ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు పూర్తిస్థాయిలో వినియోగించండి

 


సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయండి

లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా చూడండి

ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు పూర్తిస్థాయిలో వినియోగించండి


అధికారులకు మంత్రి మేరుగు నాగార్జున ఆదేశం 

అమరావతి, మే 10 (ప్రజా అమరావతి): సాంఘిక సంక్షేమశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న వివిధ పథకాలను మరింత పటిష్టంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఉప ప్రణాళికకు సంబంధించిన నిధులు అన్ని ప్రభుత్వ శాఖల్లో పూర్తి స్థాయిలో  వినియోగించడం ద్వారా ఎస్సీలకు మేలు జరిగేలా చూడాలని కోరారు. 

మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ సబ్ ప్లాన్, సాంఘిక సంక్షేమ గురుకులాలు, ఎస్సీ కార్పొరేషన్ తదితర విభాగాలకు చెందిన వివిధ పథకాలను గురించి ఈ సమావేశంలో మేరుగు నాగార్జున నిశితంగా సమీక్షించారు. వివిధ పథకాల అమలుతీరును గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఖర్చు చేయాల్సిన నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో వెనుకబడిన ప్రభుత్వ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, నిధులు వృధా కాకుండా చూడాలని కోరారు. ఈ విషయంగానే ప్రధాన ప్రభుత్వశాఖల అధికారులతో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. హాస్టళ్లకు, గురుకులాలకు సంబంధించిన భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఎస్సీ కార్పొరేషన్ పథకాల్లో లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా చూడాలని సూచించారు. పథకాల మంజూరులో మధ్యదళారుల ప్రమేయం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను నాగార్జున ఆదేశించారు. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలలో అంబేద్కర్ స్టెడీ సెంటర్లను తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని, వీటిలో తిరుపతి కేంద్రంలో బ్యాంకింగ్ పరీక్షలకు, విశాఖ, విజయవాడ కేంద్రంలో గ్రూప్-1, 2, కోచింగ్ ఇవ్వడానికి అవసరమైన చర్యలు చేపట్టామని, ఏపీ ఆన్ లైన్ ద్వారా అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నామని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. స్టెడీ సెంటర్లలో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడానికి ప్రొఫెసర్ల స్థాయిలో అధ్యాపకులకు ఎంపిక చేయాలని నాగార్జున అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్ కే. హర్షవర్ధన్ తో పాటుగా వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.Comments