నేటినుండి ఆరుద్ర కార్తె ప్రారంభం

 *నేటినుండి ఆరుద్ర కార్తె ప్రారంభం.*


*తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు*


ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి , తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు...


ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు.. కానీ పల్లెటూళ్లో ఉండే పెద్దవారికి ఓ 30 ఏళ్లు పైబడిన వారందరికీ ఆ పురుగులు ఏంటో అవి తీసుకొచ్చే మెసేజ్ ఎంటో స్పష్టంగా తెలుసు..


ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి. వీటిని ఏ రైతు చంపడు.. ఎవ్వరినీ చంపనీయడు.. దేవతలకు , వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.. కొలుస్తారు..


అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు బాగపడి కాలమవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి. ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సంవృద్ధిగా వర్షాలు పడతాయని సంకేతం.. చెరువులు , కుంటలు , ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది.


ఈ అరుద్ర పురుగులు మనకు కనిపిస్తున్నాయంటే ఈసారి కాలమైనట్టే లెక్క.. ‘అరుద్ర’తో రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.


బీడువారిన నేతలపై తొలకరి జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేస్తాయి. అలా ఆరుద్రపురుగులు నేలపై కనిపిస్తే ఆ సంవత్సరం వర్షాలు ఎక్కువగా కురుస్తాయనీ..రైతన్నలు చక్కగా వ్యవసాయం చేసుకోవచ్చని అంటారు. అలా..ఆరుద్ర పురుగులకు , రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఎర్రగా , బొద్దుగా చూడ ముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగు ఆగమనాన్ని రైతులు శుభసూచకంగా భావిస్తారు. ఇక వ్యవసాయం పనులు మొదలు పెట్టుకోవచ్చని ఆనందంగా పొలాలకేసి మళ్లుతారు.  


ఎర్రగా..బొద్దుగా..చక్కటి రంగులో మెరిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి. వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్తె అనుకూలమైంది. ఈ కార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర. అందుకే దాన్ని ఆరుద్ర పురుగు అంటారు. ఇవి ప్రకృతి నేస్తాలు. సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి. ఈ పురుగులను రైతులు చూస్తే చాలు ఆనందంతో పరవశించిపోతారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకం.సుబ్బారెడ్డి


మనిషి స్వార్థం కోసం విచ్చలవిలవిడి ఎరువులు , రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్యకాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. 


ఈ ఆరుద్ర పురుగును కొన్ని చోట్ల పట్టు పురుగు అనీ , చందమామ పురుగు అనీ , లేడీ బర్డ్ అనీ ,  ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు.  ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో , పచ్చగడ్డి కాసింత ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి. ఈ అందమైన , మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే , బిల బిల మంటూ కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి.

Comments