ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్ల శిక్షణ

 

ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్ల శిక్షణ


ఆర్టీసీ ద్వారా శిక్షణకు ఏర్పాట్లు

శిక్షణానంతరం ఆర్టీసీలోనే ఉద్యోగాలు

పీజీ విద్యార్థులకు కార్పొరేషన్ ద్వారా రుణాలు

మేరుగు నాగార్జున

అమరావతి, జూన్ 29 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో రూ.135 కోట్ల నిధులతో పలు కార్యక్రమాలను చేపట్టనున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు.  స్వదేశంలోనూ, విదేశాల్లోనూ పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసే విద్యార్థులకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలను కూడా అందించనున్నామని తెలిపారు. ఎస్సీ మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.

వివిధ పథకాల అమలుపై సచివాలయంలో బుధవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ నిధుల్లో 57 శాతం ఇన్ కం జనరేషన్ పథకాలకు, 10శాతం నైపుణ్యాభివృద్ధికి, 30శాతం భవన నిర్మాణాలను ఉపయోగించాల్సి ఉంటుందని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఆర్.టి.సి. ద్వారా ఎస్సీ మహిళలకు భారీ వాహనాల డ్రైవింగ్ లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణానంతరం మహిళలను ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లుగా ఖాళీగా ఉన్న స్థానాల్లో నియమించడం జరుగుతుందని వివరించారు. ఆర్టీసీ శిక్షణా కేంద్రాల్లోనే ఈ శిక్షణ ఉంటుందన్నారు. సాంఘిక సంక్షేమశాఖ ద్వారా శిక్షణ పొందే అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే దేశ, విదేశాల్లో నర్సింగ్ పోస్టులకు ఉన్న డిమాండ్ దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో నర్సింగ్ లోనూ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని నాగార్జున చెప్పారు. యూకే లో 10వేల నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఈ సందర్భంగా ఉదహరించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలుచేస్తున్న ఉపాధి పథకాల్లో భాగంగా వాహనాల కొనుగోలు కోసం అధికారులు ప్రతిపాదించిన రూ.12 లక్షల రుణ మొత్తాన్ని రూ.16 లక్షలకు పెంచాలని అధికారులు ఆదేశించారు. స్థానికంగా డిమాండ్ ఉన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా రుణాలను సమకూర్చాలని కోరారు. పీజీ చదివే విద్యార్థులకు కూడా రుణాలను అందించనున్నామని తెలిపారు. ఎన్.ఎస్.కే.ఎఫ్.డీ.సి పథకం కింద విదేశాల్లో పీజీ చదివే వారికి రూ.20 లక్షలు, స్వదేశంలో పీజీ చదివేవారికి రూ.15 లక్షల చొప్పున రుణంగా అందిస్తామని వివరించారు.

పనితీరు మార్చుకోవాలి: అధికారులకు మంత్రి సలహా

సమావేశాలలో తాము ఆదేశించిన అంశాలపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఇక సమీక్షా సమావేశాలు నిర్వహించి ఉపయోగం ఏమిటని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమశాఖకు చెందిన అధికారుల పనితీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. తాను పిలిచి సమావేశాలు పెట్టినప్పుడే కాకుండా మిగిలిన సమయాల్లోనూ అధికారులు తనతో మాట్లాడాలని  పరిస్థితులు తన దృష్టికి తీసుకురావాలని, పని తీరు మార్చుకోవాలని సూచించారు. తాను చెప్పిన విషయాలపై అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. అయితే తాను చెప్పింది చేసేంతవరకూ దాని గురించి తాను అడుగుతూనే ఉంటానని కూడా స్పష్టం చేసారు. తాను సమీక్షా సమావేశాలను నిర్వహించినప్పుడే ఏదో చెప్పడం కాకుండా మిగిలిన సమయాల్లోనూ అధికారులు తనను కలిసి అన్ని విషయాలను వివరించడం సముచితంగా ఉంటుందని పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, గురుకులం కార్యదర్శి పావనమూర్తి, లిడ్ క్యాప్ విసిఎండి డోలా శంకర్, ఎస్సీ కార్పొరేషన్ జీఎం కరుణకుమారి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Comments