ఆస్తి కోరితే ప్రాణం తీస్తారా..?
- మహిళపై
విచక్షణారహిత దాడిని ఖండించిన మహిళా కమిషన్
- నేరస్తుడిపై కఠిన చర్యలకు ఆదేశం
అమరావతి (ప్రజా అమరావతి):
ఆడపిల్ల ఆస్తిహక్కును కాలరాసే విధంగా వ్యవహరించే వారి పట్ల మహిళా కమిషన్ సీరియస్ గా ఉంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామంలో ఆస్తి కోసం అన్న కూతురిపై బాబాయి విచక్షణారహితంగా దాడికి పాల్పడటాన్ని వాసిరెడ్డి పద్మ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరలవుతున్న దాడి వీడియోను చూసి ఆమె చలించిపోయారు. ఈ ఘటనపై ఆమె బుధవారం మీడియాతో స్పందించారు. పట్టపగలు వేటకొడవలితో ఒక మహిళపై దాడికి పాల్పడుతున్నప్పుడు అక్కడున్న వారెవరూ అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి ఆటవిక దాడులపై సభ్యసమాజం తలదించుకోవాల్సి వస్తుందన్నారు. బాధితురాలు కోటమ్మ ఆరోగ్యం పై గుంటూరు ప్రయివేట్ ఆస్పత్రి వైద్యులను ఆరాతీశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసు ఉన్నతాధికారులతో వాసిరెడ్డి పద్మ మాట్లాడి దాడి వివరాలు తెలుసుకున్నారు. సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేసే ఇటువంటి నేరస్తుడికి కఠిన శిక్షలు విధించేలా కేసు దర్యాప్తుతో చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశాలిచ్చారు.
addComments
Post a Comment