రాష్ట్రంలో మహిళలు,చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత
• ఇప్పటి వరకూ కోటి 28 లక్షల మంది మహిళలు దిశ యాప్ డౌన్ లోడ్
• 6లక్షలకు పైగా ఎస్ఓఎస్ లు,11వేల 812 కాల్స్ స్వీకరించాం
• 900 మంది మహిళలు పోలీసుల సహాయంతో రక్షింపబడ్డారు
• గత మూడేళ్ళుగా మహిళా సాధికారతకు అనేక చర్యలు
రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత
అమరావతి,మే 5 (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత మూడేళ్లుగా మహిళా సాధికారతకు అనేక చర్యలు చేపట్టడంతో పాటు మహిళలు,చిన్నారుల రక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు.గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులోని ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో మహిళలు,చిన్నారుల భద్రతకు తీసుకున్న చర్యలు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీడియాకు వివరించారు.ముఖ్యంగా మహిళలు,చిన్నారులు, అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన వారికి పూర్తి భద్రత కల్పించడం తోపాటు సామాజిక న్యాయం అందేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు.గత ప్రభుత్వ 2016-19 మధ్య కాలంలోను,ప్రస్తుత ప్రభుత్వ 2019-22 మధ్య కాలంలో మహిళలపై జరిగిన దాడులపై హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో 2016-19 కాలంలో 34 రేప్ లు మరియు హత్యలు జరిగితే 2019-22 కాలంలో 33 జరిగాయని,2016-19 కాలంలో 71 గ్యాంగ్ రేప్ లు నమోదైతే 2019-22 కాలంలో 69 నమోదయ్యాయని,2016-19 కాలంలో 79 మహిళా హత్యలు జరిగితే 2019-22లో 68 కి తగ్గాయని పేర్కొన్నారు.అదే విధంగా 2016-19 మధ్య 456 మంది మహిళలు వరకట్నవేధింపులతో చనిపోతే 2019-22 మధ్య 358 మంది చనిపోయారని తెలిపారు.అంతేగాక 2016-19 మధ్య 28 వరకట్న హత్యలు జరిగితే 2019-22 కాలంలో అవి 14 కు తగ్గాయని మంత్రి తానేటి వనిత వివరించారు.
అదే విధంగా 2016-19 కాలంలో 34 రేప్,హత్య కేసుల దర్యాప్తునకు 222 రోజులు సమయం తీసుకుంటే,2019-22 కాలంలో 33 కేసుల దర్యాప్తును కేవలం 58 రోజుల్లోనే పూర్తి చేశారని హోంమంత్రి తానేటి వనిత మీడియాకు వివరించారు.అలాగే 2016-19 మధ్య 70 గ్యాంగు రేప్ కేసుల్లో దర్యాప్తునకు 250 రోజులు పడితే 2019-22లో నమోదైన 69 కేసుల్లో దర్యాప్తును కేవలం 37 రోజుల్లోనే పూర్తి చేయడం జరిగిందని మంత్రి తానేటి వనితి చెప్పారు.
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ చట్టం ద్వారా 7 రోజుల్లోనే చార్జిషీటు దాఖలుకు అవకాశం కలిగిందని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.164 రేప్ కేసులు,378 మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించిన కేసుల్లో దేశంలో ఏరాష్ట్రంలో చేయని విధంగా రికార్డు స్థాయిలో అత్యంత వేగంగా కేవలం 7రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జి షీటు దాఖలు చేయడం జరిగిందని తెలిపారు.గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టించిన రమ్య హత్య కేసులో నిందితున్ని48 గంటల్లో అరెస్టు చేసి 7 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయగా 8 నెలల్లో న్యాయస్థానం విచారణ పూర్తి చేసి నిందుతునికి ఉరిశిక్ష విధించిందని ఆమె గుర్తు చేశారు.
గత ప్రభుత్వం ఎస్సి,ఎస్టి అత్యాచార బాధితులకు న్యాయపరంగా అందాల్సిన నష్ట పరిహారం చెల్లింపు విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని గత ప్రభుత్వం ఐదేళ్ళ కాలంలో కేవలం 52 కోట్ల 32 లక్షల రూ.లను మాత్రమే బాధితులకు చెల్లించిందని హోంమంత్రి తానేటి వనిత చెప్పారు.అదే ఈప్రభుత్వం వచ్చాక గత మూడేళ్ళ కాలంలో 120 కోట్ల రూ.ల పరిహారం అందించిందని తెలిపారు.మహిళలపై వేధింపులను నిరోధించేందుకు సైబర్ మిత్ర యాప్ ను కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని చెప్పారు.
రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ కె.రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ లీథువేనియా దేశానికి చెందిన యువతిపై జరిగిన అత్యాచార యత్నం కేసులో 24 గంట్లల్లోనే నిందుతులను అరెస్టు చేసి చార్జిషీటు దాఖలు చేయడంతో కోర్టులో విచారణ పూర్తై తీర్పు రిజర్యులో ఉందని చెప్పారు. దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడంతో పాటు రిజిష్టర్ కూడా చేసుకోవాలని అప్పుడే ప్రయోజనం ఉంటుందని అన్నారు.ఈదిశ యాప్ పై ఎవరూ ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి స్పష్టం చేశారు.దిశ యాప్ ద్వారా ఆపదలో ఉన్న మహిళల రక్షణకు పట్టణ ప్రాంతాల్లో అయితే 5నిమిషాల్లోను,గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10 నిమిషాల్లో పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకోగలుగుతున్నారని చెప్పారు.
రాష్ట్రంలో ఇటీవల కాలంలో సుమారు 2లక్షల కిలోల గంజాయిని ధ్వంసం చేయడం జరిగిందని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి వివరించారు.తెలంగాణా,ఒడిస్సా తదితర సరిహద్దు రాష్ట్రాల్లో గంజాయి సాగు అవుతోందని ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో దీనిని పూర్తిగా నివారించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.అలాగే వివిధ ట్రాన్సుపోర్టర్లతో కూడా సమావేశమై వారికి గంజాయి రవాణా నియంత్రణపై తగిన హెచ్చరికలు జారీ చేస్తున్నామని చెప్పారు.అంతేగాక తమిళనాడు,కర్నాటక రాష్ట్రాల డిజిపిల సమన్వయంతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఫోక్సో చట్టం కింద నమోదయ్యే దారుణమైన కేసుల సత్వర విచారణ పూర్తి చేసేందుకు 13 ఫోక్సో కోర్టులు,మహిళలపై జరిగే నేరాల విచారణకు 12 మహిళా కోర్టులు ఏర్పాటు అయ్యాయని ఏలూరు రేంజ్ డిఐజి మరియు టెక్నికల్ సర్వీసెస్ ఇన్చార్జి పాల్ రాజు చెప్పారు.దిశ యాప్ పై కేంద్ర ప్రభుత్వం అడిగిన వివిధ అంశాల్లో 20 రోజల క్రితం వివరణ ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈసమావేశంలో అదనపు డిజిపి రవిశంకర్ అయ్యన్నార్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment