*వ్యవసాయాన్ని ఒక పండగలా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి*
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
చెన్నేకొత్తపల్లి (శ్రీ సత్యసాయి జిల్లా), జూన్ 14 (ప్రజా అమరావతి):
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఒక పండగలా మార్చడం జరిగిందని జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో మంగళవారం డా.వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడం మానవ జాతి మనుగడనే కాపాడుకోవడమేనని నమ్మిన ఈ ప్రభుత్వం ఎన్నో బృహత్తర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. గ్రామాల్లో వ్యవసాయ విప్లవం సృష్టిస్తున్న రైతు భరోసా కేంద్రాలు, పంట నష్టం జరిగితే సీజన్ ముగిసేలోపే పంట నష్టపరిహారం అందించే ఇన్పుట్ సబ్సిడీ, 40 శాతం రాయితీతో రైతు చెంతకే విత్తన పంపిణీ, రాయితీపై వ్యవసాయ యంత్రాలు సరఫరా చేసే వైయస్సార్ యంత్ర సేవా పథకం లాంటి ఎన్నో బహుళ ప్రయోజన సదుపాయ కేంద్రాలతో వ్యవసాయాన్ని ఒక పండగలా మలిచి ఎన్నో విజయగాదల్ని మన రాష్ట్రం నమోదు చేసుకుందన్నారు. వ్యవసాయ రంగంలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని, వ్యవసాయ రంగంలో జాతీయ అభివృద్ధి రేటు కన్నా మన రాష్ట్ర అభివృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉందని గుడ్ గవర్నర్ సూచి ఇప్పటికే చాలాసార్లు తెలియజేసిందన్నారు. వ్యవసాయ రంగంలో ఆంధ్ర ప్రదేశ్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇచ్చే స్కోచ్ గవర్నెన్స్ అవార్డు ఈ సంవత్సరం కూడా మన రాష్ట్రానికే దక్కిందన్నారు. రైతులు ఒక పంట నష్టపోయిన వెంటనే మరొక పంట వేయాలనే ఆర్థిక స్తైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో 2019వ సంవత్సరం నుంచి డా. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. రాష్ట్రస్థాయిలో డా. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఇప్పటివరకు 45 లక్షల మంది రైతులకు 6,700 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తే, అందులో అధిక భాగం కరువు కాటకాలతో నిత్యం అల్లాడుతున్న అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల రైతాంగానికి అందజేయడం జరిగిందన్నారు. శ్రీ సత్య సాయి జిల్లాలో ఈరోజు విడుదల చేసే 256 కోట్ల రూపాయల బీమా పరిహారంతో కలిపి ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది రైతులకు 556 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందుతున్న జిల్లాలోని చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని రాష్ట్రస్థాయి డా. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద నిధులు విడుదల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జిల్లా రైతాంగం చేసుకున్న అదృష్టమన్నారు. రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని మన జిల్లాలో నిర్వహిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి శ్రీ సత్య సాయి జిల్లా రైతాంగం తరఫున, ప్రజలందరి తరపున, జిల్లా పరిపాలనా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లాకలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్ టి రైతు పక్కిరప్ప మాట్లాడుతూ ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది అన్నారు. తనకు 4 ఎకరాల పొలం ఉందని, తాను చిన్నకారు రైతుని, డా. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 9 వేల రూపాయల లబ్ధి కలిగిందని రైతు భరోసా కేంద్రం నుంచి అధికారులు తెలపడం జరిగిందని, ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు మే నెలలో వైఎస్సార్ రైతు భరోసా పీఎం కిసాన్ కింద 7,500 లబ్ది కలిగిందని, నవంబర్, డిసెంబర్ నెలలో అధిక వర్షాలు వచ్చి వేరుశనగ పంట నష్టపోతే ఈ క్రాఫ్ బుకింగ్ చేయించుకోవడం వల్ల పరిహారం 24 వేల రూపాయల లబ్ధి కలిగిందన్నారు. అలాగే ఈ రోజు ఉచిత పంటల బీమా కింద 33 వేల రూపాయలు రావడం జరిగిందన్నారు. గతంలో విత్తన వేరుశెనగ కోసం మండలాలకు వెళ్లి 2,3 రోజుల పాటు కష్టపడి విత్తనం తెచ్చుకునేవారమని, ఈరోజు మా గ్రామంలో రైతు భరోసా కేంద్రం పెట్టిన తర్వాత మన ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి విత్తనశుద్ధి చేసి రైతులకు నాణ్యమైన విత్తనం అందిస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, మందులు రైతులకు అందుతున్నాయని, సకాలంలో తాము పంట పెట్టుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. డా. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద వేరుశనగ పంటకే కాకుండా జామా, చీని, అరటి లాంటి 12 రకాల పంటలకు పంట భీమా అందించిన ఘనత సీఎం జగనన్న కే దక్కుతుందన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. తనకు ఒక కూతురు ఉందని, ఆ అమ్మాయిని కర్నూలులో డిగ్రీ చదివిస్తున్నానని, మీరిచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ తోనే చదివించగలగుతున్నానన్నారు. మా భార్య సంఘంలో ఉందని, వైయస్సార్ ఆసరా కింద 12 వేల రూపాయల లబ్ధి కలిగిందని, వైయస్సార్ చేయూత కింద 18,750 రూపాయల లబ్ధి కలిగిందని, ఇలా అన్ని రకాల లబ్ది కలుపుకుని ఒక సంవత్సరంలో తన కుటుంబానికి 90,850 రూపాయల లబ్ధి కలగడం జరిగిందన్నారు. మూడేళ్లు కలుపుకుంటే తమ కుటుంబానికి 2 లక్షల 70 వేల రూపాయల లబ్ధి కలగడం జరిగిందన్నారు. జగనన్న ప్రభుత్వంలో వ్యవసాయం పండగలా మారిందని రైతు తెలిపారు.
అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభా వేదికపై ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో డా. వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభోత్సవాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రైతులు, మహిళలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment