పారిశ్రామికవేత్తలకు సదవకాశం : ఏపీఐఐసీ



*పారిశ్రామికవేత్తలకు సదవకాశం : ఏపీఐఐసీ*


*పాత బకాయిలు, వడ్డీలు, ప్రస్తుత ఆస్తిపన్ను ఒకేసారి చెల్లించేవారికి 5 శాతం తగ్గింపు*


*జూలై 31 లోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం*


*234వ ఏపీఐఐసీ బోర్డు మీటింగ్ లో ఏపీఐఐసీ కీలక నిర్ణయం*



అమరావతి, జూన్, 27 (ప్రజా అమరావతి): పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నేపథ్యంలో ఆస్తి పన్నులు, వాటి వడ్డీలు చెల్లించలేని పరిస్థితుల్లో ఎప్పటి నుంచో బకాయిలున్న వాణిజ్యవేత్తలకు మరో సదవకాశం కల్పించింది.  ఒకేసారి మొత్తం చెల్లించే వారికి కట్టాల్సిన మొత్తం మీద  5 శాతం తగ్గించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు జూన్ 16వ తేదీన జరిగిన 234వ  సమావేశంలో ఆ ప్రతిపాదనకి ఏపీఐఐసీ బోర్డు ఆమోద ముద్ర వేసింది.  2022-23 ఏడాదికి గానూ చెల్లించవలసిన ఆస్తి పన్నును ఆయా పారిశ్రామికవేత్తలు జూలై 31వ తేదీ లోపే చెల్లించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో పరిశ్రమలను నడపలేని స్థితికి చేరిన పరిస్థితులను అర్థం చేసుకుని ఆ ప్రతిపాదనపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీఐఐసీ వెల్లడించింది.


ఇదే విధంగా రానున్న 2023-24 ఏడాది పన్ను చెల్లింపులకు గానూ ముందస్తుగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రాబోయే రోజుల్లో ప్రతి ఏడాది ఏప్రిల్ 30వ తేదీలోపు ఒకే విడతలో మొత్తం ఆస్తి పన్ను చెల్లించిన పారిశ్రామికవేత్తలకు మొత్తం బకాయి చెల్లింపులో 5శాతం తగ్గింపు నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఏపీఐఐసీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ విధానంలోనే ఆస్తి పన్నులను వసూలు చేసే విధంగా జోనల్ మేనేజర్లు, ఐలా కమిషనర్లకు ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది మార్గదర్శకాలిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లోని పారిశ్రామిక వాడలతో పాటు మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామికవాడలకు కూడా ఈ 5శాతం తగ్గింపు వర్తిస్తుంది. అయితే, అర్బన్ ఐలాల్లో జూన్ 30లోపు  చెల్లించిన వారికి ఐదు శాతం తోపాటుగా అదనంగా  పెనాల్టీ  కూడా తగ్గుతుంది. కాబట్టి వారికి ఈ అవకాశం మరింత లాభదాయకమవుతుంది. 5 శాతం రాయితీ విధానంపై సీజీజీ ఆన్ లైన్ పోర్టల్ లో మార్గదర్శకాలు సోమవారం నుంచి అందుబాటులోకి  వచ్చాయి. పాత బకాయిలు, ప్రస్తుత ఆస్తి పన్ను, వడ్డీలపై ఏపీఐఐసీ తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి ఊరటనిస్తుందని  పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి.

Comments