హైకోర్టు జడ్జిగా జస్టిస్ సత్యనారాయణ మూర్తి అందించిన సేవలు అభినందనీయం:సిజె.మిశ్రా

 హైకోర్టు జడ్జిగా జస్టిస్ సత్యనారాయణ మూర్తి అందించిన సేవలు అభినందనీయం:సిజె.మిశ్రా


అమరావతి,13 జూన్ (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి న్యాయ వ్యవస్థకు అందించిన సేవలు అభినందనీయమైనవని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.సోమవారం నేలపాడులోని ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందిన జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తికి హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు పలికారు.ఈసందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కూమార్ మిశ్రా మాట్లాడుతూ మచిలీపట్నంలో జన్మించిన జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాల నుండి న్యాయశాస్త్ర పట్టాను పొంది మచిలీపట్నంలో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి విజయనగరం,కర్నూలు తదితర  జిల్లాల్లో న్యాయమూర్తిగా పని చేశారన్నారు.తదుపరి 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు  న్యాయమూర్తిగా ఎంపికై విశేష సేవలందించారని కొనియాడారు.జస్టిస్ సత్యనారాయణ మూర్తి న్యాయమూర్తిగా అత్యధిక సంఖ్యలో అనగా 31వేలకు పైగా కేసులను పరిష్కరించి రికార్డు సృష్టించారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.జస్టిస్ సత్యనారాయణ మూర్తి అన్ని రకాల కేసులను డీల్ చేశారని అన్నారు.పదవీ విరమణ చేసిన జస్టిస్ సత్యనారాయణ మూర్తి శేష జీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఆనందంగా సాగాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆకాంక్షించారు.

హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ గత ఎనిమిదేళ్ళుగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించుటలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.న్యాయమూర్తిగా హక్కుల పరిరక్షణకు తన వంతు కృషి చేశానని పేర్కొన్నారు.వివిధ హోదాల్లో తన కెరీర్లో అన్ని విధాలా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరు పేరున ప్రత్యేక కృతజ్ణతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు.

అంతకు ముందు హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామి రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రిజిష్ట్రార్ గా,2013 నుండి హైకోర్టుకు న్యాయమూర్తిగా జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి అందించిన సేవలు అభినందనీయమైనవని పేర్కొన్నారు.హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గంటా రామారావు మాట్లాడుతూ న్యాయవాదిగా జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి 30ఏళ్ళ పాటు ప్రాక్టీస్ చేశారని 1998లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొంది తదుపరి వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు గత ఎనిమిదేళ్ళుగా హైకోర్టు న్యాయమూర్తిగా మెరుగైన సేవలందించారని పేర్కొన్నారు.హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్.హరనాధ్ రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి సేవలను కొనియాడారు.

ఇంకా ఈకార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,రిజిష్ట్రార్లు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు,బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    

Comments