*ప్రజలకు చిరునవ్వుతో పని చేయండి... సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే హితవు
*
మంగళగిరి (ప్రజా అమరావతి);
మంగళగిరి రాజీవ్ సెంటర్లో నూతనంగా కోటి 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం జరిపిన 7, 9 వార్డు సచివాలయాలకు సంబంధించిన గుర్రం జాషువా సచివాలయ భవనంను సోమవారం ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరై భవనాన్ని ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ప్రజలు తమ అవసరాల తీర్చుకోవడానికి సచివాలయంకు వచ్చినప్పుడు సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు చిరునవ్వుతో పని చేసినట్లైతే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి కలలు కన్నటువంటి సచివాలయ వ్యవస్థకు అర్థం తీసుకొచ్చిన వారవుతారన్నారు. ప్రజల అవసరాలు తీర్చడానికి, ప్రజలకు అండగా నిలవటానికి రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందన్నారు. ప్రజలకు దూరంగా అసౌకర్యంగా ఉండే అద్దె భవనాలు కన్నా పూర్తి సౌకర్యాలతో ఉన్న భవనాన్ని నిర్మించుకుంటే సచివాలయం సిబ్బంది చక్కగా పని చేయడానికి దోహదపడుతుందని, సుమారు కోటి 40 లక్షల లక్షల రూపాయల వ్యయంతో భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆశలకు మనం వాస్తవికత తీసుకు రావడం అంటే వార్డు సచివాలయం ద్వారా ప్రజలకు మరింత చేరువ అవ్వడమే అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వివాదాస్పదంగా ఉన్న స్థలమును స్థానిక పెద్దలు సచివాలయ నిర్మాణం కోసం కార్పొరేషన్ కు అందించడం అభినందనీయమన్నారు. ప్రజలకు అండగా నిలబడి సచివాలయం సిబ్బంది పని చేయాలన్నారు. ఎమ్మెల్సీ హనుమంతరావు మాట్లాడుతూ పరిపాలన విధానం సచివాలయ వ్యవస్థ ద్వారా మన ఇంటి ముందుకు రావడం ద్వారా పేద మధ్య తరగతి ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు.
తొలుత భవనం ఆవరణలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్, గుర్రం జాషువా, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను స్థానిక చర్మకారునిచే ఆవిష్కరింప చేయడం విశేషం.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శ్రీమతి హేమమాలిని, మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ మునగాల భాగ్యలక్ష్మి, పద్మశాలీయ కార్పొరేషన్ డైరెక్టర్ పారేపల్లి విజయలక్ష్మి, మాజీ కౌన్సిలర్స్ కలకోటి స్వరూపారాణి, సంకే సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవన నిర్మాణానికి కష్టపడిన డిఈ శ్యామల కృష్ణారెడ్డి, ఏఈ కిషోర్ లను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సత్కరించారు.
addComments
Post a Comment