22.06.2022.
విజయవాడ (ప్రజా అమరావతి);
భారతి సిమెంట్స్‌కు నీరు ఇస్తే ఏడుపెందుకు?
బాబు హెరిటేజ్‌కు, రామోజీ ఫిల్మ్ సిటీకి కరెంటు, నీరు ఇవ్వడం లేదా?
సూటిగా ప్రశ్నించిన మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్
భారతి సిమెంట్స్‌కు నిబంధనల ప్రకారమే నీటి సరఫరా
పరిశ్రమలకు నీరు, విద్యుత్ సరఫరా ప్రభుత్వ బా«ధ్యత
అది ఏ కంపెనీ అయినా సరే. అన్నింటికీ ఒకే నియమం
అయినా ఈనాడు పత్రికలో దుష్ప్రచారం చేస్తున్నారు
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలూ హర్షించడం లేదు
పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్
నేడే (గురువారం) ఆపాచీ రెండో యూనిట్‌కు భూమి పూజ
తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో పలు కంపెనీలు
టీసీఎల్, సన్నీ ఒపోటెక్, డిక్సన్, ఫాక్స్‌లింక్స్ తదితర పరిశ్రమలు
ఆ కంపెనీలను ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్
ఒక ప్రకటనలో మంత్రి శ్రీ గుడివాడ అమర్‌నాథ్
– రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం సీఎం శ్రీ వైయస్ జగన్ చిత్తశుద్ధితో ఎంతో కృషి చేస్తుంటే.. మరోవైపు ఈనాడు అదే పనిగా విషం చిమ్ముతోంది. భారతి సిమెంట్స్‌కు అక్రమంగా నీరు సరఫరా చేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేస్తోంది. ఒక కంపెనీకి నీరు, విద్యుత్ సరఫరా చేయడం, ఆ పరిశ్రమకు తగిన వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది భారతి సిమెంట్ కంపెనీ కావొచ్చు. హెరిటేజ్ కావొచ్చు. ఎవరైనా సరే అది ప్రభుత్వ బాధ్యత.
భారతి సిమెంట్ కంపెనీకి అక్రమంగా నీరు ఇస్తున్నారంటూ ఈనాడు రాస్తున్న కధనాలను ప్రజలు కూడా తప్పు పడుతున్నారు. హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. దానికి మంచి నీరు, విద్యుత్ ఇవ్వడం లేదా? అదే విధంగా ఈనాడు ప్రచురణ కేంద్రాలకు విద్యుత్ సరఫరా అవసరం లేదా? వాటికి నీరు అందించాల్సిన అవసరం లేదా?
పరిశ్రమల్లో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ కంపెనీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కంపెనీ అనేది ఎక్కడా ఉండదు. అలాంటి భావజాలంతో చూసే ప్రభుత్వం మాది కాదు.
రాష్ట్రంలో ప్రతి పరిశ్రమకు మేలు చేయడంతో పాటు, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా సీఎంగారు పని చేస్తున్నారు. అయినా ఒకే కంపెనీకి మేలు చేసే విధంగా ప్రభుత్వం పని చేస్తోందన్నట్లుగా తెలుగుదేశం నాయకులు మాట్లాడడం, ఈనాడు పత్రికలో ఆ విధంగా రాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజానికి అలాంటి రాతలను ప్రజలు కూడా హర్షించడం లేదు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో హిల్‌టాప్ సెజ్ ఫుట్‌వేర్ ఇండియా లిమిటెడ్ (అపాచీ) పాదరక్షల తయారీ యూనిట్‌కు సీఎం శ్రీ వైయస్ జగన్, గురువారం నాడు భూమి పూజ చేస్తారు. దాదాపు రూ.800 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ ద్వారా సుమారు 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. అక్కడ దాదాపు 290 ఎకరాల్లో ఫుట్‌వేర్ సెజ్‌ను అపాచీతో కలిసి ఏర్పాటు చేయబోతున్నాం. అపాచీ ఇప్పటికే రాష్ట్రంలో వైయస్సార్‌గారి హయాంలో ఒక యూనిట్ ఏర్పాటు చేసింది. దాని ద్వారా 15 వేల మందికి ఉపాథి లభిస్తోండగా, ఇప్పుడు మరో యూనిట్ ద్వారా మరో 10 వేల మందికి ఉపాధి లభించనుంది.
దీంతో పాటు తిరుపతి విమానాశ్రయం పక్కనే ఉన్న రెండు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో టీసీఎల్, సన్నీ ఒపోటెక్, డిక్సన్, ఫాక్స్‌లింక్స్.. కంపెనీలను సీఎంగారు ప్రారంభించనున్నారు. సుమారు రూ.2900 కోట్లతో ఏర్పాటు కాగా, వాటి ద్వారా దాదాపు 15 వేల మందికి ఉపాధి లభించనుంది.
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో ఏకంగా రూ.11,500 కోట్ల పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటు, వాటి ద్వారా దాదాపు 60 వేలకు పైగా మందికి ఉపాధి లభించే విధంగా చర్యలు తీసుకోగా.. ఇప్పటికే రూ.4 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా 28 వేల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. భవిష్యత్తులో అన్ని పరిశ్రమలతో పాటు, ఎలక్ట్రానిక్స్ క్లస్టర్లను కూడా మరింతగా అభివృద్ధి చేయబోతున్నాం.
addComments
Post a Comment