సాంకేతిక పురోగతిని తీసుకురావడానికి ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుంది

 

విజయవాడ (ప్రజా అమరావతి)

స్నాతకోత్సవ ప్రసంగ పాఠవం  

డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 24వ, 25వ వార్షిక స్నాతకోత్సవం 

ఏ దేశమైనా అభివృద్ధి అనేది విద్యారంగంలో దాని అభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని, అభివృద్ధిలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇది ఒక దేశానికి వెన్నెముకగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విద్య మానవ వనరులను వృద్దికి తోడ్పడుతుందని, దేశ పురోగతిలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందన్నారు. డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 24, 25వ స్నాతకోత్సవం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించగా, విశ్వవిద్యాలయ కులపతి (ఛాన్సలర్) హోదాలో రాజ్ భవన్ దర్బార్ హాలు నుండి గవర్నర్ వెబినార్ విధానంలో ప్రసంగించారు.  స్నాతకోత్సవంలో డిగ్రీలు, మెడల్స్ పొందిన విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు.  అతిధులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, ఫ్యాకల్టీ సభ్యులు, పరిపాలనా సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ మాట్లాడుతూ..  డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 24వ మరియు 25వ కాన్వకేషన్‌లో ఛాన్సలర్ హోదాలో భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు తాము ఎంచుకున్న కెరీర్‌లో విజయం సాధించడానికి అవసరమైన నిబద్ధత, సృజనాత్మకత , ప్రతిభను అన్నీ ఖచ్చితంగా ప్రదర్శించారన్నారు.  భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక పురోగతిని తీసుకురావడానికి ఉన్నత విద్య ఒక ముఖ్యమైన సాధనంగా పరిగణించబడుతుంద



న్నారు. ఉన్నత విద్య యొక్క పరిధి, డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందని, విద్యా సంస్థలలో ప్రపంచ ప్రమాణాలను ప్రోత్సహించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం ఆరోగ్య సంబంధిత విభాగాలను ఒక గొడుగు కిందకు తీసుకురావడంతో పాటు విద్యార్ధులకు అత్యున్నత స్ధాయి బోధనను అందించటం అభినందనీయమన్నారు. విద్యార్ధులు ఎంచుకున్న రంగంలో విజయం సాధించడానికి అవసరమైన నిబద్ధత, సృజనాత్మకత, ప్రతిభ అలంబనగా ముందడుగు వేయాలన్నారు. వైద్య నిపుణులుగా సంపాదించిన జ్ఞానంతో సమాజానికి సేవ చేయడానికి కృషి చేయాలన్నారు. డిజిటల్ టెక్నాలజీలతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవడానికి కరోనా కారణమైందని తెలిపారు. పరిశోధనలను ప్రోత్సహించటానికి విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులు కొత్త ఆవిష్కరణలతో ముందుకు సాగేలా ప్రేరేపించడం ద్వారా వైద్య, అనుబంధ శాస్త్రాలలో మరింతగా నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నారు. వైద్య రంగంలో పరిష్కరించబడని సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం, ఆహారపు అలవాట్లలో మారుతున్న జీవనశైలికి అనుగుణంగా వ్యవహరించటం ముఖ్యమన్నారు. పరిశోధన కార్యకలాపాలను ప్రోత్సహించే దిశగా జాతీయ పోషకాహార సంస్ధ యూనివర్సిటీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ICMR-NIN), హైదరాబాద్, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మరియు JNTU కాకినాడతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సంతోషకరం అన్నారు. ఐటీ ఆధారిత పరీక్షా విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావటం, కాగిత రహిత పనితీరును ప్రదర్శించటం అనుసరణీయమని తెలిపారు. ఎన్ టిఆర్ – మెడ్ నెట్ కన్సార్టియం, డిజిటల్ గ్రంధాలయం అధిక నాణ్యత గల వైద్య సాహిత్యానికి ఆలంబన కావటం శుభపరిణామమన్నారు. 

విద్యార్థులు ఎక్కడ ఉన్నా జన్మభూమిని, కన్నవారి పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని గవర్నర్ తెలిపారు.  మన దేశ గొప్ప సంస్కృతి, నాగరికత గురించి గర్వపడాలన్నారు. మీరు మంచి స్థానంలో ఉండడానికి అవకాశం ఇచ్చినందుకు తల్లిదండ్రులకు, గురువులకు, దేవునికి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. మీకు అవకాశం ఇచ్చిన సమాజానికి ఏదైనా తిరిగి ఇవ్వడంలోనే జీవితంలో గొప్ప సంతృప్తి అని చెప్పారు. "వైద్యం యొక్క కళ ఎక్కడ ప్రేమించబడుతుందో, అక్కడ మానవత్వంపై ప్రేమ కూడా ఉంటుంది" అని హిప్పోక్రేట్స్ చెప్పిన మాటలను గుర్తుచేశారు. వ్యక్తిగత శ్రేయస్సు కోసం శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం యోగా, ధ్యానం సాధన చేయాలని  గవర్నర్ విద్యార్ధులకు సలహా ఇచ్చారు. నిత్య విద్యార్ధిగా ముందడుగు వేస్తే విజయం మీ బానిస అవుతుందన్నారు. నిజానికి మీరు ఊహించిన దానికంటే ఎక్కువ సామర్ధ్యం మీలో ఉందని, సరైన లక్ష్యాన్ని ఎంచుకుని మార్గం కష్టమైనప్పటికీ సాధనకు ప్రయత్నించాలని, గౌరవ ప్రదమైన జీవితం గడపాలని వివరించారు. జీవితాంతం నేర్చుకునే అలవాటును పెంపొందించుకోండి మరియు విజయం మీదే అవుతుందని బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. 

కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన ప్రముఖ కార్డియాలజిస్ట్, రీసెర్చ్ డైరెక్టర్ & కార్డియాలజిస్ట్, శ్రీ పద్మావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, తిరుపతి డా. జి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టిన సంజీవిని యాప్‌ను ఉత్తమంగా ఉపయోగించుకుందని, డిజిటల్ మెడిసిన్ అమలులో దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని తెలిపారు.  గ్రామీణ ప్రాంతాల్లో టెలి మెడిసిన్, స్వీయ సంరక్షణ తగిన వైద్య చర్యలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల చర్యలు తీసుకుందన్నారు. ఏపీ ప్రభుత్వం కరోనా సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని.. టెలిమెడిసిన్‌లో అగ్రగామిగా మారిందన్నారు. రాష్ట్రంలో 27 హబ్ లను ప్రవేశపెట్టి వాటికి 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 560 పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరియు విలేజ్ క్లినిక్‌లను అనుసంధానం చేసిందన్నారు.  ఒక్కో హబ్‌లో ఇద్దరు గైనకాలజిస్టులు, ఇద్దరు ఫిజీషియన్లు, ఒక పీడియాట్రిషియన్, ఒక కార్డియాలజిస్ట్‌లు ఆరోగ్యకేంద్రం వైద్యులకు సలహాలు ఇచ్చేందుకు ఉంటారని తెలిపారు. వారు ఆడియో మరియు వీడియో మార్గాల ద్వారా రోగులతో కనెక్ట్ సలహా ఇస్తారని తెలిపారు. భారతదేశంలో 4,00,40,925 టెలికన్సల్టేషన్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే 1,89,59,021 ఉన్నాయని, ఇది రికార్డని రాష్ట్రప్రభుత్వ సేవలను కొనియాడారు. మన రాష్ట్రం కంటే తమిళనాడు 3400, కర్ణాటక 1500, తెలంగాణ 5574, కేరళ 543 మాత్రమే చేయగలిగి వెనుకబడి ఉన్నాయని తెలిపారు. మన దేశంలో డెబ్బై శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని కానీ డెబ్బై శాతం వైద్యులు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని.. ఇది ఆందోళన కలిగించే అంశమని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ సంరక్షణ ఇంకా మెరుగుపడాల్సి ఉందన్నారు. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం 2019లో సంజీవిని యాప్‌ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రస్తుతం భారత దేశంలో 605 వైద్య కళాశాలలున్నాయని, ప్రతి ఏటా దాదాపు 91,000 మంది అల్లోపతి వైద్యులు, అలాగే 733 ఆయుష్ కళాశాలల నుండి 5,300 మంది విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారని తెలిపారు. . దాదాపు 1.4 బిలియన్ల జనాభాలో 12.68 లక్షల మంది అల్లోపతి వైద్యులు, 5.6 లక్షల మంది ఆయుష్ వైద్యులు నమోదై ఉన్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం విదేశీ వైద్య పట్టభద్రుల సంఖ్య పెరుగుతూనే ఉందన్నారు. WHO వెయ్యి మందికి ఒక వైద్యుడిని సిఫార్సు చేసిందని, భారతదేశానికి 14 మిలియన్ల వైద్యులు అవసరమన్నారు. భారతదేశం WHO ప్రమాణాలకు దగ్గరగా ఉందన్నారు. సవాళ్లు ఎల్లప్పుడూ ఉంటాయని.. మనం వాటిని ఎదుర్కొని మనల్ని మనం రక్షించుకోవాలన్నారు. గ్రామీణ ప్రజలను గౌరవించి.. వారికి తక్కువ ఖర్చుతో సేవల అందించేలా యువవైద్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

