త్యాగాలకు సిద్ధం కండి

 *త్యాగాలకు  సిద్ధం కండి*



*రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయి*


*త్యాగాలు చేయడానికి కూడా సిద్ధం*


*వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలి*


*నాటకాల ముఖ్యమంత్రి వల్ల అందరం మునిగిపోయాం*


*టీడీపీ అధినేత చంద్రబాబు*


చిత్తూరు  (ప్రజా అమరావతి) : రాజకీయ పార్టీలన్నాక తోచిన విధంగా పొత్తులుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పొత్తుల విషయంపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొత్తుల వ్యవహారంపై తానొక్కడే మొనగాడని సీఎం జగన్‌ విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్‌  వామపక్షాలతో పొత్తులు పెట్టుకోలేదా?అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసీపీ అరాచకాలు ఇంకెంతో కాలం కొనసాగవని, ముగింపు పలకడానికి సమయం దగ్గరపడిందని హెచ్చరించారు. పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు మితిమీరాయని తెలిపారు. సదుంలో టీడీపీ నేత రాజారెడ్డిని వైసీపీ శ్రేణులు హతమార్చేందుకు యత్నించాయని, హత్యాయత్నంపై పోలీసులు కేసులు నమోదు చేయకపోవడం దారుణమని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలుచేసిన జగన్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని చంద్రబాబు జోస్యం చెప్పారు.


‘వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలి. ఇందుకోసం ప్రజా ఉద్యమం రావాలి. దీనికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ పోరాటంలో జైలుకు వెళ్లడానికీ భయపడేది లేదు. సీఎం జగన్‌ పన్నుల బాదుడుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి మా వంతు పాత్ర పోషిస్తున్నాం. అలాగే వైసీపీ వర్గీయులు కూడా ముందుకు రావాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్‌ పరిపాలనా వైఫల్యంపై నిప్పులు చెరిగారు. ‘‘సీఎం జగన్‌ కరుగట్టిన నేరస్థుడు.  నాటకాల ముఖ్యమంత్రి. ఆయన వల్ల అందరం మునిగిపోయాం. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క ఓటూ పడదు. బాబాయిని హత్య చేయించిన వ్యక్తి సీఎంగా ఉండాలా? వైసీపీ పాలనలో ఊరికో రౌడీ, సైకో తయారయ్యాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వీరందరికీ బదులిస్తాం’’ అని హెచ్చరించారు. ‘క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఏపీ’ నినాదంతో   జగన్‌ పరిపాలనకు అంతం పలకాలని ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సీఎంను సాగనంపేదాకా పోరాటం సాగుతుందని ప్రకటించారు.జగన్‌ క్షమించరాని తప్పులు చేస్తున్నారు. ఇదే కొనసాగితే ప్రజలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది. భవిష్యత్‌ పరిణామాలు ఊహించే... ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తున్నాం. జగన్‌ బాదుడుతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకే రాష్ట్ర పునర్నిర్మాణంలో వీళ్లు కూడా తమవంతు పాత్ర పోషించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Comments