నెల్లూరు,జులై22 (ప్రజా అమరావతి):--రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించాలనే ఉద్దేశంతోనే వ్యవసాయ మీటర్లు బిగించడం జరుగుతుంద
ని రైతుల ప్రయోజనాలకు నష్టం వాటిల్లే పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా లేదని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
శుక్రవారం సాయంత్రం మంత్రివర్యులు నగరంలోని పొదలకూరు రోడ్డు మార్గంలోని వారి క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా
మంత్రి మాట్లాడుతూ వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే ఆ ప్రాంతానికి చెందిన ఎన్ని మీటర్లు బిగించారు, ఎంతమందికి ఉచిత విద్యుత్తు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎన్ని యూనిట్లు ఇవ్వాల్సి ఉంది, ఎంత సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయవలసి ఉంది అనే విషయాల పైన దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తుంటే ప్రతిపక్షం విమర్శించడంతోపాటు రైతులను రెచ్చగొట్టడం సరైంది కాదని మంత్రి స్పష్టంచేశారు. లో వోల్టేజ్ సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతుంటే తగినంత సామర్ధ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేసి రైతు సమస్యలను తీర్చి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రైతులు ఎవరు కూడా వ్యవసాయ విద్యుత్ కోసం ఒక్క రూపాయికూడా చెల్లించవలసిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో 8 వేల కోట్ల రూపాయలు ఉంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బకాయిలన్నింటిని చెల్లించి ఆ కంపెనీ నుండి విద్యుత్తు కొనుగోలు చేసే పరిస్థితికి వచ్చామన్నారు. గతంలో 50 శాతం కూడా పగటిపూట విద్యుత్తు ఇచ్చే పరిస్థితి లేకపోతే దానికోసం 1700 కోట్ల రూపాయలు మంజూరు చేసి విద్యుత్ అందిస్తున్నామన్నారు. రైతుల ఖాతాల్లోనే నిధులు వేస్తామని ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోయినా, ఆ నిధులను సకాలంలో చెల్లించకపోయినా బిల్లులతో సంబంధం లేకుండా విద్యుత్తు కనెక్షన్లు తాకడానికి వీలు లేదని స్పష్టం చేశారు అంతేకాకుండా ఆ నిధుల కోసం ప్రత్యేకమైన బ్యాంకు ఖాతాలు తెరిచి వాటిని వాడుకోకుండా కంపెనీకి చెల్లించే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పటిష్టమైన పాలన కోసం గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ తెచ్చామని భూమి కొనుగోలు లావాదేవీలు జరిగే సమయంలో కట్టుదిట్టంగా వ్యవహరిస్తామన్నారు. రైతులు చేతనే విద్యుత్ ఛార్జీలు చెల్లించే వెసులుబాటు కల్పిస్తుంటే వారంతా కృతజ్ఞతా భావంతో ఉన్నారన్నారు. రైతాంగం ప్రయోజనాలను కాపాడాలనేదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వారిలో నమ్మకం విశ్వాసం పెంపొందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిఆశయం అన్నారు. రైతులకు నష్టం వాటిల్లేందుకు గాని, వారి ప్రయోజనాలకు భిన్నంగా గాని తమ ప్రభుత్వం పని చేయుటకు సిద్ధంగా లేదని చెప్పారు. రైతాంగం అవసరాలను కచ్చితంగా పరిరక్షిస్తామన్నారు. ఉచిత విద్యుత్తు తమ బాధ్యత అని పేటెంట్ గా తీసుకొని అమలు చేస్తున్నామన్నారు. వ్యవసాయ విద్యుత్ మీటర్లు బిగించడం జవాబుదారితనం కోసమే తప్ప రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. గతంలో జిల్లాలో రెండో పంటకు ఎంత నీరు ఇచ్చారని ఇప్పుడు ఎంత నీరు ఇస్తున్నామని ఒకసారి గమనించాలన్నారు. నేడు పుష్కలంగా అందుబాటులో నీరు వుండి ముందుగానే సాగునీరు,తాగునీరు అందిస్తున్నామన్నారు. రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలను తెచ్చి ఖరీఫ్ సీజన్లో కావలసిన విత్తనాలు నుండి ఎరువుల వరకు అన్ని ముంగిట్లోకి తెచ్చామన్నారు. పండించిన పంటకు ఎక్కడ లేనివిధంగా గిట్టుబాటు ధరను రికార్డు స్థాయిలో కల్పించడంతోపాటు 6 లక్షల టన్నుల దాన్యానికి గాను 4లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 36 లక్షల టన్నుల ధాన్యం సేకరించే పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నిబద్ధత ఉందని, రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యక్తిగత చిత్తశుద్ధి ఉందని రైతుల శ్రేయస్సు కోరుకునే ప్రభుత్వమని, దగా చేసేది కాదని వెల్లడించారు. మీటర్ల బిగింపుపైన రైతాంగానికి ఎవరికైనా సరే ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేసేందుకు ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
addComments
Post a Comment