జిల్లాకొక సంబంధాల అధికారి (రిలేషన్ షిప్ మేనేజర్) నియామాకానికి ఆదేశం


 




*త్వరలో ఏపీ సత్తా చాటేలా పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు : పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్*


*ఈడీబీ నిర్వహిస్తోన్న కీలక ప్రాజెక్టులపై  సమీక్ష సమావేశం*


*జిల్లాకొక సంబంధాల అధికారి (రిలేషన్ షిప్ మేనేజర్) నియామాకానికి ఆదేశం*


*పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో  మంత్రి అమర్ నాథ్*


అమరావతి, జూన్, 02 (ప్రజా అమరావతి): త్వరలో ఏపీ సత్తా చాటేలా పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు  ఏర్పాటు చేయాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్  ఆదేశించారు. ఈడీబీ నిర్వహిస్తోన్న కీలక ప్రాజెక్టులపై ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ పరిశ్రమకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి పరిష్కారం చూపేందుకు ప్రతి జిల్లాలో ఒక రిలేషన్ షిప్ మేనేజర్ ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, ఏపీఐఐసీ అధికారులు, ఈడీబీ ప్రతినిధులతో  సమీక్షా సమావేశం సందర్భంగా మాట్లాడుతూ... దావోస్ పర్యటనలో వచ్చిన పెట్టుబడులు, వాటి తదనంతరం శాఖపరమైన కొనసాగింపు చర్యలపై మంత్రి అమర్ నాథ్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఈడీబీ ప్రతినిధుల రాకతో యువోత్సాహంగా ఉన్న తరుణంలో ప్రతి జిల్లాలో పరిశ్రమల శాఖను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు  చేపట్టాలన్నారు. పరిశ్రమలకు సంబంధించి జాప్యం, ఆలస్యానికి తావు లేని విధంగా సమన్వయంతో అందరూ ముందుకు వెళ్ళాలని అధికారులకు మంత్రి అమర్ నాథ్ స్పష్టం చేశారు. 


ఈ కార్యక్రమంలో ఏపీఈడీబీ సీఈవో, ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, పరిశ్రమల శాఖ అదనపు సంచాలకులు ఏవీ పటేల్, జాయింట్ డైరెక్టర్లు ఇందిరా దేవి, వీఆర్ వీఆర్ నాయక్, ఈడీబీ ప్రతినిధులు పాల్గొన్నారు.


Comments