వివిధ పధకాల కింద డిబిటి ద్వారా లక్షా 46వేల కోట్ల రూ.లు లబ్దిదారుల ఖాతాల్లో జమచేశాం

 వివిధ పధకాల కింద డిబిటి ద్వారా లక్షా 46వేల కోట్ల రూ.లు లబ్దిదారుల ఖాతాల్లో జమచేశాం


నాన్ డిబిటి కింద మరో 44వేలు కోట్లు జమచేశాం

ద్రవ్యలోటు విషయంలో 2.10 శాతంతో దేశంలో బెస్ట్ ఫెర్పార్మింగ్ స్టేట్ గా ఎపి

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సిఏజి ఇచ్చే నివేదికే ప్రామాణికం దానిని విశ్వసించాలి

గత ప్రభుత్వం హాయంతో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర ఆర్ధికపరిస్థితి మెరుగ్గానే ఉంది

గత ప్రభుత్వ కాలంలో ఎగుమతుల్లో దేశంలో ఎపి 7వ స్థానంలో ఉంటే నేడు 4వస్థానం

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వంపై దుప్రచారాన్ని విడనాడాలి


              రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్

అమరావతి,24 జూన్ (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈప్రభుత్వ అధికారానికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ నవరత్నాల్లో పేర్కొన్నవివిధ సంక్షేమ పధకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)పధకం కింద లక్షా 46వేల కోట్ల రూ.లను ఆయా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేయం జరిగిందని,అలాగే నాన్ డిబిటి కింద మరో 44వేల కోట్ల రూ.లను జమచేశామని రాష్ట్ర ఆర్ధిక మరియు శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు బుగ్గన రాజేంద్రనాధ్ స్పష్టం చేశారు.శుక్రవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఈప్రభుత్వం రాష్ట్రాన్ని,కేంద్ర ప్రభుత్వాన్నికూడా తప్పుద్రోవ పట్టిస్తోందని ప్రధాన ప్రతిపక్షనేతలు విమర్శించడంతో పాటు ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు.కోవిడ్ సమయంలో సామాన్య ప్రజలకు నగదు అత్యంత అవసరం ఉన్న నేపధ్యంలోనే వివిధ పధకాల కింద లబ్దిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయడం జరిగిందని చెప్పారు.ద్రవ్యలోటు విషయంలో ప్రస్తుతం 2.10 శాతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో ఉత్తమ ఫెర్పార్మింగ్ స్టేట్ గా నిలిచిందని కాగ్ (కంట్రోలర్ అండ్ ఆడిటర్)నివేదికలే తెలియజేస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు.కాని ప్రతిపక్ష నేతలు కాగ్ నివేదికను నమ్మరు,సిబిఐని నమ్మరు మరి ఎవరిని నమ్మతారని ఆయన ఎద్దేవా చేశారు.ప్రతిపక్షంగా ఆయా పధకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేసేందుకు వీలుగా ప్రభుత్వానికి తగిన సూచనలు,సలహాలను ఇవ్వాలి తప్ప లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేయడం సరికాదని మంత్రి రాజేంద్రనాధ్ చెప్పారు.

ద్రవ్యలోటు(Fiscal Deficit)గత ప్రభుత్వం హయాం ప్రస్తుత ప్రభుత్వ హయాంలోను రాష్ట్ర ద్రవ్యలోటు పరిస్థితిని ఒకసారి గమనిస్తే 2015-16లో 3.95శాతం,2016-17లో 3.65శాతం,2017-18లో 4.5శాతం, 2018-19లో 4.2శాతం,2019-20లో 4.11శాతం, 2020-21లో 5.44 శాతం,2021-22లో 2.10 శాతంగా ఉండి దేశంలోనే ఉత్తమ ఫెర్పార్మింగ్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పునరుద్ఘాటించారు.కోవిడ్ సమయంలోకూడా 5 శాతం కంటే తక్కువ ద్రవ్యలోటు ఉందని అన్నారు.అంతేగాక ఆర్ధిక సంఘం ఇచ్చిన పరిమితి కంటే కూడా తక్కువ లోటుతో ఉన్నాకూడా రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు దుష్ప్రచారాన్నిచేయడమే గాక బ్యాంకులు,ఇతర ఆర్ధిక సంస్థలను కూడా తప్పుద్రోవ పట్టించే విధంగా దుష్ప్రచారాన్ని చేయడం సమంజసం కాదని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ హితవు చేశారు.అదే విధంగా రాష్ట్ర విభజన కష్టాలను అధికమిస్తూ పేద  కుటుంబాలకు  వృద్ధాప్య ఫించన్లు,అమ్మఒడి,చేయూత,రైతు భరోసా,విద్యా దీవన,నాడు-నేడు వంటి నవరత్నాల్లో పేర్కొన్నఅనేక సంక్షేమ పధకాలను విజయవంతంగా అమలు చేస్తుంటే ఆయా పధకాలను అమలు చేయవద్దని ప్రతిపక్షనేతలు చెప్పగలరా అని మంత్ర రాజేంద్రనాధ్ ప్రశ్నించారు.

అదే విధంగా గత ప్రభుత్వ కాలంలో 19.46 శాతం మేర అప్పులు చేస్తే ఈప్రభుత్వం 15.77శాతం మాత్రమే అప్పులు చేయడం జరిగిందని మంత్రి రాజేంద్రనాధ్  పేర్కొన్నారు.గత ఆర్ధిక సంవత్సరం బడ్జెట్లో 30 వేల కోట్ల రూ.లను అప్పులు చేయాలని నిర్దేశించుకుంటే 25 వేల కోట్ల రూ.లను మాత్రమే అప్పు చేశామని మంత్రి స్పష్టం చేశారు.

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పధకం అమలు గురించి మంత్రి రాజేంద్రనాధ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో అనగా 2014-19 కాలంలో ఈపధకం కింద 27 వేల కోట్ల రూ.ల పనులు నిర్వహిస్తే ఈప్రభుత్వం గత మూడేళ్ళ కాలంలోనే 27 వేల 448 కోట్ల రూ.లను ఖర్చు చేసినట్టు తెలిపారు.ఎస్డిఎల్ లకు సంబంధించి తీసుకున్న వడ్డీ రేట్ల గురించి మంత్రి మాట్లాడుతూ 2014-15లో 8.6శాతం,2015-16లో 8.3శాతం,2016-17లో 7.5శాతం, 2017-18లో 7.5శాతం, 2018-19లో 7.4శాతం,2019-20లో 7.4శాతం,2020-21లో 6.6శాతంగా ఉండగా 2021-22లో 7.1 శాతంగా ఉందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఎగుమతులకు సంబంధించి మాట్లాడుతూ దేశంలో 2019-20లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7వ స్థానంలో ఉంటే 2020-21లో 4వ స్థానంలో నిలిచిందని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ చెప్పారు.చివరగా ఉద్యోగుల జీతాలు చెల్లింపు అంశంపై మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జీతాలు చెల్లించేందుకు సరాసరిన పది రోజుల వరకూ పట్టేదని కాని నేడు రెండు మూడు రోజుల్లోనే చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.కాగా పొరుగు సేవల ఉద్యోగుల జీతాలు చెల్లింపునకు సంబంధించి సంబంధిత శాఖలు డేటాను అప్ల్ లోడ్ చేయాల్సి ఉందని సకాలంలో అప్ లోడ్ చేయకపోవడంతోనే వారి జీతాల చెల్లింపు విషయంలో ఆలస్యం జరుగుతోందని ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పేర్కొన్నారు.

     

Comments