ఇళ్లు కట్టుకోవడానికి ఇదే తగిన సమయం
నిర్మాణం ప్రారంభించకపోతే రద్దు చేస్తాం
హాజరు తక్కువగా ఉన్న వలంటీర్లను తొలగించాలి
జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి
చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల్లో విస్తృత పర్యటన
చీపురుపల్లి, గరివిడి, గుర్ల, (విజయనగరం), మే 04 (ప్రజా అమరావతి) ః
ఇళ్లు కట్టుకోవడానికి పేదలకు ఇదే తగిన సమయమని, ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతీఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి కోరారు. మంజూరైన ఇళ్ల నిర్మాణాన్నివెంటనే ప్రారంభించకపోతే రద్దు చేస్తామని, అలాంటివారికి మరోసారి ఇళ్లు మంజూరు కాదని స్పష్టం చేశారు. ప్రతీఒక్కరూ ఆలస్యం చేయకుండా, నిర్మాణాన్నిప్రారంభించాలని కోరారు. చీపురుపల్లి, గరివిడి, గుర్ల మండలాల్లో జిల్లా కలెక్టర్ సూర్యకుమారి బుధవారం విస్తృతంగా పర్యటించారు.
పదోతరగతి పరీక్షా కేంద్రాల తనిఖీ
పదోతరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా గరివిడి శ్రీరామ్‌నగర్‌లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాలకు 164 మంది విద్యార్థులను కేటాయించగా, 163 మంది పరీక్షకు హాజరైనట్లు సెంటర్ ఛీఫ్ సూపరింటిండెంట్ శ్యామలశ్రీ తెలిపారు. కొండపాలెం జెడ్‌పి ఉన్నతపాఠశాలను తనిఖీ చేశారు. ఈ పాఠశాలకు 190 మంది విద్యార్థులను కేటాయించగా, అందరూ హాజరయ్యారని సెంటర్ చీఫ్ ఎం.నిర్మాల వివరించారు. అనంతరం చీపురుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ కేంద్రానికి 152 మంది విద్యార్థులను కేటాయించగా, అందరూ హాజరయ్యారని చీఫ్ సూపరింటిండెంట్ డి.లీలాకుమారి తెలిపారు. పరీక్షలను పకడ్భంధీగా నిర్వహించాలని, చూసిరాతలు జరగకుండా చూడాలని, సెంటర్ చీఫ్‌లను కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో గరివిడి మండల ప్రత్యేకాధికారి, పశు సంవర్థకశాఖ జెడి డాక్టర్ వైవి రమణ, తాశీల్దార్లు తాడ్డి గోవింద, సురేష్ పాల్గొన్నారు.
హాజరు తక్కువగా ఉన్న వలంటీర్లను తొలగించాలి
హాజరు తక్కువగా ఉన్న వలంటీర్లను తొలగించాలని కలెక్టర్ సూర్యకుమారి ఆదేశించారు. చీపురుపల్లి - 4 సచివాలయాన్ని, గుర్ల మండలం గుజ్జంగివలస గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సిబ్బంది రిజిష్టర్లను తనిఖీ చేశారు. హాజరు తక్కువగా ఉన్న చీపురుపల్లి 27వ సెక్టార్ వలంటీర్‌ను తొలగించాలని ఆదేశించారు.
ఓటిఎస్ పథకం అమలుపై ఆరా తీశారు. ఈ పథకాన్ని వినియోగించకోవడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని, సిబ్బందిలో తగినంత చొరవ కనిపించడం లేదని అన్నారు. లబ్దిదారులను చైతన్యపరిచి, పథకాన్ని వినియోగించుకొనేలా చూడాలని సూచించారు. అలాగే డబ్బులు చెల్లించిన వారికి, బ్యాంకులన నుంచి రుణాలను ఇప్పించాలని అన్నారు. గృహనిర్మాణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, అందరిచేతా ఇళ్లు కట్టించాలని సూచించారు. గర్భిణులు, పిల్లలకు వేక్సినేషన్‌పై ఆరా తీశారు. వారికి పోషకాహార పంపిణీపై ప్రశ్నించారు. ఈ క్రాప్ నమోదుపై ఆరా తీశారు. రబీలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని, ప్రతీ గ్రామంలో ఈ విధానాన్ని అనుసరించేలా చూడాలని సూచించారు. గ్రామంలో నిర్మితమైన ఎస్‌డబ్ల్యూపిసి సెంటర్లను తప్పనిసరిగా వినియోగించాలని, సేంద్రీయ ఎరువును తయారు చేసి, రైతులకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీల్లో చీపురుపల్లి తాశీల్దార్ సురేష్, గుర్ల తాశీల్దార్ ఐ.సూర్య, ఎంపిడిఓ కల్యాణి తదిరులు పాల్గొన్నారు.
