ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పింఛన్ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాలి


నెల్లూరు,  జూన్ 16 (ప్రజా అమరావతి): అసంఘటిత కార్మికులు, చిరు వ్యాపారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ ధన్ పింఛన్ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు అధికారులు కృషి చేయాల


ని జిల్లా ప్రజా పరిషత్ సీఈవో శ్రీమతి వాణి పిలుపునిచ్చారు.

 గురువారం ఉదయం నగరంలోని జడ్పీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆజాది సే అంత్యోదయ తక్ 90 రోజుల కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 75 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని, అందులో మన రాష్ట్రం నుంచి నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 28వ తేదీ నుంచి మూడు నెలల కాల వ్యవధిలో వివిధ శాఖల పరిధిలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి శ్రమ యోగి మాన్ ధన్ పింఛన్ పథకాన్ని జిల్లాలో  18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల చిరు వ్యాపారులు, ఆశా, అంగన్వాడి కార్యకర్తలు, ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు, డ్రైవర్లు, చేనేత కార్మికులు మొదలైన అసంఘటిత రంగంలోని కార్మికులు వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. 

 ఈ సమావేశంలో డిఆర్డిఎ, డ్వామా, ఐసీడీఎస్ పీడీలు శ్రీ సాంబశివారెడ్డి, శ్రీ తిరుపతయ్య, శ్రీమతి ఉమామహేశ్వరి, డిఎంహెచ్ఓ శ్రీ పెంచలయ్య, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీ వెంకటేశ్వర రావు, డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ ప్రదీప్, అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ ఏడిలు  శ్రీ నరసోజీ రావు, శ్రీ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 


Comments