జూలై 4న ప్రధాని నరేంద్ర మోడి భీమవరం పర్యటన పటిష్టమైన ఏర్పాట్లు చేయండి:సిఎస్

 జూలై 4న ప్రధాని నరేంద్ర మోడి భీమవరం పర్యటన పటిష్టమైన ఏర్పాట్లు చేయండి:సిఎస్


అమరావతి,3 జూలై (ప్రజా అమరావతి):ప్రధాన మంత్రి నరేంద్ర మోడి జూలై 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్ననేపధ్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.ఈవిషయమై శుక్రవారం అమరావతి సచివాలయం నుండి సంబంధిత శాఖల అధికారులతో ఆయన వీడియో సమావేశం ద్వారా చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్షించారు.ప్రధాని పర్యటనకు ఇంకా నెలరోజులు సమయం ఉందని ఇది ప్రాధమిక సమావేశమే కావున ఇప్పటి నుండి తగిన ప్రణాళిక రూపొందించి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.జూలై 4వతేదీన ప్రధాని నరేంద్ర మోడి ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భీమవరం పర్యటనలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను పురస్కరించుకుని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.అనంతరం బహిరంగ సభలో ప్రధాని పాల్గోనున్నారని సిఎస్ పేర్కొన్నారు.ప్రధాని భీమవరం చేరుకుని తదుపరి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ,బహిరంగ సభ వరకూ పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెప్పారు.ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కలక్టర్,ఎస్పి సహా ఇతర రాష్ట్ర స్థాయి శాఖల అధికారులు తగిన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుని ఆప్రకారం ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడి భీమవరం పర్యటన సందర్భంగా పట్టణంలో రోడ్లన్నిటినీ పరిశుభ్రంగా ఉంచడంతో పాటు రోడ్లకు పూర్తిస్థాయిలో మరమత్తులు నిర్వహించాలని సిఎస్ మున్సిపల్,ఆర్అండ్బి తదితర శాఖల అధికారులను ఆదేశించారు.పోలీస్ శాఖ అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లకు తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆప్రకారం చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.ఇంకా సంబంధిత శాఖల పరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. 

వీడియో లింక్ ద్వారా రాష్ట్ర టిఆర్అండ్బి శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు, శాంతి భద్రతల అదనపు డిజి రవిశంకర్ అయన్నార్,సమాచారశాఖ కమీషనర్ టి.విజయ కుమార్ రెడ్డి,స్వచ్చాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండి సంపత్ కుమార్,పశ్చిమ గోదావరి జిల్లా కలక్టర్ ప్రశాంతి,ఎస్పి తదితర అధికారులు పాల్గొనగా సమావేశంలో ఇంటిలిజెన్సు ఎస్పి వెంకట అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

    

Comments