తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన చంద్రబాబు

 


*తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన చంద్రబాబు


*


*ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయం: టిడిపి అధినేత చంద్రబాబు*


అమరావతి (ప్రజా అమరావతి): తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్చ్యువల్ పద్దతిలో ప్రారంభించారు. సుమారు 50 లక్షల ఖర్చుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు అయ్యింది. ఎపిలో కుప్పం, టెక్కలిలలో ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్దం అయిన ఆక్సిజన్ ప్లాంట్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విపత్తుల సమయంలో ఎన్జివోలు, ఇతర సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వంతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సాధించిన విజయాలను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. విద్య, వైద్యంతో పాటు విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన సేవలను గుర్తు చేశారు. ట్రస్ట్ ఏర్పాటు అయిన తరువాత 11 వేల హెల్త్ క్యాంప్ లు నిర్వహించారని....సుమారు 18 కోట్ల రూపాయల విలువైన మందులు, ఆహారం తో పాటు ఇతర సాయం బాధితులకు అందిందని చంద్రబాబు అన్నారు. 2009 కర్నూలు వరదలు, 2021లో కడప, నెల్లూరు జిల్లాలలో వరద బాధితులకు ట్రస్ట్ చేసిన సాయం గురించి ప్రస్తావించారు. ఇక కోవిడ్ సమయంలో రెండు కోట్ల రూపాయలు మందులు, ఇతర వైద్య సాయం కోసం ఖర్చు చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరు తాము సంపాదించిన దానిలో కొంత అయినా తిరిగి సమాజంపై ఖర్చు పెట్టాలని చంద్రబాబు కోరారు. తద్వారా సమాజంలో ఉత్తమ ఫలితాలు రాబట్ట వచ్చని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో రాజేంద్రకుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష తో పాటు అసుపత్రి సిబ్బంది, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments