డ్రై ఫ్లవర్ టెక్నాలజి కళాకృతులను అభినందించిన ముఖ్యమంత్రి
తిరుపతి, జూన్ 23 (ప్రజా అమరావతి): డ్రైఫ్లవర్ టెక్నాలజి ద్వారా టీటీడీ, డాక్టర్ వై.ఎస్.ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం సంయుక్తంగా వివిధ కళాకృతులతో తయారు చేస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి, అమ్మవార్ల ఫోటో ప్రేమ్‌లు అద్భుతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అభినందించారు.
తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద ( పేరూరు బండపై ) నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమానికి గురువారం హాజరైన ముఖ్యమంత్రికి టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి శ్రీ వకుళమాత ఆకృతితో తయారు చేసిన డ్రైఫ్లవర్ టెక్నాలజి ఫోటో ప్రేమ్‌ను అందించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి అభినందించారు.
డ్రైఫ్లవర్ టెక్నాలజి కళాకృతులకు విశేష ఆదరణ
టీటీడీలోని వివిధ ఆలయాల్లో ఉపయోగించిన పూలతో డ్రైఫ్లవర్ టెక్నాలజిని ఉపయోగించి శ్రీవారు, అమ్మవార్ల ఫోటో ప్రేమ్‌లు, పేపర్ వెయిట్స్, క్యాలెండర్లు, కీ చైన్‌లు తదితర ఉత్పత్తులను తయారు చేయడానికి టీటీడీ, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంతో గత ఏడాది సెప్టెంబరు 13వ తేదీన ఎంఓయు కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా రూ.83 లక్షలతో పరికరాలు, శిక్షణకు టీటీడీ నిధులు సమకూర్చుతోంది. తిరుపతిలోని సిట్రస్ రిసెర్చ్ స్టేషన్‌లో దాదాపు 350 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేకంగా డ్రై ఫ్లవర్ టెక్నాలజీపై శిక్షణ ఇచ్చారు. రోజు 200 మంది మహిళలు స్వామి, అమ్మవారి ఆకృతులను, వివిధ కళాకృతులను ఏ ఫోర్ సైజులో తయారు చేస్తున్నారు. ఒక మహిళ రోజుకు రెండు చిత్ర పటాలు తయారు చేయవచ్చు. ఇప్పటివరకు 16,823 ఏ ఫోర్ సైజు ఫోటో ప్రేమ్‌లు, 530 కీ చైన్‌లు, 150 పేపర్ వెయిట్లు, మరో 300 బుక్ మార్స్క్, పెండంట్స్రూ, పెన్ హుక్‌లు తయారు చేశారు. త్వరలో సిట్రస్ రిసెర్చ్ స్టేషన్‌లో శాశ్వత షెడ్డు ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
టీటీడీ జనవరి 25వ తేదీ నుండి వీటిని భక్తులకు విక్రయానికి అందుబాటులో ఉంచింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల, స్థానిక ఆలయాల్లోను, దేశంలోని టీటీడీ సమాచార కేంద్రాల్లోను ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది.
addComments
Post a Comment