నెల్లూరు, జూలై 22 (ప్రజా అమరావతి): ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆగస్టు 15న జిల్లాలోని ప్రతి ఇంటి పై మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించేందుకు, జాతీయ జెండాకు ఎక్కడా అగౌరవం కలగకుండా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అపారమైన గౌరవం, భక్తిశ్రద్ధలతో అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు
చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆయన తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో హర్ ఘర్ తిరంగా, మనబడి నాడు-నేడు, జలకళ, జల జీవన్ మిషన్, జగనన్న ఇళ్ల నిర్మాణాల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా, ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరుతో దేశవ్యాప్తంగా ఆగస్టు ఒకటి నుంచి 15 వరకు దేశభక్తిని ఇనుమడింపజేసే అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, చర్చీలు, ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలన్నారు. ప్రతి ఇంటికి ఎంతో గౌరవంతో, దేశభక్తితో జాతీయ జెండాను వాలంటీర్ల ద్వారా అందించాలని సూచించారు. ప్రజలందరూ కూడా జాతీయ జెండాను తమ ఇళ్ల పై రెపరెపలాడించి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధులను గుర్తించి సత్కరించనున్నట్లు చెప్పారు.
అలాగే మనబడి నాడు నేడు పథకం కింద రెండో విడత చేపట్టిన పాఠశాలల్లో పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. జలకళ, జల జీవన్ మిషన్, జగనన్న ఇళ్ల నిర్మాణం పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్షించి, చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మండల స్థాయిలో పన్నుల వసూలు, జగనన్న స్వచ్చ సంకల్పం, నవరత్నాలు- ఇళ్లు కార్యక్రమాల్లో పురోగతి సాధించిన అధికారులకు మాత్రమే స్వాతంత్ర దినోత్సవం నాడు గుర్తింపు ఉంటుందని చెప్పారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ శ్రీ కూర్మనాథ్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ జాహ్నవి, డి ఆర్ వో శ్రీమతి వెంకట నారాయణమ్మ, జడ్పీ సీఈవో శ్రీమతి వాణి, సమగ్ర శిక్ష ఏపీసి శ్రీమతి ఉషారాణి, హౌసింగ్, మెప్మా పిడిలు శ్రీ నరసింహ, శ్రీ రవీంద్ర, ఉపాధి కల్పనాధికారి శ్రీ సురేష్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇ శ్రీ రంగ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment