పారిశ్రామిక పార్కులలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి*పారిశ్రామిక పార్కులలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి*


*హిందూపుర్ లో మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణతో కలిసి మొక్కలు నాటిన ఏపీఐఐసీ ఛైర్మన్*


*జూన్ 20 నుంచి జూలై 5 వరకూ  "ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్ (ఐఈఐడీ)"* 


*గుంటూరులో స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి డ్రైవ్ ని ప్రారంభించిన వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*


*రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో పర్యావరణంపై పూర్తిస్థాయిలో ఏపీఐఐసీ దృష్టి*


*పారిశ్రామిక పార్కుల్లో 15 రోజుల్లో వెలుగు రేఖలు : ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*


అమరావతి, జూన్, 20 (ప్రజా అమరావతి): పారిశ్రామిక పార్కులలో పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశంతో  "ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్ (ఐఈఐడీ)కి" శ్రీకారం చుట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రతి పరిశ్రమకు ఏపీఐఐసీ పునాది అని, దాన్ని అందరూ తమ సొంత నివాసంగా భావించి చక్కదిద్దుకోవాలన్నారు.  హిందూపూర్ అమ్మవారిపల్లిలోని కియా పరిశ్రమలో మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణతో కలిసి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ఛైర్మన్ ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున భాగస్వామ్యం కావాలని ఛైర్మన్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి దార్శనికతతో తీసుకున్న మంచి ఆలోచనని ఆచరణలో చూపాలని ఆయన కోరారు. *నా కలను ఏపీఐఐసీ నిజం చేసింది : గుంటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా*


ఎప్పటి నుంచో తన నియోజకవర్గం గుంటూరు పరిధిలో ఉన్న ఆటోనగర్ ని అభివృద్ధి  చేయాలనుకున్న తన కల నిజం కాబోతుందని ఎమ్మెల్యే ముస్తఫా వెల్లడించారు. ఈ సందర్భంగా జీవో నంబర్ 5,6లో గల ఇబ్బందులను ఎమ్మెల్యే ఎండీకి వివరించారు. 50 శాతం ఫీజు అందరూ కట్టే పరిస్థితి లేని నేపథ్యంలో ఆ మొత్తాన్ని తగ్గించాలని కోరారు. ఆటోనగర్ పర్యావరణం మారాలంటే ముందు మనం వ్యక్తిగతంగా మారాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆటోనగర్ లో చిన్న పరిశ్రమలకు పన్నులు కట్టలేని దీనస్థితి వారిపై మానవతతో స్పందించి వారికి జరిమానాలు లేకుండా చూడాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమస్యలపై ఎండీ సానుకూలంగా స్పందించారు. ఏపీఐఐసీ ఛైర్మన్, బోర్డు వ్యవస్థల్లో ఈ నిర్ణయాలను చర్చించి మేలు జరిగే నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నిస్తామని బదులిచ్చారు.  


*15 రోజులలో పారిశ్రామిక పార్కులు రూపురేఖలు మారాలి : ఏపీఐఐసీ వీసీ&ఎండీ* 


గుంటూరు జిల్లా ఆటోనగర్ లో ఐఈఐడీని స్థానిక ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి ఏపీఐఐసీ వీసీ&ఎండీ సుబ్రమణ్యం జవ్వాది పర్యావరణ పరిరక్షణ డ్రైవ్ ని ప్రారంభించారు. జూన్ 20 నుంచి మొదలైన ఈ డ్రైవ్ జూలై 5వ తేదీ వరకూ కొనసాగనుందని ఆయన స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కుల్లో తుప్పలను తొలగించడం, పేర్లను సూచించే బోర్డుల ఏర్పాటు, వీధి దీపాల ఏర్పాటు, వరద కాల్వల నిర్వహణ, రహదారుల మరమ్మతులు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఏపీఐఐసీ  వీసీ&ఎండీ పేర్కొన్నారు. ఉద్యోగం, వాణిజ్యం ఇలా రకరకాల కారణాలతో ఇంట్లో కన్నా ఎక్కువగా గడిపే పారిశ్రామిక పార్కును పచ్చగా కళకళలాడేలా మలచుకోవాలని పిలుపునిచ్చారు. ఎవరి పరిశ్రమకు సంబంధించి వారు జాగ్రత్తలు తీసుకున్నా సగం పని పూర్తయినట్లేనని ఎండీ తెలిపారు. మున్సిపాలిటీ ఉద్యోగులతో భాగస్వామ్యమై పారిశుద్ధ్య పనులు చక్కదిద్దుకోవాలన్నారు.  ఐలా కమిషనర్, పారిశ్రామికవేత్తల బృందం  ఒక కమిటీలా తయారై పార్కులలో ప్రతి సమస్యను పరిష్కరించుకునే సమయమిదేనని ఎండీ సుబ్రమణ్యం వివరించారు.  కరోనా సమయంలోనూ ఎమ్ఎస్ఎమ్ఈ పారిశ్రామికవేత్తలకు గత రెండేళ్లు వంద శాతం ప్రోత్సాహక బకాయిలు చెల్లించామని, ఆ మొత్తం రూ.1700కోట్లని ఎండీ వెల్లడించారు. ఆగస్ట్ లోపు బకాయిలు కట్టిన ప్రతి పారిశ్రామికవేత్తకు మొత్తం సొమ్ములో 5 శాతం సబ్సిడీ వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు. సమయం నిర్దేశించుకుని పార్కుల నిర్వహణకు ముందడుగు వేయాలని ఆయన కోరారు. ఆటోనగర్ లో ఎమ్ఎస్ఎమ్ఈ యూనిట్లకు చెందిన పారిశ్రామికవేత్తలు పలు సమస్యలను ఎండీకి వివరించగా వాటిని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమమని, ఇందులో భాగస్వామ్యమవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఏపీఐఐసీ ఈడీ రాజేంద్రప్రసాద్, సీజీఎం (పర్సనల్, అడ్మిన్) జ్యోతి బసు, జోనల్ మేనేజర్  గోపి క్రిష్ణ , డివిజన్ కార్పొరేటర్ తదితరులు పాల్గొన్నారు.


