చెత్త కాదు... సంపద కావాలి*
*పరిశుభ్రమైన జిల్లా ఆవిర్భావం కావాలి
జిల్లా కలెక్టర్ బసంత కుమార్
చిలమత్తూరు/కనగానపల్లి మే 17 (ప్రజా అమరావతి): చెత్త చెత్తగా ఉండరాదని అది సంపదగా మారాలని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ అన్నారు. పరిశుభ్రమైన జిల్లా ఆవిర్భావం కావాలని పేర్కొన్నారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా జిల్లా యావత్తూ పరిశుభ్రమైన జిల్లాగా అవతరించాలని ఆయన పిలుపునిస్తూ మంగళవారం చిలమత్తూరు మండలం లోని కోడూరు గ్రామపంచాయతీ పరిధిలో కోడూరు తోపు నందు నిర్మించి ఉన్నచెత్త నుండి సంపద తయారీ కేంద్రంను మరియు కనగానపల్లి మండలం లో జగనన్న స్వచ్ఛ సంకల్పం లో భాగంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో చెత్త సేకరణ, సేంద్రియ ఎరువుగా మార్చే విధానం, మార్కెటింగ్, ప్లాస్టిక్ వస్తువులను వేరుచేసే ప్రక్రియ ఇతర అంశాలను వివరంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ కేంద్రాల వద్ద జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చెత్త నుండి సంపద కేంద్రాలు అన్ని పూర్తిస్థాయిలో పని చేయాలని పేర్కొన్నారు. ఆయాకేంద్రాల పరిధిలో ఉన్న చెత్త శతశాతం సేకరణ జరగాలని, ఈ కేంద్రాలకు తీసుకువచ్చి శాస్త్రీయ విధానంలో ప్రక్రియను చేపట్టి సేంద్రియ ఎరువులుగా మార్చాలని అన్నారు. సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా ఆ పంటలకు మంచి ఆదాయం లభిస్తుంది, రైతులకు సేంద్రియ ఎరువుల వినియోగం తెలియజేయాలని సూచించారు. రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల భూ సారం తగ్గుతుందని, సేంద్రియ ఎరువులు వాడటం వలన భూసారం రోజురోజుకు పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. రైతుల్లో అవగాహన పెరగడం వలన ఎరువుల వినియోగం పెరుగుతుందని చెప్పారు. కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది అందరూ చిత్తశుద్ధితో చేయడం వలన ఎక్కువ మొత్తంలో సేంద్రియ ఎరువులు దిగుబడి, మార్కెటింగ్ చేయుటకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్ విధానంలో సైతం సేంద్రియ ఎరువుల కొనుగోలు చేస్తున్న సంఘటనలు వివరాల అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. స్వచ్ఛత సంకల్ప వాహనాలను పంచాయతీలు పూర్తిస్థాయిలో వినియోగించాలని, వాటికి డ్రైవర్లను పంచాయతీ నిధుల ద్వారా నియమించు కోవాలని సూచించారు. ప్లాస్టిక్ పదార్థాలను వేరు చేయడం, సరైన విధానంలో ప్రాసెస్ చేసి మార్కెటింగ్ చేయుటకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సేంద్రియ ఎరువుల వినియోగంపై దృష్టి సారిస్తూ జిల్లా పూర్తిస్థాయిలో పరిశుభ్రమైన వాతావరణంలో ఉండేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో డి పి ఓ విజయ్ కుమార్, ఎంపీడీవో రామ్ కుమార్, ఎమ్మార్వో లు జి నాగేంద్ర, రంగనాయకులు, ఈ ఓ పి ఆర్ డి లు, పంచాయతీ సెక్రెటరీ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment