప్పిన మూలపాడు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, గోగుల్లంక హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, ముమ్మడివరం– కాట్రాయకోన రోడ్డు విస్తరణ పనులుకు సంబంధించి డీపీఆర్ తయారీ, టెండర్లు ప్రక్రియ పూర్తై ఇవాళ శంకుస్ధాపన చేసుకున్నామని చెప్పారు.
*అనంతరం....*
రాష్ట్ర వ్యాప్తంగా సముద్రంపై వేటకు వెళ్లే 1,08,755 మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయం అయిన ఏప్రిల్ 15 జూన్ 14 కాలంలో ఆ కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క కుటుంబానికి రూ.10 వేలు చొప్పున దాదాపు రూ.109 కోట్ల ,
ఓఎన్‌జీసీ సంస్ధ పైప్‌లైన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన 23,458 మత్స్యకార కుటుంబాలకు రూ.108 కోట్ల ఆర్ధిక సాయంతో కలిపి మొత్తం రూ.217 కోట్లను కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్ల గ్రామంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి సీఎం శ్రీ వైయస్.జగన్ వారి ఖాతాల్లో జమ చేశారు.
addComments
Post a Comment