అమ‌రావ‌తిలో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ

     అమరావతి,  జూన్ 09 (ప్రజా అమరావతి);


అమ‌రావ‌తిలో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ-   శిలాఫ‌ల‌కాన్ని ఆవిష్క‌రించిన విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి, 

గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్,టీటీడీ చైర్మ‌న్ శ్రీవైవి.సుబ్బారెడ్డి


-  శాస్త్రోక్తంగా వైదిక క్రతువులు


       గుంటూరు జిల్లా వెంక‌ట‌పాలెంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం ఉదయం 7.50 నుండి 8.10 గంటల నడుమ మిథున‌ లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఇందుకు సంబంధించిన శిలాఫ‌ల‌కాన్ని విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర‌ సరస్వతి, గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మ‌న్ 

శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆవిష్క‌రించారు.


       అంత‌కుముందు ఉద‌యం 4.30 నుండి 6.30 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7.15 గంటల వరకు విమాన గోపుర క‌ల‌శ ఆవాహ‌న చేశారు. ఉదయం 7.50 నుండి 8.10 గంటల మధ్య ఆగమోక్తంగా ప్రాణ ప్ర‌తిష్ట‌, మహాసంప్రోక్షణ నిర్వ‌హించారు. ఆ తరువాత  బ్రహ్మఘోష, వేదశాత్తుమొర నిర్వహించారు. ఉద‌యం 10.30 నుండి 11 గంట‌ల వ‌ర‌కు ధ్వజారోహణం నిర్వ‌హించారు.


       మ‌ధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, సాయంత్రం 4.30 నుండి 5.30 గంటల వరకు ఉత్సవమూర్తుల ఊరేగింపు, ధ్వజావరోహణం, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ నిర్వహించ‌నున్నారు.


       ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మా నందేంద్ర సరస్వతి,  ఎంపీ శ్రీ సురేష్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ సత్యనారాయణ, ముఖ్యమంత్రి మంత్రి  ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్ ఎస్ రావత్, దేవాదాయ కమీషనర్ శ్రీ హరిజవహర్ లాల్,ఎమ్మెల్యే శ్రీమతి శ్రీదేవి, గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి క్రిష్టిన, 

బోర్డు సభ్యులు శ్రీ బుర్రా మధుసూదన్ యాదవ్, శ్రీ మల్లాడి కృష్ణారావు, జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా బార్గ‌వి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్,

సిఇ శ్రీ నాగేశ్వరరావు, డెప్యూటీ ఈవోలు శ్రీ గుణభూషణ్‌రెడ్డి, శ్రీ విజయ సారథి, శ్రీ గోవింద రాజన్, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, తదితరులు పాల్గొన్నారు.


అథితులకు సన్మానం


     శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ అనంతరం ఆలయ ముఖమండపంలో  గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరించందన్ ను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందించారు. అనంతరం గవర్నర్ కు వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు.


చైర్మన్ దంపతులచే అర్చక బహుమానం

     శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ సందర్బంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణం దారులను టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. శాలువతో సత్కరించి పంచలు బహూకరించారు.
Comments