అమరావతి, జూన్ 09 (ప్రజా అమరావతి);
అమరావతిలో శ్రీవారి ఆలయ నిర్మాణంతో మరింత ఆధ్యాత్మిక శోభ - శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు - టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి. సుబ్బారెడ్డి
శ్రీవారి అనుగ్రహంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి - దేవాదాయ శాఖ మంత్రి శ్రీ సత్యనారాయణ
వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ శారద పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కోరిక మేరకు, టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అమరావతి ప్రాంతంలో
శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించినట్లు తెలిపారు. వైఖానస ఆగమానుసారం అద్భుతమైన శిల్ప కళతో శ్రీవారి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. ఆలయంలో మూలమూర్తి సాక్షాత్తు తిరుమల వెంకన్న తిరిగి వచ్చాడా అన్నంతగా ఉందన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా అమరావతిలో నిర్మించిన శ్రీవారి ఆలయం ప్రత్యేకంగా ఉన్నదని చెప్పారు.
శ్రీ వారి అనుగ్రహంతో రాష్ట్రం బాగుండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం టీటీడీ ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ, అమరావతిలో రెండు సంవత్సరాల క్రితం రూ.31 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపట్టామన్నారు.
సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇటీవల విశాఖ, ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయాలు ప్రారంభించినట్లు చెప్పారు. అదే విధంగా ఉత్తర భారతదేశంలోని జమ్మూలో 60 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు
శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వెనుకబడిన ప్రాంతాల్లో 500 ఆలయాలు పూర్తి చేసినట్లు చెప్పారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా గిరిజన, మత్స్యకార, బడుగు బలహీనవర్గాల ప్రాంతాలలో రాబోయే రెండేళ్ళలో 1300 శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ, తిరుమల నుండి స్వామివారు మనందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చారన్నారు. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమల వెళ్లే భక్తులకు అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించడం ద్వారా ఇక్కడే స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో అమరావతి లో స్వామివారి ఆలయాన్ని నిర్మించిన టీటీడీ ని ఆయన అభినందించారు. శ్రీ వారి అనుగ్రహంతో రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
addComments
Post a Comment