ఆయుర్వేద వైద్య విద్యార్థులకు 15 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం

 ఆయుర్వేద వైద్య విద్యార్థులకు 15 రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం


తిరుపతి,  జూన్ 01(ప్రజా అమరావతి): తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాలలో బీఏఎంఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు 15 రోజుల శిక్షణా కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. నేషనల్ కమిషన్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆదేశానుసారం 15 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భారతీయ వైద్య విధానాల పై అవగాహన, కంప్యూటర్ విజ్ఞానం వ్యక్తిత్వవికాసం, సంస్కృత పరిజ్ఞానం పై అవగాహన కల్పిస్తారు. ఈ కళాశాలలో చదివి విదేశాల్లో ఆయుర్వేద వైద్యులుగా పని చేస్తున్న, ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు వర్చువల్ విధానంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి, శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారు.

ఉదయం కళాశాల ప్రాంగణంలో ఉన్న భగవాన్ ధన్వంతరి మూర్తి విగ్రహం వద్ద వేదపండితులు పూజ, వేద ఆశీర్వచనం చేశారు. తరువాత శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్వేత డైరెక్టర్ శ్రీమతి ప్రశాంతి ముఖ్యఅతిథిగాపాల్గొని, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. కళాశాలలో సీటు పొందడం విద్యార్థుల పూర్వజన్మ సుకృతం అన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అత్యున్నత స్థితికి చేరుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ, ఈ కళాశాల ప్రారంభించి 40 సంవత్సరాలు అవుతోందన్నారు. కళాశాల, వైద్య శాల, ఫార్మసీ అభివృద్ధికి టీటీడీ ధర్మకర్తల మండలి, ఉన్నతాధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరం నూతన విద్యార్థులతో చరక ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల, వైద్యశాలలో సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీ దుర్గ,డాక్టర్ రేణుదీక్షిత్, డాక్టర్ శ్రీనివాస్ ,ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments