అతి గొప్ప భారతీయ పురాతన సాధనం యోగా

 

నెల్లూరు జూన్ 21 (ప్రజా అమరావతి);


శారీరకంగా, మానసికంగా మనిషిని దృఢంగా తయారుచేసి తననుతాను అత్యుత్తమంగా తీర్చిదిద్దుకునే అతి గొప్ప భారతీయ పురాతన సాధనం యోగా


అని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అన్నారు. 


8 వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఉదయం  జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గోన్నారు. తొలుత  జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు, ఇతర అధికారులు, ఔత్సాహికులు దాదాపు వేయి మందితో కలిసి యోగా గురువు స్వప్న ఆధ్వర్యంలో యోగా చేశారు. 


అనంతరం జరిగిన సభ లో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 7 సంవత్సరాల క్రితం ఐక్యరాజ్యసమితి ద్వారా గుర్తింపు పొంది,నేడు  ప్రపంచ వ్యాప్తంగా 175 దేశాల్లో యోగా దినోత్సవాన్ని పాటించడం గొప్ప విషయమన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు యోగాను ఆచరిస్తున్నారన్నారు.  నేటి ఒత్తిడి సమాజంలో చిన్ననాటినుండే యోగాని ఆచరించడం ద్వారా పిల్లలు ఒత్తిడిని జయించి పరిపూర్ణ పౌరులుగా మారుతారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నారు. ప్రాణాయామం, వివిధ రకాల ఆసనాలు ద్వారా ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని అందుకోవచ్చన్నారు. యోగాను మన జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. దాదాపు వేయి మందికి పైగా విద్యార్థులు, యోగా సాధకులతో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయుష్, సెట్నల్ అధికారులను జిల్లా కలెక్టర్ అభినందించారు. చివరగా యోగా గురువులను, కార్యక్రమ నిర్వాహకులను, సహాయ సహకారాలు అందించిన సంస్థలను జ్ఞాపికలతో జిల్లా కలెక్టర్ సత్కరించారు.


ఈ కార్యక్రమంలో  నెల్లూరు మున్సిపల్ కమిషనర్ యం. జాహ్నవి, జిల్లా అటవీశాఖ అధికారి కె.వి. షణ్ముఖ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. పెంచలయ్య, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఎం గోవిందయ్య జిల్లా యువజన సంక్షేమ అధికారి మహేందర్ రెడ్డి, సెట్నల్ అధికారి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. Comments