*లీజు పై ఆర్ అండ్ బి కాళీ స్థలాలు ఇచ్చేందుకు చర్యలు
*
*రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)*
అమరావతి, జూన్ 7 (ప్రజా అమరావతి): వాణిజ్య ప్రాంతాల్లోనున్న రోడ్లు, భవనాల శాఖకు చెందిన కాళీ స్థలాలను లీజుపై ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా) అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్లో రోడ్లు, భవనాలు, జాతీయ రహదారులు, రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి సమావేశమై రాష్ట్రంలో రోడ్లు, భవనాల నిర్వహణ పనుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖకు చెందిన కాళీ స్థలాలు ఎన్నో ఉన్నాయని, అవి అన్యాక్రాంతానికి గురికాకుండా ఉండేందుకై వాటిని సత్వరమే వినియోగంలోకి తేవాలని అధికారులకు సూచించారు. విజయనగరం, గుంటూరు, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భవన నిర్మాణాలను ఇప్పటికే చేపట్టడం జరిగిందని, అదే తరహాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా భవన నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, అలా కాని పక్షంలో ఆయా స్థలాలను లీజుపై వినియోగించుకునే విధంగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాలన్నారు. తద్వారా రోడ్లు, భవనాల కాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించుకనే అవకాశాలు ఏర్పడతాయన్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలోనున్నరోడ్ల పనులను వేగవంతం చేయాలని, వాటి నాణ్యతలో ఎటు వంటి రాజీలేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రగతిలోనున్న రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తాను స్వయంగా పర్యటిస్తానని అధికారులకు మంత్రి తెలిపారు. తమ పర్యటన ప్రారంభంలోపు ఇంజనీరింగ్ అధికారులు అంతా క్షేత్ర స్థాయిలో పర్యటించి రోడ్లు మరమ్మత్తు, నిర్వహణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కాలపరిధిని పెంచకుండా ఒప్పందం ప్రకారం పి.హెచ్.సి.ల నిర్మాణ పనులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులకు మంత్రి సూచించారు. రోడ్లు, భవనాల శాఖకు చెందిన అతిథి గృహాలకు చాలా చోట్ల వాచ్మేన్లు లేకపోవడం వల్ల వాటి నిర్వహణ అధ్వానంగా తయారయిందని, అవుట్ సోర్సింగ్ పై వాచ్మేన్లను, అటెండర్లను నియమించుకునేందుకు ప్రతిపాదనలను వెంటనే ప్రభుత్వానికి సర్య్కులేట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్ల మరమ్మత్తులు, నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులను సి.ఎఫ్.ఎం.ఎస్.లో అప్లోడింగ్ చేయడంలో చాలా జాప్యం జరుగుచున్నదని, ఈ జాప్యాన్ని నియంత్రించేందుకు తగు చర్యలు తీసుకోవాలని, సాద్యమైనంత త్వరగా బిల్లుల అప్ లోడింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. సాంకేతిక సిబ్బంది కొరత వల్ల పూర్తయిన రోడ్ల పనులకు సంబందించిన ఫీల్డు మెజర్ మెంట్ పనులు మందకొడిగా సాగుచున్నందున, గ్రామ సచివాలయాల్లోని సాంకేతిక సిబ్బంది సేవలు ఇందుకు ఉపయోగించుకొనే విధంగా ప్రభుత్వ అనుమతి పొందేందుకు పైల్ సర్క్యులేట్ చేయాలన్నారు. రోడ్లు, భవనాల శాఖలో ప్రత్యేకించి రోడ్ల విస్తరణ పనులకు సంబంధించి దాదాపు 2 వేల కేసులు కోర్టులో ఎంతో కాలం నుండి అపరిష్కృతంగా ఉండటాన్ని గమనించిన మంత్రి ఆ కేసుల సత్వర పరిష్కారానికి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ప్లీడర్ కు అదనంగా మరో ప్లీడర్ ను నియమించుకునేందుకు అనుమతించాల్సినదిగా కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెంటనే పంపాలని అధికారులకు మంత్రి సూచించారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఇ.ఎన్.సి.లు వేణుగోపాల రెడ్డి, నయీముల్లా, సి.ఇ. రమేష్ కుమార్, ఏ.పి.ఆర్.డి.సి. సి.ఇ. ఎల్.శ్రీనివాసరెడ్డి, జాతీయ రహదారుల అథారిటీ సి.ఇ. రామచంద్రరావు, విద్యుత్ శాఖ సి.ఇ. బుచ్చిరాజు తదితరులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment