సమసమాజ స్థాపకులు.. గొప్ప సంఘ సంస్కర్త బసవన్న

 


*సమసమాజ స్థాపకులు.. గొప్ప సంఘ సంస్కర్త బసవన్న*


* *బసవేశ్వరుడి 889 జయంతి వేడుక సభలో డీఆర్వో మాలోల*


కడప, మే 3 (ప్రజా అమరావతి)


: వర్గ, వర్ణ, లింగ భేదాలను తెంచివేసి, ఒక సమ సమాజాన్ని స్థాపించిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ బసవేశ్వరుడు (బసవన్న) అని.. ఆధునిక సమాజానికి ఆయన చరితం ఆదర్శనీయం అని డిఆర్వో మాలోల అభివర్ణించారు.


మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని యువజన సంక్షేమ శాఖ, పర్యాటక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో... సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి 889 జయంతి వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా రెవెన్యూ అధికారి మాలోల, జిల్లా అదనపు ఎస్పీ మహేష్ కుమార్ లు హాజరయ్యారు. 


ఈ సందర్భంగా డిఆర్వో మాలోల మాట్లాడుతూ.. మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలను ఈ ఏడాది నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంగా ప్రకటించిందన్నారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు.. ప్రతి యేడాది జిల్లాలో బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. ప్రతి ఏడాది వైశాఖ మాసం మూడవ రోజును ఆయన జన్మదినంగా చరిత్ర పరిగణించడం జరిగిందని.. ప్రస్తుతం బసవేశ్వరుని 889వ జయంతి వేడుకను జరుపుకోవడం సంతోషించదగ్గ విషయం అన్నారు. ఆయన చెప్పిన వాక్కులు.. నేటి సమాజానికి ఆదర్శనీయం అన్నారు.


హైందవ మతాన్ని సంస్క‌రించిన‌ ప్రముఖులలో బసవేశ్వరుడు (1134–1196) ఒకరని.. సమాజంలో అందరూ సమానమేనని సత్యాన్ని ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే చాటి చెప్పిన సంఘ సంస్కర్త  అన్నారు. అందుకే ఆయనను.. బసవన్న, బసవుడు, విశ్వగురు అని పలువురు సామాజిక సంఘ పెద్దలు పిలుస్తారన్నారు. సమాజంలో కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన అభ్యుదయ వాది.. బసవేశ్వరుడు లింగాయత ధర్మాన్ని స్థాపించారన్నారు. కర్ణాటక రాష్ట్రం బాగేవాడిలో జన్మించిన బసవేశ్వరుడి తండ్రిదండ్రులు మాదిరాజు, మాదాంబలు... ఉపనయనం చేస్తున్న తల్లిదండ్రులను వదలి కూడలసంగమ అనే పుణ్యక్షేత్రం దగ్గరకు చేరి.. అక్కడ ఉన్న సంగమేశ్వరుణ్ణి నిష్ఠతో ధ్యానించాడు. చిన్న వయసులోనే శైవ పురాణ గాథలను అభ్యసించిన ఆయన 12వ శతాబ్దంలోనే కర్ణాటక దేశాన్ని పాలించిన బిజ్జలుని కొలువులో చిన్న ఉద్యోగిగా స్థానం సంపాదించారు. అనతి కాలంలోనే భాండాగారానికి ప్రధాన అధికారిగా పదోన్నతి పొంది భండారీ బసవడుగా ఖ్యాతిని పొందాడు. బసవేశ్వరుడు బోధించిన సంప్రదాయమే అనంతర కాలంలో “లింగాయత ధర్మం”గా స్థిరపడింది. తెలుగులో సోమనాథుడు బసవపురాణం రాశారని.. శివుడే సర్వేశ్వరుడన్న విశ్వాసంతో శివతత్వ ప్రచారానికి పూనుకున్నారని.. అలా లింగాయత మతానికి బీజాలు వేశారన్నారు. 


అదనపు ఎస్పీ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. మూఢ నమ్మకాలను వ్యతిరేకించిన అభ్యుదయవాది బసవేశ్వరుడు (బసవన్న) అన్నారు. అప్పట్లో ఆడవారికి, దళితులకు ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులు ఉండేవి కావని.. అలాంటి కాలంలో బసవన్న సమాజంలో అణగరిన వారికి, మహిళలకు అన్ని హక్కులు కల్పించారన్నారు. వర్గ, వర్ణ, లింగ భేదాలను తెంచివేసి, ఒక సమాజాన్ని స్థాపించాడు. మానవతావాది, సంఘ సంస్కర్త అయిన బసవేశ్వరుడు.. కుల, మత వర్ణ, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించారన్నారు. ఆ వ్యవస్థను రూపుమాపడానికి క్రీస్తు శకం 12వ శతాబ్దంలోనే పోరాటాన్ని సలిపిన సాంఘిక విప్లవకారుడు అన్నారు.  బూజుపట్టిన మూఢాచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసిన మొదటి సంఘ సేవకుడుగా బసవేశ్వరుడు ప్రాచుర్యం పొందారన్నారన్నారు.


బసవేశ్వరుడు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక దినోత్సవంగా ప్రకటించడం హర్శించదగ్గ విషయం అని.. పలువురు లింగాయత్ కుల సంఘ నేతలు ప్రశంశించారు.


ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈఓ డా. రామచంద్రారెడ్డి, జంగం కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పానుగంటి కృష్ణ, జిల్లా జెనరల్ సెక్రెటరీ ఎస్.బసవరాజు, లింగాయత్ కుల సంఘ సభ్యులు మనిశేఖర్, నాయక్, సదాశివుడు, మల్లికార్జున, సుబ్రమణ్యం, సుబ్బయ్య, స్వామీ, మధు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. 



Comments