గోల్డ్ మెడల్స్ లో సత్తా చాటిన అబ్బాయిలు… మొత్తంగా అమ్మాయిలకే అధికం.. 

డా. ఎన్.టి.ఆర్. ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 24వ వార్షిక స్నాతకోత్సవంలో 67 మందికి, 25వ వార్షిక స్నాతకోత్సవంలో 60 మంది మొత్తం 127 మందికి గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, క్యాష్ ప్రైజెస్ అందజేశారు. వాటిలో అత్యధికంగా మెడల్స్ అమ్మాయిలకే దక్కగా... అగ్రస్థానంలో మాత్రం అబ్బాయిలే నిలిచారు.  24వ స్నాతకోత్సవంలో అత్యధికంగా 6 గోల్డ్ మెడల్స్ సాధించి పునాటి హరిశంకర్ అగ్రస్థానాన నిలిచాడు. 4 గోల్డ్ మెడల్స్ తో డాక్టర్ పచళ్ల సాయి రూప శ్రీ, 3 గోల్డ్ మెడల్స్ తో డాక్టర్ గీత సి. ఈ తర్వాతి స్థానాల్లో నిలిచారు. అలాగే 25వ వార్షిక స్నాతకోత్సవంలో 4 గోల్డ్ మెడల్స్, ఒక క్యాష్ ప్రైజ్ తో మొత్తం 5 మెడల్స్ సాధించి మద్ది నవీన్ కుమార్ రెడ్డి అగ్రస్థానంలో నిలిచాడు. సయ్యద్ బుష్ర నేహ 4 గోల్డ్ మెడల్స్ సాధించి తర్వాతి స్థానం  కైవసం చేసుకుంది. డా. ఎన్. సింధూజ  4 మెడల్స్ (2 గోల్డ్, 2 క్యాష్ ప్రైజ్) సాధించింది. డాక్టర్ చట్టి రామకృష్ణ 3 గోల్డ్ మెడల్స్, ఒక సిల్వర్ మెడల్ సాధించాడు.   డాక్టర్ పినపాల సుమన, పసుపులేటి సుధీర్, వరద కీర్తి కృష్ణ, విద్యా రామన్, కడగల వెంకట లక్ష్మి ప్రియాంక ఒక్కొక్కరు మూడు మెడల్స్ చొప్పున సాధించి సత్తా చాటారు.

ఈ కార్యక్రమంలో విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, తుమ్మలపల్లి కళా క్ష్రేతం నుండి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య శ్యామ్ ప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ శంకర్, యూనివర్సిటీ పాలక వర్గం సభ్యులు, విద్యావేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Comments