రైతుల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలి - వారి సమస్యలు పరిష్కరించాలి
జాతీయ రహదారి పనుల్ని రైతులు అడ్డుకోవద్దు
జూన్ మొదటి వారంలో ఉపాధిహామీ బిల్లులు విడుదలయ్యే అవకాశం
అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష
విజయనగరం, మే 23 (ప్రజా అమరావతి):
జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారికి కోసం సేకరిస్తున్న భూములకు సంబంధించి వాటిని కోల్పోతున్న రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని వాటిని పరిష్కరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా అధికారులను ఆదేశించారు. అదే సమయంలో రైతులు జాతీయ రహదారి పనులను అడ్డుకోకుండా స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు. విశాఖ - రాయ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనుల విషయంలో రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులు వ్యక్తంచేస్తున్న అభ్యంతరాలపై సమావేశంలో పాల్గొన్న గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్యతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడి ఆ ప్రాంతంలో రైతుల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, వినతులపై తెలుసుకున్నారు. కొత్తవలస ప్రాంతంలో ఉత్తరాపల్లి, గంట్యాడ ప్రాంతంలో కొర్లాంల వద్ద జాతీయ రహదారిపై ఇంటర్ ఛేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారని, వాటికి భూ సేకరణపై రైతులు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారని ఎమ్మెల్యేలు తెలిపారు. ఇంటర్ ఛేంజ్‌లకు సంబంధించి ఎంత భూమి అవసరం వుంటుందో మరోసారి అంచనాలు వేయాలని మంత్రి ఈ సందర్భంగా ఆర్.డి.ఓ. భవానీశంకర్‌ను ఆదేశించారు. భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచే విషయంలో జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రైతుల నుంచి వచ్చే వినతులను పరిశీలించి వారికి న్యాయం చేసేలా నిర్ణయం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారికి మంత్రి సూచించారు.
బాబూ జగజ్జీవన్ రాం సుజల స్రవంతి ప్రాజెక్టు కోసం భూసేకరణపై కూడా చర్చ జరిగింది. అనకాపల్లి ప్రాంతంలో తొలుత భూసేకరణ పూర్తయిన తర్వాత మన జిల్లాలోని కొత్తవలస ప్రాంతంలో భూసేకరణ వుంటుందని కలెక్టర్ తెలిపారు. భూసేకరణ అధికారులు లేని కారణంగా ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరిగిందని పేర్కొన్నారు.
జిల్లాలో చేసిన ఉపాధిహామీ కన్వర్జెన్స్ పనులకు జూన్ మొదటి వారంలో నిధులు విడుదల అయ్యే అవకాశం వుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. జిల్లాలో సుమారు రూ.162 కోట్లు పనులకు చెల్లించాల్సి వుందని జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రస్తుతం పనుల బిల్లులు అప్‌లోడ్ చేసేందుకు వీలుకావడం లేదని జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తెలియజేయడంతో ఉపాధిహామీ రాష్ట్ర డైరక్టర్ చినతాతయ్యలు తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి చేసిన పనుల బిల్లులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు వీలుగా అవకాశం కల్పించాలని సూచించారు.
జిల్లా కేంద్రంలో వున్న రోడ్లు భవనాల శాఖ అతిథిగృహాన్ని పునరుద్దరించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి బొత్స సత్యనారాయణ రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి ఎం.టి.కృష్ణబాబును ఫోన్‌లో కోరారు. నగరానికి అతిథులు ఎవరు వచ్చిన తలదాచుకొనేందుకు సరైన వసతి లేకుండా పోయిందని, దీనిని పునరుద్దరించడం ద్వారా ప్రోటోకాల్ పరంగా ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం.దీపిక, ఉప రవాణా కమిషనర్ శ్రీదేవి, కె.ఆర్.ఆర్.సి. డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల బదిలీల ఫైలు సర్క్యులేషన్‌లో వుంది
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలను ఈ వేసవి సెలవుల్లో చేపట్టేందుకు ఉద్దేశించిన ఫైలు ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉందని మంత్రి బొత్స సత్యానారాయణ చెప్పారు. వేసవిలో టీచర్ల బదిలీలు చేపట్టే అవకాశం ఉందని మంత్రి సోమవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో చట్టం తనపని తాను చేస్తుందన్నారు. ఇప్పటికే ఆయనపై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని, ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఎవరు తప్పుచేసినా ప్రభుత్వం ఒకేవిధంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
addComments
Post a Comment