*రాష్ట్రవ్యాప్తంగా ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులలో పండుగ వాతావరణం* 


ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులలో పండుగ వాతావరణం నెలకొంది. అన్ని జిల్లాలలోని  జోన్లలో స్థానిక నాయకులు, ఏపీఐఐసీ డైరెక్టర్లు, ఉన్నతాధికారులు, జోనల్ మేనేజర్ల ఆధ్వర్యంలో  "ఇండస్ట్రియల్ ఎన్విరాన్ మెంట్ ఇంప్రూవ్ మెంట్ డ్రైవ్ (ఐఈఐడీ)" లాంఛనంగా ప్రారంభమైంది. క్రిష్ణా జిల్లాలోని కానూరు ఆటోనగర్ లో ఏపీఐఐసీ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మీ, ఓఎస్డీ ల్యాండ్స్ సాధన, జోనల్ మేనేజర్ శ్రీనివాస్ సమక్షంలో మొక్కలు నాటే కార్యక్రమంతో ఐఈఐడీకి శ్రీకారం చుట్టారు. తిరుపతి జోన్ పరిధిలో గాజులమండ్యం పారిశ్రామిక పార్కులో ఐఈఐడీ కార్యక్రమం పైలాన్ ఆవిష్కరణతో మొదలైంది. ఏపీఐఐసీ సీజీఎం లచ్చిరామ్, జోనల్ మేనేజర్ సోనీ , డీజెడ్ఎం జవహర్ బాబు సహా ఏపీఐఐసీ సిబ్బంది కలిసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కాకినాడలోని రమణయ్యపేట పారిశ్రామిక పార్కులో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ కంపెనీ సెక్రటరీ శివారెడ్డి, జోనల్ మేనేజర్ ఆండాలమ్మ, డీజెడ్ఎంలు హరి, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. డ్రైన్ల పారిశుద్ధ్య కార్యక్రమాలనూ నిర్వహించారు. ప్రకాశం జిల్లాలో మొక్కలు నాటి , నీరు పోసి పారిశ్రామిక పార్కులలో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ఏపీఐఐసీ డైరెక్టర్ మువ్వా స్వాతి, జోనల్ మేనేజర్ వెంకటేశ్వర్లు ఆరంభించారు. కర్నూలు జిల్లా కల్లూరు ఇండస్ట్రియల్ పార్కులో జోనల్ మేనేజర్ సిద్ధయ్య ఆధ్వర్యంలో డ్రైవ్ జరిగింది. తిరుపతి ప్రత్యేక జోన్ పరిధిలో ఐఈఐడీ కార్యక్రమం ఏపీఐఐసీ డైరెక్టర్ ఆవుల సుకన్య, జోనల్ మేనేజర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది.  మొక్కను నాటి వారు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కడపలో జరిగిన ఐఈఐ డ్రైవ్ లో కడప(పులివెందుల) ఏపీఐఐసీ డైరెక్టర్ చంద్ర ఓబుల్ రెడ్డి, డీజెడ్ఎం శివజ్యోతి తదితరులు పాల్గొన్నారు.  


Comments