ఇళ్లు కట్టుకోవడానికి ఇదే సువర్ణావకాశం
ఇళ్లు కట్టుకోవడానికి ఇదే సువర్ణావకాశమని కలెక్టర్ సూర్యకుమారి పేర్కొన్నారు. మంజూరైన ఇళ్లు రద్దు అయితే, మరోసారి వచ్చే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. వారం రోజుల్లో లబ్దిదారులందరిచేతా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభింపజేయాలన్నారు. చీపురుపల్లి ఎంపిడిఓ కార్యాలయంలో డివిజన్ స్థాయి సమీక్షా సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. త్రాగునీటి సరఫరా, ధాన్యం సేకరణ, కన్వర్జెన్సీ పనులు, రెవెన్యూ అంశాలు, గృహనిర్మాణం, విద్య, వైద్యం తదితర అంశాలపై అన్ని మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఆయా పథకాలపై మండలాల వారీగా, మున్సిపాల్టీలవారీగా సమీక్షిస్తూ, వేసవిలో త్రాగునీటికి ఎక్కడా ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశించారు. క్రాష్ ప్రోగ్రామ్‌పై ప్రశ్నించారు. జలజీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిధులు సిద్దంగా ఉన్నాయని, వాటిని సకాలంలో వినియోగించాలని అన్నారు. ప్రతీ సచివాలయంలో కమ్యూనిటీ మరుగుదొడ్డిని నిర్మించాలని, స్థలం లేనిచోట, ఏదైనా ప్రభుత్వ కార్యాలయం వద్దనైనా నిర్మించాలని సూచించారు. ప్రతీ బాలికల విద్యాసంస్థలో తప్పనిసరిగా మరుగుదొడ్డి ఉండితీరాలని, నూతన విద్యావిధానంలో ఇదొక భాగమని పేర్కొన్నారు.
ఓటిఎస్ పథకం అమలుపై దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఓటిఎస్‌ను వినియోగించుకొనేందుకు ఇప్పటికీ గడువు ఉందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి, వినియోగించుకొనేలా చూడాలన్నారు. ఓటిఎస్ చెల్లించినవారికి రుణాలు ఇప్పించాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణంపై ఎప్పటికప్పుడు స్టేజ్ వారీగా అప్‌డేట్ చేయాలన్నారు. కుష్టువ్యాధిగ్రస్తులు, ట్రాన్స్ జెండర్స్, హెచ్ఐవి రోగులు, సెక్స్ వర్కర్ల సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా కుష్టువ్యాధిగ్రస్తులు తమ బయోమెట్రిక్, లేదా ఐరిష్ నమోదు కాక, రేషన్ పొందడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. వేక్సినేషన్, పోషకాహార పంపిణీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. పాఠశాల విద్యార్థులందరికీ ఎత్తు, బరువు, హీమోగ్లోబిన్ శాతాన్ని నమోదు చేయాలని, వేసవి సెలవులు మొదలయ్యే లోగానే ఇది పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో చీపురుపల్లి ఆర్‌డిఓ ఎం.అప్పారావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ కె.శివానందకుమార్, డివిజన్ పరిధిలోని తాశీల్దార్లు, ఎంపిడిఓలు, ఇతర శాఖల మండలస్థాయి అధికారులు, వైద్యాధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment