నెల్లూరు, జులై 6 (ప్రజా అమరావతి):-రామాయపట్నం ఓడరేవు నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పునరావాస ప్రక్రియ ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలని
జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయంలో సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మానాధ్ తో కలిసి రామాయపట్నం ఓడరేవు నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ- పునరావాసం తదితర అంశాలపై సంబంధిత రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
ఈ సందర్భంగా గుడ్లూరు తాసిల్దారు శ్రీమతి లావణ్య మాట్లాడుతూ రామాయపట్నం ఓడరేవు నిర్మాణం కోసం మొత్తం 850ఎకరాల స్థలం అవసరం ఉందని, ఇందుకోసం 180 ఎకరాల పట్టా భూమిని సేకరించి బాధితులకు నష్ట పరిహారం ఇప్పటికే చెల్లించామని కలెక్టర్ కు వివరించారు. ఆ భూమిని ఓడరేవు అధికారులకు అప్పగించామన్నారు. అలాగే 150 ఎకరాల ప్రభుత్వ భూమిని, 65 ఎకరాల అసైన్మెంట్ భూములను కూడా ఓడరేవు అధికారులకు అప్పగించామన్నారు. మరో 100 ఎకరాల చుక్కల భూములకు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేశామని, 70 ఎకరాలలో టైటిల్ వివాదాలు ఉన్నాయని, మిగిలిన భూసేకరణ ప్రక్రియ వివిధ దశలో నడుస్తోందని తాసిల్దారు కలెక్టర్ కు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇక ఏమాత్రం భూసేకరణ ప్రక్రియ ఆలస్యం జరగరాదని వెంటనే పనులు వేగవంతం చేసి, ఈనెల 20వ తేదీ కల్లా భూసేకరణ ప్రక్రియ అంతా పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిర్ధారించేందుకు కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. భూములు కోల్పోతున్న రావులపాలెం, మొండివారి పాలెం, కర్లపాలెం గ్రామస్తులకు పునరావాసం కోసం అవసరమైన లేఅవుట్ను సిద్ధం చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతివారం భూసేకరణ నివేదికను అందజేయాలన్నారు.
ఈ సమావేశంలో కందుకూరు ఆర్డీవో శ్రీ జీవి సుబ్బారెడ్డి, కలెక్టరేట్ భూ సంబంధ విషయాల తహసిల్దార్ శ్రీ వెంకట సునీల్, భూసేకరణ తహసిల్దారు శ్రీ విజయకుమార్ తదితర రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment