నేటి నుంచి పదిరోజులు టిడ్కో సంబరాలు
నిర్మాణం పూర్తయిన ఇళ్ల ప్రారంభం, లబ్దిదారులకు పంపిణీయే లక్ష్యం
టిడ్కో ఇళ్లపై రూ.10 వేల కోట్ల భారం భరిస్తున్న ప్రభుత్వం
ఏ కష్టం లేకుండా ఇళ్ల యజమానుల్ని చేసిన ఘనత సి.ఎం.జగన్‌దే
రాష్ట్రంలో పంపిణీకి సిద్ధంగా 30వేల టిడ్కో ఇళ్లు
డిసెంబరు నాటికి రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తి
లబ్దిదారులకు 2.62 లక్షల ఇళ్లు ఆ తేదీ కల్లా అందిస్తాం
ఇళ్ల నిర్మాణంలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఏపి
పూర్తి మౌలివ వసతులతోనే ఇళ్లు అందిస్తున్నాం
పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్
విజయనగరం పట్టణ లబ్దిదారులకు నిర్మించిన టిడ్కో ఇళ్లు ప్రారంభం
పేదలూ ధనవంతులతో సమానంగా జీవించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం; మంత్రి బొత్స
విజయనగరం, జూన్ 23 (ప్రజా అమరావతి); సకల మౌళిక వసతులతో కూడిన ఇళ్లను నిరుపేదలకు అందించాలనే లక్ష్యంతో అన్ని మౌళిక వసతులూ పూర్తిస్థాయిలో కల్పించిన తర్వాతే టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందిస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. రాష్ట్రంలో నేటి నుంచి పది రోజులపాటు టిడ్కో సంబరాలు నిర్వహించి వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో పూర్తయిన ఇళ్లను ప్రారంభించి, వాటిని లబ్దిదారులకు అందించే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు వెల్లడించారు. విజయనగరం జిల్లా నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే పదిరోజుల్లో రాష్ట్రంలో 30వేల ఇళ్లను ప్రారంభించి వాటిని లబ్దిదారులకు అప్పగిస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో వున్న టిడ్కో ఇళ్లలో వచ్చే ఆగష్టు, సెప్టెంబరు నాటికి 1.32 లక్షల ఇళ్లను, డిసెంబరు నాటికి 2.62 లక్షల ఇళ్లను అన్ని వసతులతో పూర్తిచేసి సంబంధిత లబ్దిదారులకు అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని అత్యంత ప్రాధాన్యత కార్యక్రమంగా భావిస్తోందని, దీనిలో భాగంగానే టిడ్కో ఇళ్లపై రూ.10 వేల కోట్ల భారాన్నిభరిస్తోందన్నారు. విజయనగరం పట్టణంలోని ఇళ్లులేని నిరుపేదలకు సారిపల్లి సమీపంలో నిర్మించిన టిడ్కో గృహాల సముదాయాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్, మరో మంత్రి బొత్స సత్యనారాయణతో కలసి గురువారం ప్రారంభించారు. టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు నిర్మాణం పూర్తయిన 800 ఇళ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను, ఇళ్ల తాళంచెవిలను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాంటి వసతులు కల్పించకుండా ఆదరాబాదరాగా టిడ్కో ఇళ్లను పూర్తిచేసి ప్రారంభిస్తున్నట్టు హడావిడి చేసిందన్నారు. 300 చదరపు అడుగులతో కూడిన ఇంటికి గత ప్రభుత్వం రూ.2.65 లక్షలు బ్యాంకు రుణం తీసుకోవాలని, లబ్దిదారు 500 రూపాయలు డిపాజిట్ చెల్లించాలని నిబంధన విధించగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ పేదలపై ఇళ్ల నిర్మాణ భారం వుండకూడదనే లక్ష్యం కేవలం ఒక్క రూపాయికే రూ.6.50 లక్షల ఇళ్లను ఉచితంగా అందజేస్తున్నారని పేర్కాన్నరు. దేశంలోనే ఇళ్ల నిర్మాణంలో ఏ.పి. నెంబర్‌వన్‌గా వుందని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
పేదలు ఎలాంటి కష్టాలు ఎదుర్కొనకుండా వారికి ఇళ్లు నిర్మించి వారిపేరుతోనే ఉచితంగా ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించి దస్తావేజులు అందజేస్తున్న ముఖ్యమంత్రి శ్రీజగన్‌కు మహిళలంతా అండగా, తోడుగా నిలవాల్సి వుందన్నారు. మన పిల్లల భవిష్యత్ కోసం, వారి ఉన్నత చదువులకోసం ఎన్నో మంచిపనులు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మరో 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా వుండటం అవసరమని పేర్కొన్నారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయడంలో గత మూడేళ్లలో పురపాలక మంత్రిగా వున్న మంత్రి బొత్స సత్యనారాయణ కృషి ఫలితంగానే టిడ్కో ఇళ్లు ఈ స్థాయికి చేరాయని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ధనికులతో సమానంగా పేదలకూ వసతులు కల్పించి వారు కూడా ధనికులతో సమానంగా జీవించే పరిస్థితులు రావాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం ఎంతో ఖర్చుచేసి ఆధునిక వసతులతో టిడ్కో ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇస్తోందన్నారు. టిడ్కో కాలనీల్లో మౌళిక వసతుల కల్పనకు ఒక్కో ఇంటిపై రూ.1.00 లక్ష ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. సారిపల్లి టిడ్కో కాలనీలో సచివాలయం, ఆసుపత్రి తదితర అన్ని వసతులూ కల్పిస్తామని, ఇళ్లు పొందిన వారంతా ప్రభుత్వం కేటాయించిన ఇళ్లలో నివాసం వుండాలని స్పష్టంచేశారు. ఆరు నెలల్లో మిగిలిన ఇళ్లు కూడా పూర్తిచేసి లబ్దిదారులకు అందజేస్తామన్నారు. కొత్తగా ఇళ్లు పొందిన లబ్దిదారులకు నూతన వస్త్రాలు అందజేసి, భోజనం పెట్టి గృహప్రవేశం చేయించే బాధ్యత తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి మంత్రి సూచించగా అందుకు ఎమ్మెల్యే కోలగట్ల అంగీకరించారు. ఉచితంగా టిడ్కో ఇళ్లు పొందిన ప్రతి లబ్దిదారుడు గర్వంగా తనకు జగన్మోహన్ రెడ్డి ఇళ్లు మంజూరు చేశారని చెప్పుకోవాలన్నారు.
ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న 3,776 ఇళ్లను దశల వారీగా వచ్చే డిసెంబరు నాటికి సకల వసతులతో లబ్దిదారులకు అందజేస్తామన్నారు. 300 చదరపు అడుగుల ఇళ్లు మంజూరైనవారు ఏ ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా ఇళ్లను మంజూరు చేసి పారదర్శకంగా ఇళ్లు కేటాయించేలా చర్యలు చేపడతామన్నారు. ఇళ్ల లబ్దిదారులకు ఏ అవసరం వున్నా తమకు తెలియజేయాలని వారికి అండగా వుంటామని ఎమ్మెల్యే చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎం.పి.బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీలు రఘు రాజు, సురేష్‌బాబు, టిడ్కో ఛైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.సూర్యకుమారి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, నగర కార్పొరేటర్లు, మునిసిపల్ కమిషనర్ ఆర్.శ్రీరాములు నాయుడు, టిడ్కో ఎం.డి., పలువురు టిడ్కో డైరక్టర్‌లు పాల్గొన్నారు.
addComments
Post a Comment